తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సమయం, ఆ తర్వాత.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం అమలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సమయం, ఆ తర్వాత.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం అమలు కాలేదని, వాటిలో 95% అబద్ధాలే ఉంటాయని సీపీఎం ధ్వజమెత్తింది. ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే చర్యలు తీసుకుంటామని కేసీఆర్ పేర్కొనడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బి.వెంకట్ ప్రస్తావిస్తూ, రోజూ అబద్ధాలు చెప్పే సీఎంపై చట్టపర చర్యలు తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం, సీఎం బహిరంగచర్చకు సిద్ధమవుతారా అని సవాల్ విసిరారు.
ఈ చర్చకు వచ్చేందుకు ఈ నెల 19 వరకు గడువునిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, నరసింహారావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19న నిజాంకాలేజీ మైదానంలో జరగాల్సిన మహాజన పాదయాత్ర ముగింపు సభావేదికను సరూర్‌నగర్ ఔట్‌డోర్ స్టేడియానికి మార్పుచేసినట్లు తెలిపారు.