పట్టిన పట్టు విడవొద్దు
ఎర్రవల్లి.. ఆదర్శవల్లి కావాలి
♦ మే 30 వరకు అన్ని పనులు పూర్తి
♦ రెండు గ్రామాలకు మూడు రోజుల్లో గోదావరి జలాలు
♦ ఎర్రవల్లిలో ఏపీ జీవీబీ శాఖ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్: ‘పట్టిన పట్టు విడవొద్దు.. ఎత్తిన పిడికిలి దించొద్దు.. ఐక్యంగానే ముందుకు సాగుదాం.. ఎర్రవల్లి అభివృద్ధి.. తెలంగాణ మొత్తం విస్తరించాలి.. ఓ లక్ష్యం మొదలు పెట్టినం.. ఇప్పుడు బ్యాంకు వచ్చింది..రేపు అన్ని పనులు ఎర్రవల్లికే వస్తాయ్.. పది రోజుల్లో మళ్లీ వస్తా.. సభ పెట్టుకుని అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తన దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో బుధవారం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖను ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాంకు భవనంలోకి వెళ్లి వసతులను పరిశీలించారు. క్యాష్ గదిలోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టారు.
అనంతరం జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎర్రవల్లిని ఓ లక్ష్యం వైపు తీసుకువచ్చామని, ఊరంతా డ్రిప్పు ఏర్పాటు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. 1985లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు వెళ్లానని, అక్కడ గ్రామస్తుల ఐక్యతతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నారని వివరించారు. అక్కడ రెండు బ్యాంకులను ఏర్పాటు చేసుకుని రూ. 20 కోట్లు డిపాజిట్ చేశారని గుర్తు చేశారు. అంకాపూర్ మాదిరిగానే ఎర్రవల్లిలో నేడు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎర్రవల్లి గ్రామస్తులు భారీ మొత్తంలో డిపాజిట్ చేసుకోవాలని, అలాగే రుణాలు పొందాలని సూచించారు. గ్రామంలో వ్యవసాయం మొత్తం కావేరి విత్తన కంపెనీకి అప్పగించామని, వ్యవసాయంలో వచ్చిన ఆదాయాలను రైతులు బ్యాంకు డిపాజిట్ చేసుకుంటారని, లావాదేవీలు సాగుతాయని తెలిపారు.
అప్పుడే రూ.5 కోట్లు డిపాజిట్
ఎర్రవల్లిలో బ్యాంకు ప్రారంభించగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు బ్యాంకులో కలెక్టర్ రోనాల్డ్‌రాస్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన నిధులను గ్రామంలోని రైతులు ఉపయోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. కాన్వాయ్‌లో తిరుగుతూ గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఫంక్షన్‌హల్ నిర్మించే స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.
మే 30 వరకు అన్ని పనులు పూర్తి...
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో మే 30 వరకు అన్ని రకాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రెండు మూడు రోజుల్లో రెండు గ్రామాలకు గోదావరి నీళ్లు రానున్నాయని, ఇక నీళ్ల బాధలు ఉండవని చెప్పారు. డ్రిప్పు, చెరువు, కుంటల పనులను యుద్ధప్రాతిపదికనపూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చాలా కష్టపడుతున్నారని ఆయన పనితీరు అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. పది రోజలు తర్వాత మళ్లీ ఎర్రవల్లికి వస్తానని గ్రామ సభ పెట్టుకుని అన్నీ మాట్లాడుకుందామని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.