సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది.
ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు.
ముందుగా సర్వే..
గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన
నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది.
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
Published Fri, Apr 1 2022 5:32 AM | Last Updated on Fri, Apr 1 2022 10:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment