Minister Jupally Krishna Rao
-
‘పంచాయతీ’పై అస్పష్టత!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జాప్యం జరుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అయితే పంచాయతీరాజ్ శాఖ వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. జూన్ 25లోపు గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి జూపల్లి చెప్పిన గడువు దగ్గరపడినా జిల్లాల వారీగా రిజర్వేషన్ల కోటాను నిర్ధారించలేదు. ఏ కేటగిరికి ఎన్ని పంచాయతీలు అనే లెక్కలు తేలలేదు. దీనిపై స్పష్టత వస్తేనే పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కోసం కనీసం వారం రోజులు పడుతుంది. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ తీరుతో గడువులోపు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడంలేదని స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల నిర్ధారణ వంటి ప్రక్రియల్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనలున్నాయి. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా అనుసరించే వ్యూ హంపైనా పంచాయతీరాజ్ శాఖ సరిగా స్పందించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించే మార్గదర్శకాలను జూన్ 12న ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరీకి ఎన్ని సర్పంచ్ స్థానాలు కేటాయించాలనేది స్పష్టత ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ, జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారీగా రిజర్వేషన్ కోటా ను నిర్ధారించాలని ఆదేశించింది. ఈ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
‘ఎన్నికల తర్వాతే బదిలీలు’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యోగుల బదీలీలను పంచాయతీ ఎన్నికల తర్వాతే చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మండల విస్తరణ అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రూర్బన్, ఉపాధి హామీ, ఉద్యోగుల బదిలీలపై ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి జూపల్లి శనివారం సమీక్షించారు. ఎక్కువకాలం ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. రూర్బన్ పథకంలో భాగంగా సంబంధిత టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి సగటున 50 రోజుల కన్నా ఎక్కువ పని కల్పిస్తే ప్రోత్సాహకాలు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లను ఆదేశించారు. -
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐపార్డ్లో గురువారం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, మండల విస్తరణ అధికారులకు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీరాజ్ చట్టం 25 ఏళ్ల కిందటే రూపొందించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిల్లో మార్పులు చేశామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ చట్టం ద్వారా సర్పంచులు, పాలక వర్గాలకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, గ్రామాలకు నిధులు కూడా పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని మార్పులు చేసి అమలు చేసుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇప్పటికే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ఐపాస్ లాంటి సరికొత్త పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ పేరొందిందని అన్నారు. -
తెలంగాణకు ‘ఈ పంచాయతీ’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జాతీయ స్థాయి లో ‘ఈ పంచాయతీ’ పురస్కారం దక్కింది. పంచాయతీరాజ్ దివస్ (ఏప్రిల్ 24)ను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా రాంనగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలోని మరో 8 ఉత్తమ స్థానిక సంస్థలకూ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి, సిద్దిపేట మండల పరిషత్ అధ్యక్షుడు యాదయ్య, శ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు సారయ్యగౌడ్ అందుకున్నారు. గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి సర్పంచ్ బాలయ్య, సిద్దిపేట మండలం ఇర్కోడు సర్పంచ్ వినీత, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం గంట్లవల్లి సర్పంచ్ లలిత, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ నర్సింగరావు అందుకున్నారు. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి సర్పంచ్ రాజయ్య అందుకున్నారు. 2016–17లో పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లో పంచాయతీరాజ్ శాఖలోని పలు పథకాల వెబ్సైట్లను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్గా చేస్తూ దేశంలోనే తెలంగాణ ఈ పంచాయతీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా అవార్డును అందుకున్న కమిషనర్ నీతూప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులను పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. -
పదేళ్లకోసారి రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుందనే ఊగిసలాటకు, చర్చోపచర్చలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీలతో ప్రమేయం లేకుండా, అంటే పార్టీ గుర్తులరహితంగా జరగనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన పంచాయతీరాజ్ బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పంచాయతీలుగా తండాలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ బిల్లు ద్వారా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య నినాదం కొత్త చట్టంతో ఆచరణ రూపు దాలుస్తుందని భావిస్తున్నామన్నారు. బిల్లులో పేర్కొన్న కీలకాంశాలు... పాలనలో సర్పంచే కీలకం గ్రామ పాలనలో సర్పంచ్ కీలకం కానున్నారు. రిజర్వేషన్ల విధానంలో మార్పులు తెచ్చారు. ప్రస్తుతం ఐదేళ్లకోసారి మారుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పరిమితిని పదేళ్లకు పెంచారు. గ్రామంలో వంద శాతం ఎస్టీలుంటే సర్పంచ్ పదవిని ఆ వర్గానికే రిజర్వు చేయనున్నారు. పంచాయతీలో ఓటరుగా ఉన్నవారికే సర్పంచ్‌గా, వార్డు సభ్యులుగా పోటీకి అవకాశముంటుంది. పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు పరోక్ష పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్‌గా పోటీకి 21 ఏళ్లు దాటిన వారు అర్హులు. వారికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. పదవీకాలం ఐదేళ్లు. జాయింట్ చెక్ పవర్ పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన నిధుల ఖర్చు విషయంలో చెక్‌పవర్ విధానంలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం సర్పంచ్, గ్రామ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ అధికారాలున్నాయి. బిల్లులో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఈ పవర్ ఇచ్చారు. సర్పంచ్ విధి నిర్వహణలో విఫలమైనట్లు నిరూపితమైనా, నిధుల దుర్వినియోగం చేసినా తొలగించే విషయాన్ని బిల్లులో పేర్కొన్నారు. తొలగింపు అధికారం ఇప్పట్లాగే కలెక్టర్లకే ఉంటుంది. తొలగింపుపై సర్పంచ్‌లు అప్పీలు చేసేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. గ్రామసభలో అంశాలు... - పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్వహణ, విద్య, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, కొత్త పన్నుల పెంపు తదితరాలపై చర్చి స్తారు. పంచాయతీలో అమలు చేసే అభి వృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి. - పథకాల లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి. కొత్తగా ఎన్నిక య్యే సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ప్రభు త్వం అవగాహన కల్పిస్తుంది. పాలనాంశాల్లోనూ మార్పులు జరిగాయి. గ్రామంలో ఇంటి నిర్మాణానకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు అనుమతులివ్వాలి. లే ఔట్ పర్మిషన్లలో నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకునే నిబంధన ఉంది. గ్రాస సభ కోరం గ్రామ సభ నిర్వహణకు కనీసం ఎంతమంది హాజరవాలనే (కోరం) విషయంపైనా బిల్లులో స్పష్టత ఇచ్చారు. 300 నుంచి 500 ఓటర్లుండే గ్రామంలో 50 మంది హాజరైతేనే కోరమున్న ట్టు భావించి సభ నిర్వహించాలి. 500– 1,000 ఓటర్లుంటే 75 మంది, 1,000– 3,000 ఉంటే 150 మంది, 3,000–5,000 వరకైతే 200 మంది, 5,000–10,000 వరకు 300 మంది, ఆపైన ఓటర్లుంటే 400 మంది హాజరు తప్పనిసరి. 300 జనాభా ఉన్నా.. కొత్తగా 4,380 గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,326. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,741కు పెరగనుంది. వార్డు సభ్యుల సంఖ్య గ్రామ జనాభా ఆధారంగా ఉంటుంది. ఇప్పటిదాకా కనీసం 500 జనాభా ఉంటేనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే అవకాశముండేది. ఇకపై 300 జనాభా ఉన్నా అవకాశ మిస్తారు. గురువారం చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించనుంది. రెండు నెలలకోసారి గ్రామసభ - ప్రస్తుతం మూడు నెలలకోసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ సమావేశాన్ని ప్రతి నెలా నిర్వహించాలి. పాలకవర్గంలోని ఎన్నికైన సభ్యులు ఇందులో పాల్గొంటారు. - ఎంపీటీసీ సభ్యుడు గ్రామసభకు ఆహ్వానితుడు. ఎంపీటీసీ పరిధిలోని జరిగే అన్ని కార్యక్రమాలకు ఆయన ఆహ్వానితుడే. అయితే పంచాయతీ వ్యవహారాలు వేటిలోనూ ఎంపీటీసీకి ఓటు హక్కుండదు. - ప్రతి పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులుంటారు. గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారు, గ్రామాభివృద్ధి కోసం ఆర్థికంగా చేయూత అందించిన వారిని సభ్యులుగా నియమిస్తారు. వీరు గ్రామసభల్లో పాల్గొంటారు, వీరు అన్ని అంశాలపై చర్చించవచ్చు గానీ ఓటు హక్కుండదు. - మూణ్నెల్లకోసారి జరుగుతున్న గ్రామ సభ ఇకపై రెండు నెలలకోసారి జరగాలి. ప్రత్యేక సందర్భాల్లో పది రోజుల తర్వాత భేటీ కావచ్చు. సర్పంచ్ లేని సందర్భాల్లో ఉప సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరగుతుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, అసెంబ్లీ సభ్యులను సభకు ఆహ్వానించవచ్చు. ఏడాదిలో ఆరుసార్లు కచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి. మహిళలు, వృద్ధులు, వికలాంగుల అంశంపై కనీసం రెండు గ్రామసభల్లో చర్చించాలి. పంచాయతీ నిర్ణయం ప్రకారం గ్రామసభ ఎజెండాలోని అంశాలపై సభ్యులకు గ్రామ కార్యదర్శి సమాచారమివ్వాలి. -
