చంద్రబాబుకు మెంటల్‌ | KCR Fires On Sonia Gandhi At Devarkadra Praja Ashirvada Sabha | Sakshi
Sakshi News home page

మూటలు వస్తలేవనా!

Published Mon, Nov 26 2018 1:48 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

KCR Fires On Sonia Gandhi At Devarkadra Praja Ashirvada Sabha - Sakshi

ఆదివారం దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

సోనియాగాంధీకి కడుపు తరుక్కుపోతుందట. ఎందుకు తల్లడిల్లుతున్నవమ్మా? ఇక్కడి నుంచి సూట్‌కేసులు, మూటలు బంద్‌ అయినందుకా? లేక రాష్ట్రంలో 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నందుకా? చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినందుకా? తెలంగాణ బాగుపడుతున్నందుకా? పెట్టుబడి కింద రైతులకు రూ.8 వేలు ఇస్తున్నందుకా? ఎందుకు నీ కడుపు తరుక్కుపోతోంది?

చంద్రబాబుకు మెంటల్‌. అందుకే మాటిమాటికీ హైదరాబాద్‌ నేనే కట్టిన అంటున్నడు. 400 ఏళ్ల క్రితం చార్మినార్‌కు పునాదులు వేసిన కులీకుతుబ్‌షా ఈ మాటలు వింటే ఆత్మహత్య చేసుకుంటడు. హైదరాబాద్‌ను ప్రపంచానికి చూపిన సిపాయిని నేనే అంటున్న బాబు.. నాలుగున్నరేళ్లలో అమరావతికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేకపోయావ్‌?. ఆయన ఓ మాటల మరాఠీ.. చేతలుండవు. 

సాక్షి నెట్‌వర్క్‌ : ‘‘సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చే నెలవారీ మామూళ్లు ఇప్పుడు వస్తలేవా? నీ కడుపు అందుకే తరుక్కుపోతోందా? తెలంగాణ నుంచి మూటలు బంద్‌ కావడం వల్ల దుఃఖం వస్తోందా’’అని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని ఉద్దేశించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడారు.
ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ప్రజలు

‘‘సోనియాగాంధీకి కడుపు తరుక్కుపోతుందట. ఎందుకు తల్లడిల్లుతున్నవమ్మా సోనియాగాంధీ? ఇక్కడి నుంచి సూట్‌కేసులు, మూటలు బంద్‌ అయినందుకా? లేక రాష్ట్రంలో 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నందుకా? చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినందుకా? తెలంగాణ బాగుపడుతున్నందుకా? పెళ్లి చేసుకునే నిరుపేద ఆడబిడ్డలకు రూ.లక్ష ఇస్తున్నందుకా? హైదరాబాద్‌లో నిత్యం 50వేల మందికి రూ.5కే భోజనం పెడుతున్నందుకా? ఎకరాకు ఏడాదికి పెట్టుబడి కింద రైతులకు రూ.8 వేలు ఇస్తున్నందుకా? రైతుబంధు పథకం అమలు చేస్తున్నందుకా? ఎందుకు నీ కడుపు తరుక్కుపోతోంది? ఈ రోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆగినయి. భూదాన్‌ పోచంపల్లి, సిరిసిల్ల, దుబ్బాకలో కాంగ్రెస్‌ హయాంలో ఒక్కోరోజు 11, 12 మంది చనిపోయిండ్రు. ఇయాళ బంద్‌ అయినయి.. దాని కోసం నీ కడుపు తరుక్కుపోతుందా? నీ రాజ్యంలో కరెంట్‌ ఉంటే వార్త.. పోతే వార్త కాదు! ఆనాడు మోటర్లు కాలుడు, పొలాలు ఎండుడు.. ఇయాళ 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నం. దానికి బాధ అయితున్నదా సోనియాగాంధీ’’అని కేసీఆర్‌ నిలదీశారు.

వచ్చీరాని మాటలతో గోల్‌మాల్‌ చేస్తే కుదరదని స్పష్టంచేశారు. ‘‘ఈ దద్దమ్మలు రాసిస్తరు.. ఆ సోనియమ్మ చదువుతది. తెలంగాణ గడ్డ మీద మీటింగ్‌ పెట్టి.. ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటిస్తారా? అంటే ఇక్కడి పరిశ్రమలన్నీ పోవాలా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున రాహుల్‌గాంధీని డిమాండ్‌ చేస్తున్నా.. ఆంధ్రాకు ప్యాకేజీ ఇచ్చుకో, గంగల పో.. మాకేం అభ్యంతరం లేదు. ఏపీకి ఇచ్చే రాయితీలు తెలంగాణకు ఇస్తవా, ఇయ్యవా చెప్పాలె. తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా దీనిపై క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఓట్లడగాలె. లేకపోతే పొల్లు పొల్లు సంపుతరు తెలంగాణలో జాగ్రత్త.. ఇది ఉద్యమాల పురిటిగడ్డ.. పోరుగడ్డ.. ఎంతకైనా తెగిస్తాం. నీ సంగతి చూస్తాం’’అని హెచ్చరించారు. సోనియాగాంధీ నిబద్దతతో పనిచేయలేదని కేసీఆర్‌ ఆరోపించారు. ‘‘2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఉద్యమం జరిగేది కాదు. వందల మంది చనిపోయేవారు కాదు. నేను కూడా దీక్ష చేయాల్సి వచ్చేది కాదు. మొండిగా పోరాడితే గత్యంతరం లేక తెలంగాణ ఇచ్చారు.. అంతేకానీ ప్రేమతో కాదు’’అని పేర్కొన్నారు. 

