నిర్వాసితుల సమస్యలపై సమరం
సీపీఎం జిల్లా శాఖలకు రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో ఆదేశం
సాక్షి,హైదరాబాద్: వివిధ జిల్లాల్లో ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం వేలాది ఎకరాల రైతుల భూములను తీసుకుంటోందని.. ఈ క్రమం లో పరిహారం, పునరావాసం, తదితర అంశాలపై ఉద్యమించాలని జిల్లా శాఖలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం ఆదేశించింది. రాష్ట్ర పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలతో పాటుగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకున్న సమస్యలపై కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన ఆ పార్టీ సమావేశాలు బుధవారం రాష్ట్ర కమిటీ భేటీతో ముగి యనున్నాయి.
జిల్లా పార్టీ నాయకత్వాలు జిల్లాలవారీగా సమస్యలను గుర్తించి రాష్ట్ర కమిటీకి నివేదించాక ఏ జిల్లాకు ఆ జిల్లా స్థానికంగా చేపట్టే ఆందోళనలను ఖరారు చేయనున్నారు. రెండు రోజుల కార్యదర్శివర్గ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం చేసిన విమర్శల నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై చర్చ జరి గింది. టీజేఏసీగా.. ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌పై విమర్శనాత్మక వైఖరిని కొనసాగిస్తారా, రాబోయే రోజుల్లో జేఏసీ, కోదండరాం వైఖరి ఎలా ఉండబోతుందన్న దానికి అనుగుణంగా సీపీఎం స్పందించాలని నిర్ణయించారు.
పాలన ఏకపక్షం: తమ్మినేని
సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రంలో తాను ఏమి చేసినా ఎదురులేదన్నట్లు వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం పార్టీ రాష్ర్ట కమిటీ సమావేశంలో రాజకీయ పరిస్థితులపై నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారని అన్నారు.