ఆర్టీసీని ప్రగతి బాట పట్టించాలి
హైదరాబాద్: ‘ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో ఉంది. రోజుకు రూ.9 కోట్లు ఆదాయం వస్తుంటే రూ.10 కోట్లు ఖర్చవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ సిబ్బంది జీతాలు పెంచారు. కార్మికులందరూ సమష్టిగా పనిచేసి ఆర్టీసీని ప్రగతి బాట పట్టించాలి’ అని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం టీఎస్‌ఆర్‌టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం సిల్వర్ జూబ్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహా సభ ఘనంగా జరిగాయి. ఇందులో మంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న 96 డిపోల్లో 22 మినహా మిగిలనవన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. గ్రేటర్ హైదారాబాద్‌లోని డిపోల్లో అనేక సమస్యలున్నాయి.
వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తా. జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన రూ.150 కోట్ల నిధులతో 500 బస్సులు కొనుగోలు చేశాం. అదే విధంగా ఎస్సీ కార్పోరేషన్ కూడా కొంత నిధులను ఇస్తే మరిన్ని బస్సులు కొంటాం. బస్ భవన్ పేరును అంబేడ్కర్ భవన్‌గా మార్చాలంటూ కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతా. అలాగే... ఇతర ఉద్యోగుల కాలనీలకు దీటుగా సంస్థ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ కాలనీలను ఏర్పాటు చేస్తాం. సంస్థలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని అన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప మాట్లాడుతూ... చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేడ్కర్‌కు- టీఆర్‌ఎస్ పార్టీకి దగ్గర సంబంధం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు.
30 లోగా పదోన్నతులు: జేఎండీ
టీఎస్‌ఆర్టీసీ జేఎండీ రమణారావు మాట్లాడుతూ... ఈ నెల 30 లోగా సంస్థలో పదోన్నతులు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే బ్యాగ్‌లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. మహిళా కండక్టర్ల కోసం అన్ని డిపోల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఉద్యోగి ఎం.థామస్‌రావును ఘనంగా సత్కరించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే జి.బాలరాజు, కార్పొరేషన్ కార్యదర్శి ఎం.రవీందర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.రాజయ్య, ప్రధాన కార్యదర్శి పద్మారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ధనంజయ్‌నాయక్ పాల్గొన్నారు.