చేతకాకే చంద్రబాబును తెస్తున్నరు..
టీఆర్‌ఎస్‌ నేతలను కొట్టేందుకు ఇక్కడి వాళ్లు సరిపోతలేరని ఆంధ్రకు పోయి చంద్రబాబును భూజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకొస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత సంపదను, నిధులు, నీళ్లను దోచుకున్న సీమాంధ్రులతో తెలంగాణలో కాంగ్రెస్‌ జతకట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేకనే దోపీడీ దొంగలంతా మహాకూటమిగా మారా>రని దుయ్యబట్టారు. ‘‘కాకులు..గద్దలు.. దుష్టశక్తులు ఒక్కటై తెలంగాణను దోపిడీ చేసేందుకు మళ్లీ వస్తున్నాయ్‌.. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రేక్షక పాత్ర వహిస్తే తెలంగాణను దోచుకపోతరు’’అని కేసీఆర్‌ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక వైపు.. టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయన్నారు.

‘‘50 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ ఎట్లుండెనో అందరికీ తెలుసు.. కాలిపోయిన మీటర్లు.. పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు.. అవి బాగు చేయమని ఇచ్చిన లంచాలు మనందరికి గుర్తే. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న రాష్ట్రం మనదే. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ కందిళ్లు పట్టుకొని బావుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది’’అని హెచ్చరించారు. ఆంధ్రా వలసాధిపత్యం, చంద్రబాబు నాయకత్వం మళ్లీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. రాజకీయంగా గెలవడం కోసం ఎంత నీచానికైనా కాంగ్రెస్‌ దిగుతుందని, ఎన్ని అబద్ధాలైనా చెబుతుందని దుయ్యబట్టారు. ‘‘చివరకు ఆత్మను తాకట్టుబెట్టుకుని చంద్రబాబుకు గులాం అవుతారా? ఆయనకు లొంగిపోతారా? దమ్ముంటే మీరే కొట్లాడండి. ఎవరు గెలిచినా తెలంగాణలో ఉండాలి. మళ్లీ ఆంధ్రా పెత్తనం ఎందుకు’’అని కేసీఆర్‌ 
ప్రశ్నించారు. 

106 సీట్లు గెలుస్తాం.. 
టీఆర్‌ఎస్‌ 103 నుంచి 106 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతోందని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. శనివారం ఎన్నికలపై సమీక్షించానని, తాజా సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఎవరైతే మంచి చేస్తారో వారినే ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అవినీతి రహిత, భూకబ్జాలు లేని పాలన అందించామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. 

తాండూరు అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డికి, ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఓటు వేయాలని కోరుతున్న కేసీఆర్‌

చంద్రబాబుకు మెంటల్‌... 
మాటిమాటికీ హైదరాబాద్‌ నేనే కట్టిన అంటున్న చంద్రబాబుకు మెంటల్‌ అని కేసీఆర్‌ దుయ్యబట్టారు. 400 ఏళ్ల క్రితం చార్మినార్‌కు పునాదులు వేసిన కులీకుతుబ్‌షా ఈ మాటలు వింటే ఆత్మహత్య చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ‘‘హైదరాబాద్‌ను ప్రపంచానికి చూపిన సిపాయిని నేనే అంటున్న చంద్ర బాబు.. నాలుగున్నరేళ్లలో అమరావతికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేకపోయాడు? ఆయన మాటల మరాఠీయే కానీ చేతలుండవు. తన రాష్ట్రాన్ని సక్కదిద్దుకునేందుకు చేతకాని చంద్రబాబు.. మన రాష్ట్రానికేదో ఒరగబెడతాడంట. అమరావతి నిర్మాణం విషయంలో నాలుగున్నరేళ్లు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతూ గడిపేశాడు’’అని విమర్శించారు. 

దేశ రాజకీయాలలో మార్పు అవసరం
భారతదేశ రాజకీయాలలో పెనుమార్పులు ఎంతో అవసరం.. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాల ఏర్పాటుతోనే దేశాభివృద్ధి సాధ్యం అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, అక్కడ మైనార్టీ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండటంతో మైనార్టీ రిజర్వేషన్‌ అమలుకు నోచుకోవడంలేదని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ విషయమై తాను నాలుగేళ్ల కాలంలో 30 సార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేసీఆర్‌ విమర్శించారు. 

పార్టీలో చేరికలు...
వికారాబాద్‌ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ తనయులు నరేశ్, రాకేశ్‌ తదితరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కమతం రాంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. పరిగిలో జరిగిన సభలో కేసీఆర్‌ ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాంరెడ్డి తనయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌రెడ్డి, పరిగి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ భాస్కర్‌ గుప్త తమ వర్గీయులతో పార్టీలో చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement