జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతనాల పెంపు
రూ.1,500 చొప్పున పెంచాలని సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1,500 మేరకు వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలోనే ఒకసారి వేతనాలు పెంచిన సీఎం... మరోసారి జీతాలు పెంచు తామని పారిశుద్ధ్య కార్మికులకు హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కూడా పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని సీఎంని కోరారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో మంగళవారం పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై సీఎం సమీక్ష నిర్వహించారు. కార్మికుల వేతనాలను రూ.1,500 మేర పెంచాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడే నాటికి వారి వేతనం రూ.8,500 ఉండేది. దాన్ని గతంలో రూ.12,500కు సీఎం కేసీఆర్ పెంచారు. ఇప్పుడు మరోసారి రూ.1,500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు.
మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు కూడా
రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల కార్మికుల వేతనాల పెంపు అంశం కూడా ఈ సమీక్షలో చర్చకు వచ్చింది. దీనికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. ఆయా మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి, పన్నుల వసూళ్ల వివరాలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను సీఎం ఆదేశించారు. వివరాలు వచ్చిన తర్వాత వేతనాలు పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.