హామీలు ఇచ్చారు.. మోసం చేశారు: దానం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి, అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేశారని మాజీమంత్రి దానం నాగేందర్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు, రాష్ట్రానికి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకురావడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు.
తాను చెప్పేది తప్పు అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానం సవాల్ చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాల్సిన అవసరంలేదని, హైదరాబాద్ ఎప్పటినుంచో విశ్వనగరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని మంత్రి కేటీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీలో ఒక్కో కార్పొరేటర్‌కు ఒక కోటి రూపాయలను అభివృద్ధి నిధిగా ఇచ్చామని దానం చెప్పారు. టీఆర్‌ఎస్ హయాంలో కార్పొరేటర్ల పరిస్థితి దీనంగా మారిందని విమర్శించారు. మేయర్‌ను కూడా ఉత్సవ విగ్రహంగా మార్చారని ఆరోపించారు.