- టెండర్ నిబంధనలు సడలించిన ప్రభుత్వం
- ఈఎండీ, ఎఫ్‌ఎస్‌డీ పరిమితి భారీగా తగ్గింపు
సాక్షి,హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండటం.. ప్రజల్లో దానిపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనంత తొందరలో గణనీయ సంఖ్యలో ఇళ్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఆ ఇళ్ల నిర్మాణం లాభసాటి కాదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. దీంతో వారిని ఎలాగైనా ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో తాజాగా కాంట్రాక్టు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈఎండీ, ఫిక్స్‌డ్ సెక్యూరిటీ డిపాజిట్ (ఎఫ్‌ఎస్‌డీ)లను మార్చింది.
దీంతో చిన్న కాంట్రాక్టర్లు ముందుకొస్తారని భావిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 2.5 శాతం మొత్తాన్ని ఈఎండీగా కాంట్రాక్టర్ చెల్లించాలి. ఫిక్స్‌డ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 7.5 శాతం చెల్లించాలి. ఈ 10 శాతం డిపాజిట్లలో ఫైనల్‌బిల్లు చెల్లించే సమయంలో సగం మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు తిరిగి చెల్లిస్తారు. మిగతా సగాన్ని రెండేళ్ల తర్వాత (డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్) చెల్లించే నిబంధన ఇప్పటివరకు అమల్లో ఉంది. ఇది చిన్న కాంట్రాక్టర్లకు భారంగా ఉంది. ఈఎండీని 2.5 శాతం నుంచి 1 శాతానికి, ఎఫ్‌ఎస్‌డీని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఫైనల్ బిల్లు చెల్లించేటపుడు 2.5 శాతం డిపాజిట్ మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు చెల్లించి రెండేళ్ల తర్వాత మిగిలిన 0.5 శాతం చెల్లిస్తారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో వెంటనే దాన్ని అమల్లోకి తెచ్చారు.