స్థానిక సంస్థలకు కొత్త రిజర్వేషన్లు!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల్లో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన వెయ్యిమంది వరకు సర్పంచ్‌లు హాజరుకాగా మంత్రులు జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రానుందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలా లేక పరోక్షంగానా అన్నది ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర ఉంటుందన్నారు. అనేక సమస్యలకు పరిష్కారం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి అన్నారు. నిధులు ఖర్చు చేయడమే సర్పంచ్ల విధిగా భావించొద్దని, ప్రజలను సంఘటితం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు రూ.500 కోట్ల నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. -
తెలంగాణలో కేంద్ర పథకాల అమలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ (టీ సిపార్డ్)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వివరించారు. ఉపాధి హామీ, పీఎంజీఎస్‌వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల మనుగడ రేటు 70 శాతం వరకు ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల్ని పెంచండి దేశానికే ఆదర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందజేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని 16 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిలిచిన పనులకు సంబంధించి రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీయంజీఎస్‌వై–2 కింద అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రానికి మూడు విడతల్లో 16 రూర్బన్ క్లస్టర్లను మంజూరు చేశారని.. కనీసం జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్‌కు జూపల్లి వినతి పత్రం అందజేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యాన్ని తగ్గించాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి
సాక్షి, హైదరాబాద్: నగరీకరణతో రోజురోజుకూ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని, దానిని తగ్గించేందుకు పర్యావరణహిత చర్యలు చేపట్టాలని ‘66వ నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’సదస్సు అభిప్రాయపడింది. ముఖ్యంగా వాతావరణ మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు తగిన విధానాలు రూపొందించాలని సూచించింది. నగరంలోని ఓ హోటల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. నగరాల్లో ప్రజల జీవనం మెరుగ్గా ఉండేందుకు, కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు నీటి వనరుల్ని రక్షించుకోవాలని, ప్రజారవాణాను ప్రోత్సహించాలని సూచించింది. ఇందుకుగానూ పలు సిఫార్సులు చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి..: వాతావరణ మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, భూవినియోగం, పబ్లిక్ స్థలాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్ తదితరమైన వాటిని రీసైకిల్ చేయడంపై దృష్టి సారించాలని ఈ సదస్సు సూచించింది. ప్రజా రవాణా వాహనాలు గ్రీన్‌ఫ్యూయల్స్‌ను వినియోగించేలా చేయాలని పేర్కొంది. ఏవైనా విపత్తులు సంభవిస్తే ఎక్కువగా నష్టపోయేది పేదలే కనుక వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇందుకుగానూ విపత్తులకు అవకాశం లేకుండా మాస్టర్ప్లాన్లలో తగిన మార్పులు చేయాలని సూచించింది. దీర్ఘకాలిక పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించాలని సిఫార్సు చేసింది. నగరాల్లో చెరువులు, సరస్సులు పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, కబ్జాల పాలైన చెరువులకు పునరుజ్జీవం కలిగించేందుకు టీడీఆర్ వంటివి అమలు చేయాలని సూచించింది. 70 శాతం విద్యుత్‌ను వినియోగిస్తున్న నగరాల నుంచి 80 శాతం గ్రీన్హౌస్ వాయువులు వెలువడుతున్నాయని, ఈ పరిస్థితిని నివారించేందుకు నగర స్థాయిలో వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు రూపొందించాలని పేర్కొంది. అవసరాన్ని బట్టి కొత్త బైలాస్ రూపొందించాలని సూచించింది. ఈ సదస్సుకు 22 రాష్ట్రాల నుంచి 400 మందికిపైగా టౌన్, కంట్రీప్లానర్లు, ప్రొఫెసర్లు హాజరయ్యారని రాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, ఇండియా(ఐటీపీఐ) అధ్యక్షుడు ఎస్.దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయని, ఈ సదస్సు సిఫార్సులు ఉపకరించగలవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పర్యావరణహిత డిజైన్లు రూపొందించాలి తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకితభావంతో పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జరిగిన టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యావరణహిత ప్రణాళికతో కూడిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. భావితరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, ఇందులో భాగంగానే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని గ్రీన్ స్టేట్‌గా మారుస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా వీఎన్ ప్రసాద్ నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డును మహత్ అగర్వాల్, ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మేష్రం నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డును శశాంక్ వర్మ, ఫయాజుద్దీన్ మెమోరియల్ అవార్డును అజయ్ అందుకున్నారు. – మంత్రి జూపల్లి కృష్ణారావు -
