సాక్షి, హైదరాబాద్: పది భారీ బ్లాకులతో కూడిన సచివాలయ పాత భవనాలను కూలిస్తే వందల టన్నుల్లో కాంక్రీట్ వ్యర్థాలు ఉత్పన్నం కాబోతున్నాయి. వాటిని ఏం చేస్తారు? కొత్త సచివాలయ నిర్మాణానికి భారీ స్థాయిలో ఇసుక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో దానిని ఎక్కడ నుంచి తెస్తారు?
ఆ వ్యర్థాలనే ఇసుకగా మార్చి ఉపయోగిస్తే.. రెండు సమస్యలూ పరిష్కారమవుతాయి కదా? ఇప్పుడు ఆ దిశగానే అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త సచివాలయ నమూనా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆది నుంచి ఇష్టపడే అరబ్ నిర్మాణ శైలిలో కనిపించే గుమ్మటం డిజైన్‌తో అది ఉంటుందని దాదాపుగా స్పష్టమైంది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోయే కొత్త సచివాలయ భవన సముదాయం ఆధునిక హంగులతో ఉండనుంది. భవనంలో ఆధునికత ఉండటంతోపాటు నిర్మాణంలో కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. ఇందులో భాగంగా పాత భవనాలను కూచ్చివేయగా వచ్చే వ్యర్థాలను పునర్వినియోగించాలని యోచిస్తున్నారు.
వ్యర్థాలను పొడి చేసి...
ప్రపంచవ్యాప్తంగా ఇసుకకు కొరత ఏర్పడుతోంది. కాంక్రీట్ నిర్మాణాలు శరవేగంగా తీవ్ర మవుతుంటంతో ఇసుక వాడకం బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేస్తుండటంతో నదీగర్భం దెబ్బతిని నదుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇసుకకు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురాగా, మనదేశంలో ఇప్పటివరకు ఆ దిశగా పూర్తిస్థాయి ప్రయత్నాలు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మాత్రం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తున్నారు. భవనాలను కూల్చివేసినప్పుడు వచ్చే కాంక్రీట్ వ్యర్థాలను ఇసుకగా మార్చడం వీటిలో ఒకటి.
ఈ వ్యర్థాలను ఇసుకలాగా పొడి చేస్తారు. కొత్త నిర్మాణాల్లో దానినే ఇసుకగా వినియోగిస్తారు. అయితే పూర్తిగా దాన్నే ఇసుక బదులు వాడితే నిర్మాణాలు అంత పటుత్వంగా ఉండవన్న అభిప్రాయాలున్నాయి. దీంతో 15 శాతం నుంచి 20 శాతం వరకు అసలు ఇసుకను తగ్గించి ఈ పొడిని వాడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ఇసుకలో అంత పరిమాణం మేర ఈ వ్యర్థాల పొడిని కలిపి నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు.
ఫ్లోరింగ్ పనులకు పూర్తిగా వినియోగం..
ప్రధాన నిర్మాణంలో 20 శాతానికి మించకుండా పాత కాంక్రీట్ వ్యర్ధాల పొడిని ఇసుకలో కలిపి వాడుతున్నా, ఇతర పనులకు మాత్రం వంద శాతం ఆ వ్యర్ధాల పొడినే ఉపయోగిస్తున్నారు. ఫ్లోరింగ్, టైల్స్ వేసేచోట, ఫుట్‌పాత్‌లు, కాంపౌండ్ వాల్ సహా బయటి గోడల నిర్మాణం తదితర పనుల్లో ఈ పొడినే వాడుతున్నారు. దీనివల్ల మొత్తం నిర్మాణ వ్యయంలో దాదాపు 40 శాతం వరకు ఇసుక వాడకం తగ్గుతుంది. అంతమేర ఖర్చు ఆదా కావడంతోపాటు నదులకు కూడా రక్షణ ఏర్పడుతుంది. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే ఈ రెండు లాభాలు కలగనున్నాయి. ప్రస్తుతం పాత సచివాలయంలో పది భారీ భవనాలున్నాయి. వాటిని కూలి్చవేస్తే వందల టన్నుల కాంక్రీట్ వ్యర్థాలు వస్తాయి.
అంత భారీ మొత్తంలో వచ్చే వ్యర్థాలను ఏమీ చేయలేమని, వాటితో నగర శివార్లలో ఉన్న భారీ క్వారీ గుంతలను పూడుస్తామని గతంలో ఓ అధికారి వివరించారు. కానీ కొంతకాలంగా హైదరాబాద్‌లో కూడా భవన వ్యర్థాలను పునర్వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. అందుకు సంబంధించి కొన్ని యూనిట్లను కూడా మొదలుపెట్టింది. చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి దక్షిణ భారతదేశంలోని నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, గాందీనగర్, వడోదర వంటి చోట్ల భవనాల వ్యర్థాల రీసైక్లింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలోనూ ఈ విధానం అవలంబించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ సమాయత్తమవుతోంది. జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ దిశగా ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం.
కాంక్రీట్ నుంచి ఇసుక!
Published Mon, Aug 12 2019 1:54 AM | Last Updated on Mon, Aug 12 2019 1:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment