'ప్రతిపక్షాల అడ్రస్‌లు గల్లంతవుతాయ్'
హైదరాబాద్ : ప్రజా సంక్షేమమే కేంద్ర బిందువుగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు సాధించిన ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, అన్ని వర్గాలకు సంక్షేమ వసతి గృహాలు తదితర పథకాలు పూర్తయితే భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల చిరునామాలు కూడా గల్లంతవుతాయన్నారు.
సీపీఎం పార్టీ ప్రారంభించిన మహాజన పాదయాత్రను ఉద్ధేశించి మంత్రి జూపల్లి బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రకరకాల పార్టీలు, నాయకులు చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటారని, ఉనికి కోసం వారు పడుతున్న పాట్లను తాము పట్టించుకోబోమన్నారు. బంగారు తెలంగాణ ఆకాంక్షతోనే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ పిలవకుండానే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు ఏకపక్షంగా అంగీకరిస్తున్నారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.