రైట్‌.. రైట్‌..! | TS Government Success Meet with RTC Unions | Sakshi
Sakshi News home page

రైట్‌.. రైట్‌..!

Published Mon, Jun 11 2018 2:25 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

TS Government Success Meet with RTC Unions - Sakshi

ఆదివారం మంత్రుల క్వార్టర్స్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌ రెడ్డి, కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చేందుకు అంగీకరించింది. మిగతా అంశాలపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో సోమవారం తెల్లవారు జాము (11వ తేదీ) నుంచి తాము తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ సర్వీసులు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు టీఎంయూ నేతల తీరుపై ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. వేతన సవరణ కాకుండా ఐఆర్‌కు అంగీకరించడం సరికాదని, ఇది కార్మికులను దగా చేయడమేనని ఆరోపించాయి. 

కొద్దిరోజులుగా టెన్షన్‌.. 
కొంతకాలంగా వేతన సవరణ కోసం డిమాండ్‌ చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.. ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టుదలకు పోవడంతో కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది. 2015లో ఎనిమిది రోజులు సమ్మె తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణకు అంగీకరించలేదు. ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొనేలా కనిపించింది. ముఖ్యంగా సమ్మెకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సమ్మెలో పాల్గొనే ఉద్యోగులను తొలగిస్తామని, ఆర్టీసీని మూసివేసే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ హెచ్చరించడం ఒక్కసారిగా వేడి రగిలించింది. దీనిపై కార్మిక సంఘాలు తొలుత ఆందోళన చెందినా.. సీఎం బెదిరింపులకు బెదరబోమని, సమ్మె చేసి తీరుతామని ప్రకటించాయి. కానీ హరీశ్‌ నేతృత్వం లోని మంత్రుల బృందం రంగంలోకి దిగి.. అటు కార్మిక సంఘాలతో, ఇటు సీఎంతో చర్చలు జరపడం ప్రారంభించాక పరిస్థితిలో మార్పు వచ్చింది.  

శాంతించిన సీఎం.. 
కార్మిక సంఘాల తీరుపై తొలుత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చివరికి సానుకూలంగా స్పందించారు. మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించేందుకు అంగీకరించారు. దీంతో ఆదివారం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ, మంత్రుల బృందానికి మధ్య ఇదే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. తొలుత 25% ఐఆర్‌ ఇవ్వాలని కోరిన కార్మిక సంఘం నేతలు.. కనీసం 18 శాతానికి తగ్గకుండా ప్రకటించాలని పట్టుబట్టారు. ఇటు సీఎం అనుమతి మేరకు మంత్రులు తొలుత 10 శాతం ఐఆర్‌ ఇస్తామని కార్మిక సంఘం నేతలకు చెప్పారు. కానీ కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు మూడు సార్లు అటు సీఎంతో, ఇటు కార్మిక సంఘంతో సమావేశమైన మంత్రులు.. చివరికి 16 శాతం ఐఆర్‌ ఇస్తామని, సమ్మె విరమించుకోవాలని కోరారు. దీనికి టీఎంయూ నేతలు సమ్మతించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమైనట్టయింది. ఆదివారం సాయంత్రం మంత్రులు, టీఎంయూ నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, చర్చలు సఫలమైనట్టు ప్రకటించారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున.. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు టీఎంయూ నేతలు వెల్లడించారు. 

ఇక ‘ఆర్టీసీ’ని సరిదిద్దే చర్యలు! 
ప్రస్తుతం ఆర్టీసీకి రూ.3 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. సాలీనా రూ.680 కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. తాజాగా 16 శాతం ఐఆర్‌ ఇవ్వనుండటంతో ఏటా రూ.200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. ఇది సంస్థపై పెనుభారం చూపే అంశం కావడంతో.. ఆర్టీసీలో దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీకి ఉన్న అప్పులను తీర్చడంలో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద కొంత బాధ్యత తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్టీసీకి డీజిల్‌ ధరల పెరుగుదల పెనుభారంగా మారిన నేపథ్యంలో... డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని, మోటారు వాహనాల పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. కొంతకాలంగా నియామకాలు లేక ఖాళీగా ఉన్న దాదాపు 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘం నేతలు, ఐఏఎస్‌ అధికారులు, పౌర సమాజం నుంచి ప్రతినిధులు అందులో సభ్యులుగా ఉంటారు.

రెండు మూడు రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని మంత్రుల బృందం వెల్లడించింది. కమిటీ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఇక చిన్నచిన్న విషయాలపై కండక్టర్లు, డ్రైవర్లను సస్పెండ్‌ చేస్తుండటంతో వారి ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతోందన్న కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశాల్లో క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకునేందుకు మరో కమిటీ వేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు సంబంధించి 27 రోజుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలన్న డిమాండ్‌ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీనిపై గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినా అమలుకాకపోవడంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే అమలు చేయాలని ఆదేశించారని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దానికి సంబంధించి బకాయిలను నగదు రూపంలో చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లను కార్మికులకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 

ఇది కార్మికులను దగా చేయడమే.. 
టీఎంయూపై ఇతర కార్మిక సంఘాల ఆగ్రహం: కేవలం మధ్యంతర భృతికి అంగీకరించి సమ్మె విరమించడం గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ వైఫల్యమేనని ఆర్టీసీలోని ఎన్‌ఎంయూ, ఈయూ, టీజేఎంయూ తదితర ఏడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన సవరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నప్పుడు.. ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతితో సరిపుచ్చటం వారిని దగా చేయడమేనని విమర్శించాయి. టీఎంయూ మరోసారి కార్మికులను మోసం చేసిందని, కార్మికుల ఆశలపై నీళ్లు చల్లి తక్కువ మధ్యంతర భృతికి అంగీకరించిందని ఎన్‌ఎంయూ నేతలు నాగేశ్వరరావు, కమల్‌రెడ్డి, నరేందర్, మౌలానా తదితరులు ఆరోపించారు. టీఎంయూ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి నిరసనగా సోమవారం తమ సంఘం నిరసన ప్రదర్శనలు చేస్తుందని ప్రకటించారు. ఇక టీఎంయూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడి తక్కువ ఐఆర్‌కు అంగీకరించిందని టీజేఎంయూ నేత హనుమంతు ఆరోపించారు. తమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అన్ని డిపోల ఎదుట టీఎంయూ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. 


ఆర్టీసీ లెక్కలివీ..
54,000 కార్మికుల సంఖ్య
3,000 కోట్లు..ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు
గత వేతన సవరణ 44% ఫిట్‌మెంట్‌
దానితో ఆర్టీసీపై పడిన భారం750కోట్లుసాలీనా
680కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు
200కోట్లు..తాజాగా ఐఆర్‌తో ఏటా అదనపు భారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement