‘డబుల్’కు సన్నాహాలు
► జిల్లాలో 8300 ఇళ్ల నిర్మాణాలు
► టెండర్ల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
► ఇళ్ల నిర్మాణం తర్వాతే లబ్ధిదారుల ఎంపిక
పేదల సొంతింటి కల త్వరలో నెరవేరబోతోంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాకు 8,300 ఇళ్లు మంజూర వ్వగా 14 నియోజకవర్గాలకు 5,600 ఇళ్లు, సీఎం స్కీం కింద జిల్లా కేంద్రంలో 2,300 ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే స్టేట్ రిజర్వు కోటా కింద నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి మరో 400 ఇళ్లు అదనం. ఈ ఇళ్లన్నీ పూర్తయ్యాకే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. - జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)
రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయనున్నారు. ఒక్కొక్క ఇంటికి రూ.5.4 లక్షలకు పైగా ఖర్చుచేసి ఇల్లు ఇస్తుండడంతో పేదలు వీటిపై కొండంత ఆశ పెట్టుకున్నారు. లిస్టులో పేరుంటే ఈ జీవితానికి ఇది చాలన్నట్టుగా భావిస్తున్నారు.
స్థల పరిశీలన పూర్తి
జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు జిల్లా హౌసింగ్ అధికారులు కల్వకుర్తి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో స్థలాలను పరిశీలించే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. దేవరకద్ర, నారాయణపేట్, జడ్చర్ల, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. మహబూబ్‌నగర్, గద్వాల, అచ్చంపేట , షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, మక్తల్, కొడంగల్‌లో టెండర్లను పిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కొల్లాపూర్, జడ్చర్లలో మొదటి విడత టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయగా రెండోవిడత టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా ఒక గ్రామానికి 20 ఇళ్ల చొప్పున కేటాయిస్తారు. గుడిసె, స్థలం ఉండి అక్కడే ఇల్లు నిర్మించాలని కోరేవారికి కాకుండా స్థలం లేని వారికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. తొలి విడతగా నాలుగు గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో గ్రామానికి 20 ఇళ్లు చొప్పున ఓ చోట కట్టించనున్నారు.
ఒక ఇంటికి పట్టణాల్లో అయితే రూ.5లక్షల 30 వేల యూనియన్ కాస్టు కాగా ఇందుకు రూ.75 వేలను మౌలిక వసుతులకోసం కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఇంటికి రూ.5 లక్షల4 వేలుగా నిర్ణయించారు. అక ్కడ వసతులకోసం రూ.లక్ష 25 వేలను ఖర్చుచేయనున్నారు.
నియోజకవర్గానికి 400 ఇళ్లు
ప్రతి నియోజకర్గానికి 400 చొప్పున్న డబుల్ ఇళ్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలకు 200 ఇళ్లు, జిల్లా మంత్రికి 200 ఇళ్లు కేటాంచారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో గ్రామసభల నిర్వహణ జరుగుతోంది. అక్కడ వచ్చిన దరఖాస్తులను స్థానిక రెవెన్యూ అధికారులు స్వీకరించి విచారణ చేపడతారు. ఎంపిక కమిటీ చైర్మన్‌గా జిల్లాకు చెందిన మంత్రి, కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరించాలని జీఓ నంబర్ 12ను విడుదల చేసింది.
ముందు ఇళ్లు.. తర్వాతే ఎంపిక
ముందుగా ఇళ్లను నిర్మిస్తున్నాం. ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం గ్రామానికి 20 ఇళ్లను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7 నియోజకవర్గాల్లో టెండర్లను కాల్‌ఫర్ చేశాం. 6 నియోజకవర్గాల్లో టెండర్లను పిలిచే ప్రక్రియ జరుగుతోంది.
- రమణారావు, హౌసింగ్ పీడీ