‘బస్సు చార్జీలు తెలంగాణలోనే తక్కువ’
తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువ అని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు తక్కువ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా 6.7 శాతం బస్సు చార్జీలను పెంచిందన్నారు. ఆర్టీసీకి రోజూ రూ. కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల వరకూ నష్టాలు వస్తుండడంతో సంస్థను కాపాడుకోవడానికి చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్‌నెస్‌తో వేతనాలను పెంచారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం 2010-13 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు బస్సు చార్జీలు పెంచిందన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో గురువారం కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చినారెడ్డి, డీకే రుణ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.