నిబంధనలు పాటించకుంటే పర్మిట్ రద్దు
ప్రైవేటు వాహనాలను నియంత్రించాల్సిందే
ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు స్టేజీ క్యారియర్లు, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలా పట్టుబడ్డ వాహనాలకు భారీ పెనాల్టీలు విధించాలని, మళ్లీ పట్టుబడితే వాటి పర్మిట్‌లనే రద్దు చేయాలన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్రమ ప్రైవేటు స్టేజీ క్యారియర్లతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుండటం, అధికారులు వాటిని పట్టించుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన అధికారులకు చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి వందల కోట్లు నష్టం తెచ్చిపెడుతున్న ప్రైవేటు వాహనాల విషయంలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించారు.
ఏసీ గదుల నుంచి బయటకు రండి...
‘ఏసీ గదుల్లో కూర్చుంటే తీరు ఇలాగే ఉంటుం ది. వెళ్లి బయట తిరగండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారు. కానీ ఉన్నతాధికారులే పనిచేయటం లేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంటే దాన్ని లాభాల్లోకి తెచ్చే చర్యలు తీసుకోకపోతే ఎలా? అక్రమంగా తిరిగే ప్రైవేటు వాహనాలు ఆ నష్టాల ను పెంచుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. అక్రమ ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల కారణంగా అమాయకులు చనిపోతున్నారంటూ... ఇటీవల పరిగి వద్ద పెళ్లి వ్యాను బోల్తాపడ్డ సంఘటనను ప్రస్తావించారు. నిర్లక్ష్యాన్ని సహించబోనని, నిబంధనలు పాటించని వాహనాలకు ముకుతాడు వేయాల్సిందేనన్నారు.
పర్మిట్లు పెరిగేలా చూడండి...
ఏపీ, తెలంగాణకు సంబంధించి కొన్ని ఆర్టీసీ బస్సుల పర్మిట్ గడువు తీరినందున తెలంగాణకు పర్మిట్ల సంఖ్య పెరిగేలా చూడాలని రమణారావు మంత్రిని కోరారు. ఏపీ మంత్రితో చర్చించి దాన్ని కొలిక్కి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు రవీందర్, పురుషోత్తమ్‌నాయక్, నాగరాజు, సత్యనారాయణ, రవాణాశాఖ జేటీసీలు వెంకటేశ్వర్లు, పాండురంగారావు, రఘునాథ్, డీటీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీకి ఏటా రూ.572 కోట్లు నష్టం...
రాష్ట్రంలోని 95 డిపోల పరిధిలో 288 రూట్లు ఆర్టీసీకి నష్టాలు తెచ్చిపెడుతున్నాయని, ఆ మార్గాల్లో 33,955 వాహనాలు అక్రమంగా తిరుగుతున్నట్టు గుర్తించామని ఆర్టీసీ జేఎండీ రమణారావు మంత్రి దృష్టికి తెచ్చారు. తద్వారా ఆర్టీసీకి సాలీ నా రూ.572 కోట్లు నష్టం వస్తోందన్నారు. గతంలో కొన్ని మార్గాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే ప్రయాణికుల సంఖ్య 4.88 లక్షల మేర పెరిగిందన్నారు. రెండు విభాగాలూ మరింత సమన్వయంతో తనిఖీల ను పెంచాలని మంత్రి ఆదేశించారు.