'నష్టం వచ్చినా ఆర్టీసీని వదులుకోం'
- గ్రామ గ్రామాన బస్సు సౌకర్యం కల్పిస్తాం
- దేశంలోనే టీఎస్ ఆర్టీసీని ముందు వరుసలో ఉంచుతాం
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
వికారాబాద్: రోజుకు రూ.2 కోట్లు నష్టం వస్తున్నా.. ఆర్టీసీని వదిలే ప్రసక్తే లేదని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్‌లోని అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తుం డగా.. కేవలం రూ.9 కోట్లు మాత్రమే రాబడి వస్తోందన్నారు.రాష్ట్రంలో 95 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా అందులో 10,466 బస్సులు ఉన్నాయని తెలిపారు. కొత్తగా రూ.40 కోట్లతో మరో 150 ఏసీ బస్సులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు 1,200 నుంచి 1,300 వరకు గుర్తించడం జరిగిందన్నారు. మినీ బస్సులను కొనుగోలు చేసి పై గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. రాష్ర్టంలోని 95 డిపోల్లో రూ.33 కోట్లతో టాయిలెట్స్, తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేఖలు పంపుతామని మంత్రి అన్నారు. ఆర్టీసీ డిపోల అభివృద్ధికి నిజామాబాద్ ఎంపీ కవిత రూ.50 లక్షలు అందజేయడం జరిగిందన్నారు.
ఆర్టీసీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ నుంచి నెలకు రూ.18 కోట్లు అందజేయడం జరుగుతోందని వివరించారు. విద్యార్థులకు ఆర్టీసీ ఇస్తున్న బస్సు పాసులకు సంబంధించిన డబ్బును కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
ఆర్టీసీ కార్మికులు, వారి సమస్య సాధన కోసం 43 శాతం ఫిట్‌మెంట్ కోరితే 44 శాతం ఫిట్‌మెంట్ కల్పించడం జరిగిందన్నారు. ఇందు కోసం ప్రభుత్వ ఖజానాపై రూ.700 కోట్ల భారం పడిందన్నారు. అభివృద్ధిలో ఉన్న డిపోలను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్‌ఎం, డీఎంలకు స్పష్టమైన ఆవేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.