ఆర్టీసీకి 1,500 కొత్త బస్సులు
ముఖ్యమంత్రికి ప్రతిపాదిస్తాం.. మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి తిప్పేందుకు అదనంగా 1,500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఎండీ రమణారావు తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. నష్టాలు వచ్చినా సేవలు విస్తరిస్తూనే డిపోలను లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
సీఎం పలు సందర్భాల్లో ఆర్టీసీకి రూ.2 వేల కోట్లు ఇవ్వటంతో పరిస్థితి మెరుగైందన్నారు. ప్రస్తుతం 27 డిపోలు లాభాల్లో ఉన్నాయని, త్వరలో మరో 56 డిపోలు లాభాల బాట పట్టనున్నాయ న్నారు. కరీంనగర్, రంగారెడ్డి రీజియన్లు లాభాల్లో ఉండగా మహబూబ్‌నగర్, మెదక్ రీజియన్లలో నష్టాలొస్తున్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. వజ్ర బస్సుల పనితీరు మెరుగైందని, రామ గుండం, కరీంనగర్‌కు వజ్ర సేవలు విస్తరిస్తామన్నారు. ఆస్తుల అంశాలు తప్పితే 2 రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని చెప్పారు.