
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల్లో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం సర్పంచ్‌ల ప్రాంతీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన వెయ్యిమంది వరకు సర్పంచ్‌లు హాజరుకాగా మంత్రులు జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రానుందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలా లేక పరోక్షంగానా అన్నది ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర ఉంటుందన్నారు.
అనేక సమస్యలకు పరిష్కారం
ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి అన్నారు. నిధులు ఖర్చు చేయడమే సర్పంచ్‌ల విధిగా భావించొద్దని, ప్రజలను సంఘటితం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు రూ.500 కోట్ల నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు.