20 మంది డీఏవోలపై వేటు!
తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయ నిర్ణయం
సమర్థత చూపించడం లేదని కొందరు కలెక్టర్ల నుంచి ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 20 జిల్లాల వ్యవసాయ బాస్‌లను తప్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. సంబంధిత నిర్ణయంపై ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పచ్చజెండా ఊపడంతో అందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వారి స్థానంలో జూనియర్ అధికారులనైనా నియమించాలని యోచిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ఆ శాఖ వర్గాలను కలవరపెడుతోంది.
సమర్థత చూపించకపోవడం వల్లే...
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక గతంలోని వ్యవసాయ సంయుక్త సంచాలకుల (జేడీఏ) పోస్టులను జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో)గా నామకరణం చేశారు. అలా డీఏవోలే జిల్లా వ్యవసాయ బాస్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జేడీఏ క్యాడర్ లేకపోయినా పలువురు డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ)ను సీనియారిటీ ఆధారంగా డీఏవోలుగా నియమించారు. అయితే జిల్లాలు ఏర్పాటై ఇన్నాళ్లైనా కూడా 20 మంది వరకు సమర్థత చూపించడం లేదన్న ఫిర్యాదులు కొందరు కలెక్టర్ల నుంచి వస్తున్నాయి. కలెక్టర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు డీఏవోలు సెలవులపై వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ల ఒత్తిడి భరించలేక కొందరు డీఏవోలు తమను బదిలీ చేయమని కూడా వ్యవసాయ ఉన్నతాధికా రులకు విన్నవించుకుంటున్నారు. సమర్థంగా పనిచేసే ముగ్గురు డీఏవోలు కూడా ఇదే విధంగా కోరుతున్నట్లు తెలిసింది.
సీఎం ఆదేశాలు పాటించకపోవడం కూడా..
సీఎం కేసీఆర్ 10 రోజుల క్రితం వ్యవసా యాధికారులందరినీ పిలిపించి హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను, రైతులకు అందించే సేవలపై వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీలకు రైతుకు ఎకరాకు రూ. 8 వేల పెట్టుబడి ఇచ్చే పథకంపై ఆయన నొక్కి చెప్పారు. అందుకు అధికారులు చేయాల్సిన విధులను వివరించారు. రైతు సమాచారాన్ని వచ్చే జూన్ 10 నాటికి అందజేయాలని ఆదేశించారు. కానీ చాలామంది డీఏవోలు పనిచేయడంలేదని నిర్ధారణకు వచ్చారు. 20 మంది తూతూమం త్రంగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రక్షాళన చేయకుంటే సీఎం నిర్ణయాలు అమలు చేయడం సాధ్యంకాదని వ్యవ సాయశాఖ అంచనాకు వచ్చింది. ఆగమేఘాల మీద వారిపై వేటు వేయాలని నిర్ణయించింది.