‘డబుల్’ ఇళ్ల అప్పు రూ.17 వేల కోట్లు
⇒ హడ్కో నుంచి తీసుకోనున్న ప్రభుత్వం
⇒ కొత్త మంజూరీలు వద్దని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : మూడు లక్షల పది వేల ఇళ్లు... రూ.23 వేల కోట్ల బడ్జెట్... రూ.17 వేల కోట్ల రుణం.. ఇది రెండు పడకగదుల ఇళ్ల ప్రాజెక్టు తాజా చిత్రం. వచ్చే రెండేళ్లలో గణనీయ సంఖ్యలో వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన రెండేళ్లలో ఇళ్ల మంజూరీకే పరిమితం కాగా, ఈసారి పనులను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైం ది. ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లు కేవలం కాగితాలకే పరిమితమైనందున, కొత్త కేటా యింపులు చేయకుండా వాటినే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో కొత్త ఇళ్ల కేటాయింపు లేకుండా, పాతవాటికి నిధుల కేటాయింపునకే కసరత్తు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయాలంటే ప్రస్తుతం నిర్ధారించిన యూనిట్ కాస్ట్ ప్రకారం రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించటం ఇబ్బందిగా భావిస్తున్న ప్రభుత్వం రుణం తెచ్చి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం హడ్కోతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. తాజా ప్రతిపాదన ప్రకారం మొత్తం రూ.20 వేల కోట్ల ప్రాజెక్టు అంచనాలో రూ.17 వేల కోట్లు హడ్కో నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. తొలుత రూ.4500 కోట్లకు ఒప్పందం చేసుకుని రూ.1600 కోట్లు తీసుకుంది. అవి ఖర్చు కాకుండా అలాగే ఉన్నాయి. రెండో విడతగా రూ.3340 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. మిగతా మొత్తానికి త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఇంకా 2.90 లక్షల ఇళ్లు నిర్మించాలి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనం తరం 2015–16 సంవత్సరానికి సీఎం కేసీఆర్ 60 వేల ఇళ్లను ప్రకటించారు. కానీ ఆ సంవత్సరం ఒక్క ఇంటి నిర్మాణమూ ప్రారంభం కాలేదు. 2016–17 సంవ త్సరానికి మరో లక్షన్నర ఇళ్లను ప్రకటిం చారు. వీటికి అదనంగా జీహెచ్‌ఎంసీ పరి ధిలో నిర్మాణం కోసం మరో లక్ష ఇళ్లను ప్రకటించారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో నిర్మాణాల జాడే లేకుండా పోయింది. సీఎం దత్తత గ్రామాలైన ఎర్ర వల్లి, నర్సన్న పేటల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి అయి గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో పాత భవన సముదాయం తొలగించి కొత్త ఇళ్లను నిర్మించింది. ఇప్పటి వరకు 1,400 ఇళ్లనే పూర్తి చేయగలిగింది. వివిధ జిల్లాల్లో మరో 15 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ లెక్కన మరో 2.9 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాటి నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.