పాలమూరుకు శత్రువు జూపల్లి: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: పాలమూరుకు మొదటి శత్రువు మంత్రి జూపల్లి కృష్ణారావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి జూపల్లిని ప్రజల్లోనే దోషిగా నిలబెడతానని హెచ్చరించారు. నల్లగొండకు, డిండికి నీళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. జూపల్లి కృష్ణారావు గతంలో చెప్పిన ప్రకారమే నల్లగొండకు నీళ్లు ఇవ్వాలన్నారు. అయితే పాలమూరుకు అన్యాయం చేసే విధంగా జీఓను తెచ్చారని ఆరోపించారు. -
'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా'
నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ప్రశ్నించే హక్కు, అర్హత కానీ వంశీచంద్ కు లేదని జూపల్లి అన్నారు. ఇన్నాళ్లు కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఈ ఏడాది కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరిచ్చి తీరుతామని ఆయన తెలిపారు. తనను రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా అని జూపల్లి ఎమ్మెల్యే పై మండిపడ్డారు. వంశీచంద్ రెడ్డి సొంతూరు అప్పారెడ్డిపల్లికి వచ్చి మీటింగ్ పెడతామని మంత్రి జూపల్లి అన్నారు. -
35 లక్షల మందికి పింఛన్లు: జూపల్లి
హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ 35 లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం మానవీయకోణంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు చెల్లిస్తామని ప్రకటించారు. వికలాంగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 9.33 లక్షల మంది వికలాంగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీరిలో 6.37 లక్షల మంది అర్హులుగా నిర్ధారించామని.. వీరందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తపాలా సేవల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుని పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు. -
మహిళా సాధికారత కోసం చర్యలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం ఉదయం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మహిళా సంఘాలున్నాయని తెలిపారు. మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు నిధుల కొరత లేదన్నారు. 2012-13 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే మహిళలకు మూడింతల రుణ సౌకర్యం కల్పించామని తెలిపారు. -
‘రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా’
హైదరాబాద్: ముడుపుల కోసమే మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పంపు హౌస్ డిజైన్ మారుస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పంప్‌హౌస్ డిజైన్ మార్చవద్దని నివేదించినప్పటికీ నాలుగో కమిటీ వేసి డిజైన్ మారుస్తున్నారని తెలిపారు. ఈ మార్పు వల్ల సర్కారుపై అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని చెప్పారు. ఆ కంపెనీ నుంచి మంత్రి జూపల్లి కి రూ. 50 కోట్లు ముడుపులు ముట్టాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పంప్ హౌస్ డిజైన్ మార్పు సరికాదన్న నిపుణుల కమిటీ రిపోర్టులపై మంత్రి జూపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ రిపోర్టులు తప్పని మంత్రి రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. బహిరంగ చర్చ తేదీని, వేదికను మంత్రి జూపల్లే ఖరారు చేయాలని అన్నారు. -
‘సెర్ప్’పై ప్రత్యేక నిఘా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయిం చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సోమవారం సచివాల యంలో పాలకమండలి సమావేశమైంది. పేదరిక నిర్మూలనకు సంబంధించిన 14 అంశా లపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సెర్ప్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 120 నుంచి 180కి పెంచే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలి పింది. మరణించిన సెర్ప్ ఉద్యోగుల అంత్య క్రియల ఖర్చును రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలనే ప్రతిపాదనను కూడా ఆమో దించింది. గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైన పలువురు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసు కోవాలన్న వారి అభ్యర్థనలను పాలకమండలి తోసిపుచ్చింది. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సెర్ప్ కార్యక్రమాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని తొలగించడం జరిగిందని, ఇకపైనా ఎటువంటి అక్రమాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆసరా పెన్షన్లతో పాటు, మహి ళా సంఘాలకు రుణ సౌకర్యం, టీఆర్ఐజీపీ లాంటి పలు కార్యక్రమాల అమలులో అవక తవకలను నివారించేందుకు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజిలెన్స్ సెల్ దోహదపడు తుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్య« దిక నిధులు వచ్చేలా తరచుగా సంప్రదింపులు, పర్యవేక్షణ చేసేందుకు వీలుగా వేరొక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్. లక్ష్మణ్, స్త్రీ నిధి బ్యాంక్ అధ్యక్షురాలు అనిత, సెర్ప్ డైరెక్టర్లు బాలయ్య, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి
మంత్రి జూపల్లికి సర్పంచ్ల ఫోరం వినతి సాక్షి, హైదరాబాద్: పాత విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికి తెలంగాణ సర్పంచ్ల ఫోరం జాతీయ అధ్యక్షుడు యాకుబ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి విన్నవించారు. 14వ ఆర్థి క సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబం ధించిన ట్రాన్స్ఫర్ డ్యూటీ మొత్తాన్ని పంచా యతీలకు విడుదల చేయాలని కోరారు. ఆది వారం సచివాలయంలో మంత్రితో భేటీ అయిన ఫోరం నేతలు పంచాయతీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ.. పంచాయ తీలను స్వచ్ఛ్ గ్రామాలుగా మార్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం కోసం సర్పంచ్‌లు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరా రు. హరితహారాన్ని గ్రామాల్లో పెంపొందిం చాలన్నారు. స్థానిక సంస్థల సమస్యల పరి ష్కారం కోసం ఈ నెల 27న మహాధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర సర్పంచ్ల ఐక్య వేదిక, జెడ్పీటీసీల ఫోరం ప్రతినిధులు భేటీకి హాజరు కాలేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళ నకు దిగుతామని తెలంగాణ సర్పంచ్ల సంఘం, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబ ర్ ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు. -
గ్రామపంచాయతీలుగా మారనున్న తండాలు
ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షించారు. 14 వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రం నుంచి అందాల్సిన రూ.900 కోట్ల నిధులను పొందేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ నీతూ కు మారి ప్రసాద్‌కు సూచిం చారు. ఉపాధిహామీ, పంచాయతీపనుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రూర్బన్ మిషన్ రెండో విడత ప్రతిపాదనలపై ఆయన ఆరాతీశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కమిషనర్లు బి.సైదులు, ఎస్జే ఆషా పాల్గొన్నారు. -
'ప్రతిపక్షాల అడ్రస్‌లు గల్లంతవుతాయ్'
హైదరాబాద్ : ప్రజా సంక్షేమమే కేంద్ర బిందువుగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సాధించిన ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అన్ని వర్గాలకు సంక్షేమ వసతి గృహాలు తదితర పథకాలు పూర్తయితే భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల చిరునామాలు కూడా గల్లంతవుతాయన్నారు. సీపీఎం పార్టీ ప్రారంభించిన మహాజన పాదయాత్రను ఉద్ధేశించి మంత్రి జూపల్లి బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రకరకాల పార్టీలు, నాయకులు చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటారని, ఉనికి కోసం వారు పడుతున్న పాట్లను తాము పట్టించుకోబోమన్నారు. బంగారు తెలంగాణ ఆకాంక్షతోనే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ పిలవకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు ఏకపక్షంగా అంగీకరిస్తున్నారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. -
ఆకట్టుకున్న డ్వాక్రా బజార్
సాక్షి, హైదరాబాద్: ‘డ్వాక్రా బజార్’ పేరుతో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద మంగళవారం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. స్టాల్స్‌లో ఉంచిన పలు వస్తువులు, గృహోపకరణాలు, గాజులు, చీరలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు. -
'మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కల్వకుర్తి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. దీనికి సంబంధించి 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను, ఆ తర్వాత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నారు. కల్వకుర్తి అయిదు లిఫ్ట్‌లలో ఒక్క దానికి నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవన్నారు. కనీసం ఈ ఏడాది మూడు నెలల కిందట విడుదల చేస్తే కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడి ఉండేదన్నారు. కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ. 245 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మంత్రి హరీష్‌రావు 2వేల కోట్లు ఖర్చుచేశామనడం దారుణమన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడు పాలమూరు కోసం, కల్వకుర్తి ప్రాజెక్టు కోసం కేసీఆర్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. కల్వకుర్తి సామర్థ్యం కుదించారని, కాల్వల వెడల్పు తగ్గించారని,. టన్నెల్ 9 మీటర్లు ఉండాల్సి ఉండగా దానిని దానిని మంత్రి జూపల్లి 6.85 మీటర్లకే కుదించారని ఆరోపించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.10-15 వేల కోట్లు ఖర్చు చేస్తే 33 ప్రాజెక్టులు పూర్తయి 42 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండగా, సీఎం కేసీఆర్ కోటి ఎకరాల పాట పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ పాత్ర నామమాత్రం, శూన్యమని, జాప్యానికి మాత్రవం సీఎందే బాధ్యత అన్నారు. -
జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం
కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు ముగిసిన పుష్కర మహోత్సవాలు నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్‌లో కలెక్టర్ పూజలు సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం లక్షలాది మంది పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 12వ తేదీన అలంపూర్‌లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్‌శర్మ, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్, అడిషన్ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్‌పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల పూజలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్ ఘాట్‌లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్ బండారు భాస్కర్, కలెక్టర్ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం అభినందించారు జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ – కలెక్టర్ టీకే శ్రీదేవి -
భక్తజన ప్రభంజనం
11వ రోజు 20,90,778మంది పుష్కరస్నానం పెరిగిన వీఐపీల తాకిడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వరుసగా 11వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం సైతం అన్ని పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. మొత్తం 20,90,778మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. పుష్కర స్నానానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో వీఐపీలతో సహా సాధారణ ప్రజలు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో కొందరు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించగా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచ్పల్లి, రంగాపూర్, సోమశిల, నదీఅగ్రహారం, కృష్ణ, పస్పుల, పంచదేవ్‌పహాడ్, క్యాతూరు, గుమ్మడం, మునగాన్దిన్నె, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సోమవారం పది లక్షలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. సోమశిల పుష్కరఘాట్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టి.కె.శ్రీదేవి సాయంత్రం, బీచుపల్లిలో మరో మంత్రి లక్ష్మారెడ్డి గంగాహారతి ఇచ్చారు. రంగాపూర్ ఘాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి అలంపూర్‌లోని గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్ ఆలయాన్ని సందర్శించారు. మూలమల్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సినీనటుడు, రవితేజ తమ్ముడు రాజగోపాల్ పుణ్యస్నానం ఆచరించారు. అలంపూర్‌లో రాష్ట్ర జైళ్ల డీజీపీ గోపినాథ్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి విక్రంసింగ్ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. మరింత తగ్గిన నీటిమట్టం కాగా, సోమవారం అన్ని పుష్కరఘాట్లలో నీటిమట్టం మరింత తగ్గింది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు వరదనీరు పూర్తిగా తగ్గడంతో జూరాల నుంచి ఎగువ ప్రాంతానికి నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పుష్కర స్నానాలకు ఒకేరోజు మిగిలి ఉండటంతో నీటి మట్టం తగ్గినా స్నానాలకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల ముగింపు పర్వాన్ని బీచుపల్లి పుష్కరఘాట్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు, ఇతర అధికారులు మంగళవారం సాయంత్రం జరిగే ముగింపు సభలో పాల్గొననున్నారు. -
సకాలంలో పూర్తి చేయాలి
– మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: పుష్కరాల పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గురువారం సోమశిలలోని హరిత హోటల్లో పుష్కరాల పనులు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనుల ప్రగతిని సంబంధితశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, దేవాలయాల అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరగకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్థాయి అధికారులపైనే ఉందన్నారు. ఎక్కడైనా కేజీ వీల్స్‌తో రోడ్లు పాడైతే అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కరాల కోసం ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే వాటి కోసం త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని, వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని వెల్లడించారు. దేవాలయాల వద్ద విద్యుద్దీపాలంకరణతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, దేవాదాయ శాఖల అధికారులతో పాటు ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, తదితరులు పాల్గొన్నారు. -
గొందిమల్ల ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
అలంపూర్/అలంపూర్ రూరల్: కృష్ణానదిలో కొన్ని నీళ్లు ఉన్నా పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గొందిమల్ల వీఐపీ ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ రాంకిషన్‌లతో కలిసి సందర్శించారు. ఘాట్ నిర్మాణ పనులు, పార్కింగ్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులపై మంత్రులు సమీక్షించారు. నదిలో నీటి ప్రవాహం దూరంగా ఉన్నప్పటికీ పుష్కరస్నానాలు చేయడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. పుష్కరఘాట్ వద్ద నదిలో మరో ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని, ఘాట్ నుంచి నదిలో ఉన్న నీటి ప్రవాహం వరకు ఇసుక, మట్టితో తాత్కాలిక రోడ్డు వేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పుష్కరాలకు రెండు, మూడు రోజుల ముందు అప్పటి నీటి ప్రవాహాన్ని బట్టి రోడ్డు వేసుకోవాలన్నారు. పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వీరి వెంట మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు
గోదావరి కంటే ఘనంగా నిర్వహించేందుకు కృషి 90శాతం పుష్కరాల పనులు పూర్తి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌రూరల్: కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణా పుష్కరాలు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహిస్తామన్నారు. మండలపరిధిలోని సోమశిలలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జరుగుతున్న ఘాట్ల పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.825కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించి దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయని, పదిశాతమే మిగిలి ఉన్నాయన్నారు. వాటిని ఈనెలాఖరు వరకు పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చేనెల 5, 6 తేదీల వరకు పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయన్నారు. పుష్కరఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణానదికి నీళ్లు వస్తున్నాయని, పుష్కరాల వరకు పూర్తిస్థాయిలో నదికి నీళ్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమశిలకు భక్తులు ఎక్కువగా వస్తారని, ఈ ప్రాంతంలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కనిపించకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పుష్కరాల ఘాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు నిత్యం పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు. షవర్లు ఏర్పాటు చేయాలి: మంత్రి జూపల్లి సోమశిల సమీపంలో జనరల్ ఘాట్ సమీపంలో షవర్లు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిలో మునగలేని భక్తులకు షవర్లు ఉపయోగపడతాయన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎప్పటికప్పుడు మైకుల ద్వారా ప్రజలకు అన్ని సమస్యలు, వసతులను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్ దగ్గర 25ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామని మంత్రి జూపల్లికి జేసీ రాంకిషన్ తెలిపారు. సోమశిల ఆధ్యాత్మిక ప్రాంతమైనందున ప్రతిరోజూ లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జేసీని మంత్రి ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా సోమశిలలో ఏర్పాటు చేసే దుకాణాలను ఊరి బయటనే పెట్టాలని వ్యాపారులకు సూచించారు. అనంతరం సోమశిల జనరల్ పుష్కరఘాట్ వద్ద జంగమ్మగుడి సమీపంలో మంత్రులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, పీఆర్ డీఈ రాములు, జూపల్లి రామారావు, ఎండీ ఎక్బాల్, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం ఇటిక్యాల: కృష్ణా పుష్కరాల ఘాట్ల వద్ద నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. బీచుపల్లి వద్ద పుష్కరఘాట్ల నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లకు ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి, పనులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా నిలిచేలా రాష్ట్రప్రభుత్వం కృష్ణాపుష్కరాలను నిర్వహించేందుకు కృషి చేస్తోందన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఉన్న ఆలయాలను అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ ఈఓపై ఆగ్రహం బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం మంత్రులు సందర్శించారు. పుష్కర సమయం ముంచుకొస్తున్నా ఆలయం వద్ద అలాంటి వాతావరణం కనిపించక పోవడమేమిటని ప్రశ్నించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద, గర్భగుడి వద్ద ఉన్న సమస్యలు తొలగించాలని చెప్పినా అర్థం కావడం లేదా అని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం నిర్మాణ పనులు పుష్కరాల పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు పెబ్బేరు: రంగాపూర్ ఘాట్ వద్ద మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ జోగుల చెన్నయ్య, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, తదితరులున్నారు. -
మంత్రి జూపల్లి, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బాహాబాహీకి దిగారు. కోస్గి మండలం భోగారంలో గురువారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్యక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి జూపల్లి ప్రసంగిస్తూ...తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో రెచ్చిపోయిన రేవంత్ జూపల్లి చేతిలో ఉన్న మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. సభలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.