టీఆర్‌ఎస్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘమే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఎంబీ భవన్‌లో సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టీజీ నర్సింహారావు, సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసినా మెట్రో రైలు పిల్లర్లు, వివిధ ప్రాంతాల్లోని హోర్డింగ్‌లపై టీఆర్‌ఎస్ ప్రచార పోస్టర్లను తొలగించలేదన్నారు.
వీధుల్లో టీఆర్‌ఎస్ తోరణాలూ అలాగే ఉన్నాయన్నారు. ఈ విషయమై తాము లేఖ రాస్తే... రెండు రోజుల్లో తొలగిం చాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి ఎన్నికల సంఘం చేతులు దులుపుకుందన్నారు. టీఆర్‌ఎస్ చర్యలతో రాష్ట్రంలోని సెటిలర్లలో అభద్రతా భావం పెరిగిందని, అనేక విషయాల్లో ఆంధ్ర- తెలంగాణ అనే చీలికను తెచ్చిన పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం తియ్యటి మాటలు చెపుతోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి తరఫున 77 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపినట్లు ఆయన చెప్పారు. ఇందులో సీపీఎం 32, సీపీఐ 17, లోక్‌సత్తా 27, ఎంపీసీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు వారిని గెలిపించాలని కోరారు.