జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
- కలెక్టర్లకు అన్ని అంశాలపై అవగాహన అవసరం
- 14న జిల్లా కలెక్టర్ల సదస్సు
- ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలుండాలని, ప్రతి జిల్లాకు ఒకేరకమైన పద్ధతి అవలంబించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కలెక్టర్లు విధుల్లో చేరి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో జిల్లాలపై వారికి కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో అధ్యయనం చేసేలా వారికి మార్గదర్శకం చేయాలన్నారు.
నెల 14న హైదరాబాద్‌లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారులు బి.పాపారావు, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీనియర్ అధికారులు ఎన్.నర్సింగరావు, సోమేష్‌కుమార్, శాంతికుమారి, నవీన్‌మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు హాజరయ్యారు.
నో యువర్ డిస్ట్రిక్ట్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్...
జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికల రూపకల్పన, అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ’’నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’’ కార్యక్రమాలను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు వివరించారు. దీంతో జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారుచేసేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఎన్ని కుటుంబాలున్నాయి? వాటి ఆర్థిక, సామాజిక స్థితిగతులేమిటి? రహదారుల పరిస్థితి ఎలా ఉంది? రైల్వే లైన్ల వ్యవస్థ తీరు..? నీటి పారుదల ప్రాజెక్టుల స్థితి..? ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ.. మిషన్ భగీరథ పనులు ఎలా నడుస్తున్నాయి..? బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరణ ఎలా ఉంది..? నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలు...లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
వ్యవసాయ రంగం, ఉద్యానసాగు, పరిశ్రమల ఏర్పాటు, అస్పత్రుల నిర్వహణ, వైద్య, ఆరోగ్య శాఖలో లోపాలు, విద్యారంగం పరిస్థితి, పాఠశాలల్లో పిల్లల చేరిక, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అసైన్‌డ భూముల వినియోగం, అటవీ భూముల పరిస్థితి, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వినియోగం, భవన నిర్మాణాలకు అనుమతులు, గురుకుల విద్యాసంస్థల పనితీరు, విద్యుత్ సరఫరా, సబ్‌స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ అధికారులు కూడా ఈ అంశాలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించేలా చూడాలన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు, వనరులు, బలాలు, బలహీనతలు ఉంటాయని, వీటిని బేరీజు వేసుకుని జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
జనాభా వారీగా రాష్ట్రంలోని 31జిల్లాలను నాలుగు భాగాలుగా విభజించి వేర్వేరు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, పండ్లు, కూరగాయలు, తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించాలని, ఇందుకు జిల్లా పరిపాలనా విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని, సంక్షోభంలో ఉన్న విద్యుత్‌రంగాన్ని మెరుగుపర్చడమే ఇందుకు ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన సంస్థలు, కేంద్రంనుంచి రావాల్సిన నిధులకు సంబంధించి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.