గ్రామస్థాయిలోనే పకడ్బందీగా బడ్జెట్
రాబడి, అభివృద్ధి పనుల ప్రణాళికల రూపకల్పన
ప్రణాళికా పనులకు మాత్రమే 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు
సర్పంచులకు వెసులుబాటుతో కూడిన అధికారాలు
పద్దుల తయారీలో సలహాలకు ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలు
2024–25 సంవత్సరానికి గ్రామాలవారీ బడ్జెట్‌ల కోసం కసరత్తు
11,403 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే అంచనాల తయారీ పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల తరహాలోనే పంచాయతీల స్థాయిలోనూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) పేరుతో బడ్జెట్‌లను పకడ్బందీగా రూపొందించే ప్రక్రియ మొదలైంది. ఈమేరకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో అంచనాల తయారీ ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచనల మేరకు ఇక పంచాయతీలకు అందే 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆ గ్రామ జీపీడీపీలో పేర్కొన్న పనులకే కేటాయించాల్సి రావడంతో ఈ బడ్జెట్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఫలితంగా గ్రామస్థాయిలో పాలకవర్గం గుర్తించిన పనులను బడ్జెట్‌లో పొందుపరుచుకునే వెసులుబాటు లభించింది. సప్లిమెంటరీ ప్రణాళిక పేరుతో సవరణ చేసుకునే అవకాశమూ లభించింది. వచ్చే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,3326 గ్రామ పంచాయతీలతోపాటు 660 మండల పరిషత్‌లు, 13 ఉమ్మడి జిల్లాల పరిషత్‌లకు కలిపి మొత్తంగా రూ.2,152 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
వీటిని గ్రామ బడ్జెట్‌లో పెట్టిన పనులకే వాడుకోవాలి. ఏడాది మొదట్లో గానీ లేదంటే మధ్యలో సప్లిమెంటరీగాగానీ ఆ గ్రామ బడ్జెట్‌లో పేర్కొనని పనులకు ఆర్థిక సంఘ నిధులను వాడుకునే అవకాశమే ఉండదు. ఇంటి పన్ను రూపంలో అందజేసే జనరల్ ఫండ్స్ తదితర ఇతర నిధులను మాత్రం బడ్జెట్ ప్రకారం ఖర్చుపెట్టాలన్న నియమేమీ లేదు. అయితే వీలైనంత మేర బడ్జెట్ ప్రణాళికల ఆధారంగానే ఖర్చు చేసేలా ప్రోత్సహించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు ప్రక్రియలో సర్పంచులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.
కార్యదర్శులకు మండలస్థాయి అధికారుల సహకారం
గ్రామ బడ్జెట్ రూపకల్పన, అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి మండలంలో ఆరుగురు మండల స్థాయి అధికారులతో కమిటీలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండే నిధులకు, ఇతర పథకాల వచ్చే నిధులనూ అవసరమైన మేర అనుసంధానం చేసుకునేలా ఈ ఆరుగురు మండల స్ఙాయి అధికారులు తోడ్పాటు అందిస్తారని వివరించారు. కమిటీల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీ, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఉపాధి పథకం ఏపీఓ, సెర్ప్ ఏపీఎంలు ఉంటారు.
మూడొంతుల పంచాయతీల్లో పూర్తి
ఇప్పటికే దాదాపు మూడోంతులకుపైగా అంటే 11,403 గ్రామ పంచాయతీల్లో 2024–25 సంవత్సరపు గ్రామ బడ్జెట్ ప్రణాళికల రూపకల్పన పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అన్ని పంచాయతీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 660 మండలాలు, 13 ఉమ్మడి జిల్లాల స్థాయిలోనూ మండల, జిల్లా పరిషత్‌ల వారీగా బడ్జెట్ ప్రణాళికలను మార్చి నెలలో రూపొందించే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment