Greater election
-
సార్! టోపీ తీసుకెళ్లండి!
కుత్బుల్లాపూర్: భారమనుకున్నారో... బరువు అనుకున్నారో.... తలపై ఉన్న టోపీని తీసి పక్కన పెట్టిన ఓ పోలీసు అధికారి దానిని అక్కడే వదిలి వెళ్లాడు. 15 రోజులైనా దానిని తీసుకెళ్లకపోవడంతో.. తలపై ఉండాల్సిన టోపీపైనే ధ్యాస లేని ఆయన విధులపై ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన పోలీసు అధికారి తన టోపీని మర్చిపోయారు. సదరు అధికారి వచ్చి తీసుకెళ్తాడనే ఉద్దేశంతో సర్కిల్ సిబ్బంది అందరికీ కనబడేలా ప్రధాన గేటు పక్కనే ఉన్న టేబుల్‌పై పెట్టారు. ఇప్పటి వరకూ ఆయన తీసుకెళ్లలేదు. బాధ్యత గల అధికారి అయితే తనను తీసుకెళ్తాడన్నట్టు ఆ టోపీ ఎదురు చూస్తోంది. -
మజ్లిస్ దాడులపై ఇంత నిర్లక్ష్యమా?
♦ టీపీసీసీ ముఖ్యుల్లో అసంతృప్తి ♦ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దీటుగా స్పందించలేదని వ్యాఖ్యలు ♦ ఇలాగైతే పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన.. దాడి చేసిన చోటు నుంచే పోరాటం సాగించాలని నేతల సూచనలు సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై మజ్లిస్ దాడికి దిగినా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా స్పందించలేదంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వంపైనే దాడి జరిగినా దీటుగా ప్రతి స్పందించకపోవడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని పలువురు ముఖ్య నేతలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ఖాన్‌ను పోలీసు స్టేషన్ నుంచి విడిపించడానికి స్వయంగా ఉత్తమ్, షబ్బీర్ వెళ్లడం ద్వారా పార్టీ శ్రేణులకు విశ్వాసం కల్పించారని, అయితే ఆ సందర్భంగా జరిగిన దాడికి ధీటుగా ప్రతి స్పందించడంలోనే పార్టీ యంత్రాంగం విఫలమైందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ఉత్తమ్, షబ్బీర్‌పై దాడులు చిన్న విషయం కాదు. దీన్ని రాష్ట్ర పార్టీపై మజ్లిస్‌తో కలిసి ప్రభుత్వం చేసిన దాడిగా చూడాలి. ఎన్నికల సందర్భంగా ఇలాంటివి జరిగినా చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. టీపీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేతపై దాడి తెగబడినా సహనం పాటిస్తే పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతినదా? ‘అగ్రనేతలపై దాడినే పట్టించుకోకుంటే మాకు దిక్కెవర’ని పార్టీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతారు. దీనిపై ఇప్పటికైనా క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగితే మంచిది’’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు సూచించారు. పాతబస్తీకి టీపీసీసీ అధినేత వెళ్తే.. ‘మేరా ఇలాఖా మే కైసా ఆయేగా’ అంటూ అసదుద్దీన్ దాడికి దిగడం కంటే బరితెగింపు ప్రజాస్వామ్యంలో ఇంకేముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసదుద్దీన్ దాడికి దిగిన ప్రాంతాన్నే కేంద్రబిందువు చేసుకొని కాంగ్రెస్ పోరాటం సాగించాలని మరికొందరు నేతలు సూచించారు. దాడి వెంటనే బంద్‌లు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి క్షేత్రస్థాయి కార్యాచరణకు ఎందుకు పిలుపు ఇవ్వలేదని పలువురు టీపీసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
పోలీసులా.. టీఆర్ఎస్ కార్యకర్తలా?
అధికార పార్టీకి కొమ్ముకాశారు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్షం నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలతో కలిసి మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. ఏడాది కాలం నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడానికి టీఆర్ఎస్సే కారణమన్నారు. 80 శాతం మంది ఓటర్లకు సిబ్బంది పోలింగ్ స్లిప్పులను అందించలేక పోయారన్నారు. పోలింగ్ స్లిప్పులను అందించడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారని, పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. పాలక పార్టీ మెప్పు కోసం పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, సీఎం కుట్ర వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంటుందనే యోచన కూడా ఓటర్ల నిరాసక్తతకు కారణమని కిషన్‌రెడ్డి చెప్పారు. అసద్‌ను అరెస్టు చేయాలి: కాంగ్రెస్ నేతలపై దాడికి దిగిన ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని వెంటనే అరెస్టు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడం ఎంఐఎంకు అలవాటేనన్నారు. ఇప్పటిదాకా ఎంఐఎంను పెంచి పోషించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు దిగడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదన్నారు. -
టీఆర్ఎస్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపణ సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘమే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఎంబీ భవన్లో సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టీజీ నర్సింహారావు, సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసినా మెట్రో రైలు పిల్లర్లు, వివిధ ప్రాంతాల్లోని హోర్డింగ్‌లపై టీఆర్ఎస్ ప్రచార పోస్టర్లను తొలగించలేదన్నారు. వీధుల్లో టీఆర్ఎస్ తోరణాలూ అలాగే ఉన్నాయన్నారు. ఈ విషయమై తాము లేఖ రాస్తే... రెండు రోజుల్లో తొలగిం చాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి ఎన్నికల సంఘం చేతులు దులుపుకుందన్నారు. టీఆర్ఎస్ చర్యలతో రాష్ట్రంలోని సెటిలర్లలో అభద్రతా భావం పెరిగిందని, అనేక విషయాల్లో ఆంధ్ర- తెలంగాణ అనే చీలికను తెచ్చిన పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం తియ్యటి మాటలు చెపుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి తరఫున 77 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపినట్లు ఆయన చెప్పారు. ఇందులో సీపీఎం 32, సీపీఐ 17, లోక్‌సత్తా 27, ఎంపీసీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజలు వారిని గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు.. తునికి ఎందుకు వెళ్లలేదు?
ప్రశ్నించిన మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అరగంటలో వస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన ఏపీ సీఎం చంద్రబాబు తునిలో అల్లర్లు జరిగి ఒక రోజు గడిచినా ఎందుకు వెళ్లలేదని రాష్ట్ర వాణి జ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జరిగిన సంఘటనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని కారణాలు చూపి, తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గాలి మాటలతో ప్రజలను వంచించడం మాని ఏపీపై శ్రద్ధ వహిస్తే బాగుంటుందని సూచించారు. తునిలో జరిగిన అల్లర్ల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును గమనించైనా, గ్రేటర్ ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్కు ఓటేయాలని తలసాని కోరారు. -
గ్రేటర్లో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం
♦ సహజంగా ఉండే సమన్వయలోపాన్ని అధిగమించిన వైనం ♦ ఎన్నికల్లో పార్టీ ప్రచార సామగ్రిని అందించిన టీపీసీసీ ♦ సంప్రదాయానికి భిన్నంగా మేయర్ అభ్యర్థి ప్రకటన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని ఆలపించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గ్రేటర్ ఎన్నికల్లో ఎదుర్కొనడానికి టీపీసీసీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కతో పాటు పార్టీ ముఖ్యులంతా గ్రేటర్ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గాల వారీగా డివిజన్లలో పార్టీ ముఖ్యులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు డివిజన్లలోనే ఉంటూ పార్టీ అభ్యర్థుల ప్రచారవ్యూహాన్ని, సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించారు. కాంగ్రెస్‌లో సహజంగా ఉండే సమన్వయలోపాన్ని, పార్టీ అంతర్గత సమస్యలను ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధిగమించింది. టికెట్ల కేటాయింపులో స్వల్ప సమస్యలు తప్ప చెప్పుకోదగిన ఇబ్బందులు తలెత్తకపోవడం ఆ పార్టీ నేతల్లోనే ఆశ్చరాన్ని కలిగించింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ ప్రచార సామగ్రిని అందించడానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా అభ్యర్థులకు ఆర్థిక వనరులను సమీకరించడంలో టీపీసీసీ విఫలమైనట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేదాకా మేయర్ అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ కాంగ్రెస్‌కు గతంలో ఏనాడూ లేదు. అయితే ప్రత్యేక పరిస్థితుల వల్ల మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సి వచ్చిందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన మాజీమంత్రి ఎం.ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి ప్రధాన ఉద్దేశాలతో మేయర్ అభ్యర్థిని ప్రకటించినట్లు టీపీసీసీ ముఖ్యులు చెప్పారు. జానారెడ్డి తీరుపై అసంతృప్తి ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన తర్వాత సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌కు ఇబ్బందిని తెచ్చిపెట్టింది. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ.5 భోజన పథకాన్ని ప్రభుత్వం చాలాబాగా నిర్వహిస్తోందని చెప్పడం ద్వారా టీఆర్ఎస్కు జానారెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారని సొంత పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ భోజన పథకాన్ని పరిశీలించాలనుకుంటే ఇంత బహిరంగంగా, అది కూడా మీడియా సాక్షిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘గ్రేటర్ హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం బాగుందని ఎలా కితాబిస్తారు? ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతింటుందనే విషయం జానారెడ్డికి గమనం లేదా?’ అని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎగిరిన ప్రలోభాల జెండా!
♦ చీరల పంపిణీతో వివాదాస్పదమైన టీడీపీ అభ్యర్థి ♦ నోట్లు పంచుతూ చిక్కిన టీఆర్ఎస్ కార్యకర్తలు ♦ గాంధీనగర్‌లో రూ.37 లక్షల బ్లాక్‌మనీ స్వాధీనం బన్సీలాల్‌పేట, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్: గ్రేటర్ ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చీరలు పంపిణీ చేస్తూ టీడీపీ అభ్యర్థి వివాదాస్పదం కాగా, నగదు పంచుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు చిక్కారు. వీటితో పాటు గాంధీనగర్‌లో స్వాధీనం చేసుకున్న రూ.37 లక్షలు హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలు శుక్రవారం నగరంలో చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ డివిజన్ టీడీపీ అభ్యర్థి బొడ్డు కామేశ్వరి రామకృష్ణనగర్, అంబేద్కర్‌నగర్, శ్రీరాంనగర్‌లలో ప్రచారం చేశారు. ఈ క్రమంలో చీరలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాత భర్త, మాజీ కార్పొరేటర్ గౌరీష్ అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. అక్కడున్న కొందరు మహిళలు చీరలు తీసుకెళ్తుండటాన్ని గమనించిన ఆయన వారిని ప్రశ్నించగా టీడీపీ నాయకులే ఇచ్చారని సమాధానం వచ్చింది. కాగా కామేశ్వరికి మద్దతుగా ఎమ్మెల్యే వివేకానంద్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులను టీఆర్ఎస్ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతోనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని గౌరీష్ విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, పలు టీవీల్లో వచ్చిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టాలని కోరతామన్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. డబ్బులు పంచుతూ దొరికిన గులాబీ దళం సీఎం కేసీఆర్ నివాసానికి కూత వేటు దూరంలోని నందినగర్ బస్తీలో ప్రార్థనా స్థలం ఆవరణలో డబ్బులు పంచుతూ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుబడ్డారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గులాబీ దళం నోట్లు పంచుతున్నట్లు సమాచారం అందడంతో కాంగ్రెస్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ అభ్యర్ధి బి.భారతి, ఆమె అనుచరులు అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలంటూ కరపత్రాలు పంచుతూ డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారమందించారు. క్షణాల్లోనే పోలీసులు, ఎన్నికల పరిశీలకులు ఘటనా స్థలానికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గ్రూపునకు ఎంత మొత్తం ఇచ్చారనేది రాసి ఉన్న స్లిప్పులనూ స్వాధీనం చేసుకొని, టీఆర్ఎస్ కరపత్రాలను సీజ్ చేశారు. 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. హవాలా సొమ్ము తీసుకెళ్తున్న ఇద్దరి అరెస్టు గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌మనీ తీసుకెళ్తున్న ఇద్దరిని గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణ్‌జ్యోతి కాలనీ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు చిక్కారని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. భరత్‌కుమార్ పటేల్, అమిత్‌కుమార్‌లు కలిసి ద్విచక్ర వాహనంపై అక్రమంగా నగదు తరలిస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన వీరు గత కొంత కాలంగా అరుణ్‌జ్యోతి కాలనీలో మహావీర్ ట్రేడర్స్ పేరిట బ్లాక్‌మనీ లావాదేవీలు చేస్తున్నారని డీసీపీ వెల్లడించారు. రూ.లక్షకు రూ.2 వేల నుంచి రూ.3 వేల కమీషన్ తీసుకుంటూ ఆరేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారన్నారు. సొమ్మును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. -
టీఆర్ఎస్తోనే అభివృద్ధి ఎంపీ కవిత
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిత మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ ప్రముఖ స్థానంలో ఉందన్నారు. సిటీ సింగపూర్, దుబాయ్‌లతో సమానమన్నారు. గత పాలకులు నగరాభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే నగరంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ లోపంతో ముంపు ముప్పు పొంచి ఉందన్నారు. నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. సిటీలో 54 జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జేఏసీ గ్రేటర్ చైర్మన్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎం.నర్సయ్య, ప్రొఫెసర్ ఎ.వినయ్ బాబు, ఎర్రోజు శ్రీనివాస్, కిషోర్ రెడ్డి, డాక్టర్ జయంతి పాల్గొన్నారు. -
క్యా బాత్ హై
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగుపెట్టే హక్కు లేదు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రల వల్లే వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? - ఐఎస్‌సదన్ ఎన్నికల సభలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మజ్లిస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలకు అంతర్గత సంబంధాలు చాలా ఉన్నాయి. వీరు ఎలాంటి ఎజెండా లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగారు. అభివృద్ధిపై శ్రద్ధలేదు. కేవలం అంతర్గత, స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కటవుతున్న ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. - గౌలిపురా ప్రచార సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి టీఆర్ఎస్కు షాకివ్వాలి. అధికార దుర్వినియోగంతో గ్రేటర్‌పై జెండా ఎగురవేయాలని కలలు కంటున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలి. నగరాభివృద్ధి ఒక్క బీజేపీకే సాధ్యం. అడిక్‌మెట్ ప్రచార సభలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ -
కేసీఆర్‌వి మాటలే.. చేతల్లేవ్!
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సైదాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప కూడా దాటడం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం సైదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ మాయ మాటలతో మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్లలో అభివృద్ధి చేయని వారు వచ్చే మూడేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. మహానగరం ప్రగతి బాటలో పయనించాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు. హడ్కో పథకం కింద తెలంగాణకు కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. నగరంలో విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఉపాధి కల్పన కార్యాలయాలకు ఇప్పటికే వందల కోట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. కేంద్ర సహకారం లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. ఎన్డీఏతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి శైలజ సురేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె బైక్ ర్యాలీ ప్రారంభించి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, సంరెడ్డి సుదర్శన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, జీవన్, అరవింద్‌కుమార్‌గౌడ్, బండారి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు.!
అమరావతికి ప్రధాని తెచ్చింది ఇదే.. హైదరాబాద్‌కు కాదు..అమరావతికి నిధులు తెచ్చుకోండి కేంద్రం నిధుల విషయంపై లోకేష్‌కు కేటీఆర్ కౌంటర్ కేపీహెచ్‌బీ కాలనీ: అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోదీ తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు మాత్రమే తెచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి ఆలోచించే బదులు అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని నారా లోకేష్‌కు చురకలంటించారు. గ్రేటర్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీనిపై కేటీఆర్.. లోకేష్‌కు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దమ్ము, ధైర్యం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్లో ఆయన బుధవారం ఎన్నికల సమావేశంలో ప్రసంగించారు. నగరవాసులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. ‘గాడిదలకు గడ్డివేసి.. ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా?’ అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షాలకు ఓటేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటుందన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటేస్తే ఉపయోగం ఉండదని.. సమస్య పరిష్కారానికి, సమగ్రాభివృద్ధికి అధికార పార్టీకే ఓటేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి వాళ్ల చేత మళ్లీ మళ్లీ ఇబ్బందులకు గురయ్యేకంటే.. గులాబి కండువాను మెడలో వేసుకోవాలని అన్నారు. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి జానకి రామరాజును గెలిపిస్తే హైదర్నగర్ను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. ఈ సందర్భంగా హైదర్‌నగర్, మియాపూర్ డివిజన్లకు చెందిన పలువరు టీడీపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. ‘రేవంత్.. దమ్ముంటే రాజీనామా చేస్తావా’ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న రేవంత్‌రెడ్డికి... దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. -
క్యా బాత్ హై
రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కాదు..వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినం. 60 ఏండ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతదా..హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. - రాజేంద్రనగర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ వుుస్లిం మైనార్టీల ఓట్లు రాబట్టేందుకే ఎంఐఎం బీఫ్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. టీఆర్ఎస్తో కలిసి పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకుంటోంది. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. - పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నగరంలో సీమాంధ్రులకు నష్టం కలిగించే పనులు మానుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. గ్రేటర్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లిస్తారు. - మాదాపూర్ రోడ్ షోలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి -
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిందని ఉత్తమ్ అన్నారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్య విలువలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దళిత విద్యార్థి ఆత్మహత్యకు చేసుకుంటే పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధ పాలనతో ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను గ్రేటర్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. కార్యక్రమంలో కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, ముఖ్యనేతలు ఉద్దెమర్రి నర్సింహా రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో.... బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, నేతలు చింతల రామచంద్రారెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అది నేనే.. ఇది నేనే..
‘సేమ్ కార్డ్, సేమ్ ప్లేస్ బట్ నేమ్స్ చేంజ్’ అని అప్పట్లో ఓ సినిమాలో కోటశ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ సూపర్‌హిట్. డైలాగ్ మాదిరిగానే సేమ్ డివిజన్, సేమ్ కేండిడేట్స్ బట్ సింబల్స్ చేంజ్ అన్నట్టుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌కు జరుగుతున్న ఎన్నికల్లో పలు చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడానికే టీఆర్ఎస్ వెనుకంజ వేసింది. పోటీచేయడానికి బలం లేక, పోటీచేసి చావు దెబ్బతినడం ఎందుకని గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీచేయలేదని పార్టీ నేతలు చెప్పుకున్నారు. 2009 తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌కు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్లో ఒక వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు గులాబీ కండువాలను కప్పుకుని కారెక్కారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా డివిజన్లలో పాతకాపులు, వారి కుటుంబసభ్యులు టీఆర్ఎస్ టికెట్లతో ప్రజల ముందుకొస్తున్నారు. అదే డివిజను, అదే ముఖం అయినా గుర్తు మాత్రమే వేరు అని వారి అనుచరులు కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు. -
బల్దియా బరిలో... శ్రీమంతులు
♦ కో..అంటే కోట్లే.. ♦ ఓట్ల కోసం జనం వద్దకు కోటీశ్వరుల క్యూ... ♦ ప్రమాణ పత్రాల్ల్లో భారీగా ఆస్తులు చూపిన అభ్యర్థులు బల్దియా బరిలో కోటీశ్వరులు రంగంలోకి దిగారు. ప్రధాన రాజకీయ పక్షాలు ‘శ్రీమంతులకే’ ప్రాధాన్యం ఇచ్చి టిక్కెట్లు పంపిణీ చేశాయి. జెండా..ఎజెండా వేరైనా..సామాజికన్యాయంతో సంబంధం లేకుండా మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో అర్థబలం..అంగబలం ఉన్నవారికే అన్ని పార్టీలూ అవకాశం కల్పించాయి. ఈసారి ‘మహా’ సమరంలో నిలిచిన పలువురు బడా లీడర్లు, వారి వారసులు, మాజీ కార్పొరేటర్లు నామినేషన్ పత్రాలతోపాటే తమ ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలను వెల్లడించారు. హైటెక్ నగరంలో రూ.కోట్లు లేనిదే రాజకీయం చేయలేమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. - సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ ఎన్నికల బరిలో కోట్లకు పడగలెత్తిన నేతలే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలోని ఆస్తుల వివరాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైంది. ఇక అభ్యర్థులకు విధించిన వ్యయపరిమితి మాటెలా ఉన్నా..కోట్లాది రూపాయలు ఆస్తులుగా చూపిన అభ్యర్థులకు ఇపుడు ప్రచారపర్వంలో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. అభ్యర్థుల ఆస్తుల చిట్టా చూసి ఓటర్లు ఔరా అంటుండగా.. పాతనగరం సహా కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఇప్పటికీ తాము లక్షాధికారులమేనని, కోట్లకు పడగలెత్తలేదని ప్రమాణ పత్రాలు సమర్పించడం గమనార్హం. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, బండ కార్తీకరెడ్డి తదితరులు తాము ఇప్పటికీ లక్షాధికారులమేనని ప్రమాణ పత్రం సమర్పించడం విశే షం. పలు డివిజన్ల నుంచి పోటీచేస్తున్న ప్రముఖ అభ్యర్థులు చూపిన ఆస్తుల వివరాలిలా ఉన్నాయి. జిట్టా రాజశేఖర్‌రెడ్డి: రూ.21.02 కోట్లు వనస్థలిపురం డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి తనకు స్థిర, చర ఆస్తుల విలువ రూ.21.02 కోట్ల మేర ఉన్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.29 లక్షల విలువ చేసే 1.10 కిలోల బంగారు ఆభరణాలున్నట్లు తెలిపారు. కేకే కూతురు విజయలక్ష్మి: రూ.1.02 కోట్లు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులుకె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి..బంజారాహిల్స్(93) డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు రూ. 93 లక్షల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. రూ. 9 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ లెక్కన విజయలక్ష్మి ఆస్తులు రూ.కోటీ రెండు లక్షలు. పీజేఆర్ కూతురు విజయారెడ్డి: రూ.11.17 కోట్లు ఖైరతాబాద్(91) డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటిచేస్తున్న విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత, మాజీ శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసిన పి.జనార్ధన్రెడి(పీజేఆర్) కూతురు. విజయారెడ్డి పేరిట రూ. 11.17 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు, బంగారు అభరణాలు ఉన్నాయి. భర్త పేరిట రూ. 5.28 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మాజీ మేయర్ మాజిద్ లక్షాధికారే..! నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం డివిజన్ నుంచి మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. నగర ప్రజలకు ఆయన సుపరిచితుడు. ఆయన ఆఫిడవిట్ పరిశీలిస్తే ఆయన లక్షాధికారేనని స్పష్టమవుతోంది. ఆయన పేరిట స్థిర-చర ఆస్తులు రూ.లక్షా 95 వేల 357 లు ఉండగా..భార్య పేరున రూ. 6 లక్షల 31 వేల 522లు మాత్రమే ఉన్నాయి. భార్యపేరున రూ. 5.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కల్గి ఉన్నారు. వ్యవసాయ, వాణిజ్య భూములు లేవు. రూ. లక్ష ఎల్ఐసీ పాలసీ ఉంది. చేతిలో సొంత ఖర్చుల కోసం రూ. 40 వేలు, భార్యపేరున రూ.15 వేలు మాత్రమే ఉన్నాయి. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆస్తులు రూ.69.75 లక్షలు మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి తనకు, తన భర్తకు కలిపి రూ.69 లక్షల 75 వేల స్థిర, చరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. నగదు రూ.50 వేలు, ఆభరణాలు 250 గ్రాములు, ఒక కారు విలువ రూ.2.75 లక్షలుగా చూపించారు. తార్నాకలోని గోకుల్‌నగర్‌లో అపార్టుమెంట్లో ఫ్లాట్ (909 చ.అ.) విలువ రూ.18 లక్షలు, కొంగరలో భర్త పేరుతో రూ.30 లక్షల విలువైన 6.10 ఎకరాల వ్యవసాయ భూమి, యాదగిరిగుట్టలో రూ.1.50 లక్షల విలువైన 35 గుంటల వ్యవసాయేతర భూమితో పాటు సుందరం ఫైనాన్స్‌లో భర్త పేరుతో రూ.50 లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు. హోంమంత్రి నాయిని అల్లుడి ఆస్తుల వివరాలివీ... హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రామ్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిర,చరాస్తులు కలిపి తన పేరిట రూ. 90 లక్షలు, భార్య సమత పేరిట రూ. లక్షా 71 వేల 35 వేలు, తన మీద ఆధార పడ్డ తల్లి పేరిట రూ. 5 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట ఈదులపల్లి గ్రామంలో 9 ఎకరాల వ్యవసాయ భూమిని చూపారు. తలసాని మేనల్లుడు నవీన్ రూ.11.12 కోట్లు రహమత్‌నగర్(102) డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌యాదవ్ పేరిట రూ.11.12 కోట్ల స్తిరచరాస్తులు ఉన్నాయి. ఈయనకు రూ.1.75 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు ఉండగా, భార్య పేరిట రూ. 30 లక్షల విలువ చేసే 1.2 కిలోల బంగారు అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నవీన్‌యాదవ్ స్వయాన మేనల్లుడు. కొప్పుల విఠల్‌రెడ్డి రూ.6.23 కోట్లు మన్సూరాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొప్పుల విఠల్‌రెడ్డి తనకు రూ.6.23 కోట్లు, ఆయన సతీమణి పేరిట రూ.6.37 కోట్ల ఆస్తులున్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇందులో స్థిర, చర ఆస్తులున్నాయి. నాగేందర్ యాదవ్ రూ.17.07 కోట్లు శేరిలింగంపల్లి-106 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన ఆర్.నాగేందర్‌యాదవ్‌కు రూ. 17.07 కోట్లువిలువ చేసే ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్థుల విలువ రూ.16,32,65,000(వ్యసాయ భూమి, నివాస గహం, పాట్ల) తో పాటు బ్యాంకు డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, వాహనాలు వంటి చరాస్థుల విలువ రూ.75 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. రూ.3.80 కోట్లు అప్పున్నట్లు పేర్కొన్నారు. జగదీశ్వర్ రూ.10 కోట్లు మాదాపూర్-107 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న జగదీశ్వర్‌కు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్స్‌లో ప్లాట్లు, వ్యవసాయ భూములు వంటి స్థిర ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉండగా, బంగారు ఆభరణాలు, డిపాజిట్స్, వాహనాలు వంటి చరాస్థుల విలువ రూ. 52,50,000 ఉన్నట్లు చూపారు. తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి రూ.4.87 కోట్లు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు టి.అనితారెడ్డి ఆర్.కె.పురం డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థినిగా పోటీచేస్తున్నారు. ఆమెతోపాటు భర్తపేరిట రూ.4.87 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్లు లెక్కచూపారు. తమ వద్ద రూ.18 లక్షలు విలువచేసే 600 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఇక నగదు రూ.12 లక్షలు మాత్రమే చేతిలో ఉన్నట్లు చూపారు. ఆలె లలిత రూ. 4 కోట్లు గౌలిపురా బీజేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత తనకు రూ.4 కోట్ల విలువ గల స్థిర, చరాస్తులు, రూ. 2.44 లక్షల విలువ గల వ్యవసాయ భూములు, రూ. 35 లక్షల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. మరికొందరు కోటీశ్వరులు... ► కొండాపూర్-104 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న షేక్ హమీద్ పటేల్ ఆస్తుల విలువ రూ.4 కోట్ల 65 లక్షల 94 వేల 750 ఉన్నట్లు ప్రకటించారు. ► మైలార్‌దేవ్‌పల్లి నుంచి స్థానిక సిట్టింగ్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్ గౌడ్ టీడీపీ తరపున తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన పేరు మీద రూ.12.50 కోట్లు ఆస్తులు ఉన్నాయి. ► ఎల్భీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ సతీమణి లక్ష్మీప్రసన్న బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. స్థిర,చర ఆస్తుల విషయానికి వస్తే..ఆమె పేరిట రూ.1.38 కోట్లు, ఆమె భర్త పేరిట రూ.3.79 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ► జీడిమెట్ల డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ డీసీసీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత కె.ప్రతాప్ సతీమణి కూన పద్మ 2014-15 ఆదాయం రూ.8 లక్షలు కాగా, స్థిరాస్తులు రూ.1.40 కోట్లు, చరాస్తుల విలువ రూ. 47.87 లక్షలున్నట్లు చూపారు. ► రంగారెడ్డినగర్ డివిజన్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ బి.లింగంగౌడ్ కుమారుడు విజయశేఖర్‌గౌడ్ స్థిరాస్తులు రూ.4.53 కోట్లుగా, చరాస్తులు రూ.1.13 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ► మల్కాజిగిరి ఎమ్మెల్యే చింత కనకారెడ్డి కోడలు అల్వాల్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఆమె తన స్థిర, చర ఆస్తుల విలువ రూ.58,81,245. ► గన్‌ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూతురు నాగారం శిల్ప తన వద్ద రూ. 50 వేల నగదు, (కేజీ బంగారం, 25 కేజీ వెండి) రూ. 33.50 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ► గుడిమల్కాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి బంగారి ప్రకాశ్ పేరున రూ.4.30 కోట్లు స్థిర,చర ఆస్తులు ఉన్నాయి. ఆస్తి కంటే అప్పు ఎక్కువ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముద్దం నర్సింహాగౌడ్ రూ. 92.90 లక్షల స్థిర, చర ఆస్తి కలిగి ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ. 94.55 లక్షల రుణాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
యువహో...
♦ అభ్యర్థుల ఎంపికలో యువతకు ప్రాధాన్యం ♦ అన్ని పార్టీలదీ అదే బాట... విద్యార్హతల్లో మాత్రం నిరాశ! అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు ‘యువ’ మంత్రం పఠించాయి. ‘గ్రేటర్’ ఇక యువతదే కాబోతోంది. ‘మహా పోరు’ బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు యుక్త వయస్కులే కావడం విశేషం. గతంలో అవలంబించిన మూస పద్ధతులను, విధానాలను పక్కనబెట్టి సింహభాగం టిక్కెట్లు యువతకు కేటాయించడం ద్వారా అన్ని పార్టీలూ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. గ్రేటర్ పరిధిలో యువ ఓటర్లే కాదు..యువ కార్పొరేటర్లదే హవా కాబోతోంది. ఇక విద్యార్హతల విషయానికొస్తే.. ఈసారి కొంత నిరాశే కలుగుతుంది. ఎక్కువ మంది ఎస్సెస్సీ విద్యార్హత కలిగిన వారే ఉండడం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో కాంగ్రెస్ పార్టీలో.. కాంగ్రెస్‌పార్టీ 149 డివిజన్లకు అభ్యర్థులను నిలిపింది. ఇందులో 20-30 మధ్య వయసున్నవారు 22 మంది, 30-40 మధ్య వయస్సున్నవారు 56 మంది, 40-50 మధ్యనున్నవారు 60 మంది, 50-60 ఏళ్లమధ్యనున్నవారు 9 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరున్నారు. విద్యార్హతలిలా.. ఎస్సెస్సీలోపు ఆరుగురు, పదోతరగతి చదివినవారు 64, ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారు 21, డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు 46, పీజీ చదివినవారు 12 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో.. గ్రేటర్ పరిధిలో టీడీపీ 92 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలిపింది. వయసులవారీగా పరిశీలిస్తే 20-30 ఏళ్ల మధ్యలో 16 మంది, 30-40 ఏళ్ల మధ్యలో 38 మంది, 40-50 ఏళ్ల మధ్యలో 25 మంది, 50-60 ఏళ్ల మధ్యలో 13 మంది ఉన్నారు. విద్యార్హతలు... ఎస్సెస్సీ చదివినవారు 36 మంది, ఇంటర్మీడియెట్ 18 మంది, డిగ్రీ- 33, పీజీ పూర్తిచేసినవారు ఐదుగురు ఉన్నారు. టీఆర్ఎస్లో .. అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇందులో 20-30 ఏళ్ల మధ్యవయస్సున్నవారు 34 మంది, 30-40 ఏళ్ల మధ్య గ్రూపువారు 56 మంది, 40-50 మధ్య వయోగ్రూపువారు 48 మంది, 50-60 మధ్యనున్నవారు 8 మంది, అరవై ఏళ్లు పైబడిన వయోవృద్ధులు నలుగురున్నారు. విద్యార్హతలిలా.. 150 మంది అభ్యర్థులలో పదోతరగతి లోపు చదివినవారు ఐదుగురు, పదోతరగతి చదివినవారు 52 మంది, ఇంటర్ పూర్తిచేసినవారు 30 మంది ఉన్నారు. ఇక డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు 40 మంది, పీజీ పూర్తయినవారు 20 మంది ఉన్నారు. న్యాయశాస్త్రం అభ్యసించిన వారు ముగ్గురున్నారు. ఎంఐఎం పార్టీలో.. గ్రేటర్ పరిధిలో ఎంఐఎం 60 డివిజన్లలో అభ్యర్థులను నిలిపింది. వీరిలో 20-30 ఏళ్ల మధ్యనున్నవారు 9 మంది, 30-40 మధ్య వయస్సున్నవారు 18 మంది, 40-50 ఏళ్ల మధ్యనున్నవారు 22 మంది, 50-60 ఏళ్ల మధ్య వయసున్నవారు 9 మంది, 60 ఏళ్లు పైబడినవారు ఇద్దరు ఉన్నారు. విద్యార్హతలు.. పదో తరగతి లోపు 8 మంది, పదోతరగతి చదివినవారు 10 మంది, ఇంటర్ చదివినవారు 22 మంది, డిగ్రీ పూర్తిచేసినవారు 11 మంది, పీజీ పూర్తిచేసినవారు 9 మంది ఉన్నారు. బీజేపీలో.. గ్రేటర్ పరిధిలో బీజేపీ 65 సీట్లలో పోటీ చేస్తుంది. ఇందులో 20-30 ఏళ్ల మధ్యవయసున్నవారు 21 మంది, 30-40 ఏళ్ల మధ్యన 30, 40-50 ఏళ్ల మధ్యన 10, 50-60 మధ్య వయసున్నవారు నలుగురున్నారు. విద్యార్హతలు.. నిరక్ష్యరాస్యులు ఒకరు, ఎస్సెస్సీ 16 మంది, ఇంటర్ 17 మంది, డిగ్రీ 24 మంది, పీజీ చేసినవారు 8 మంది ఉన్నారు. విద్యార్హతే ప్రామాణికం కాదు అన్ని పార్టీలు గెలుపుగుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. డబ్బు, కులం వంటివి ప్రముఖ పాత్ర వహించాయి. అయితే విద్యార్హత ఉన్నవారు నీతివంతులని చెప్పలేం. చదువుకోనంత మాత్రాన వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. ప్రజల సమస్యల పట్ల అవగాహన, నిబద్ధత ఉంటే చాలు. కార్పొరేటర్లకు ప్రజాసేవే పరమావధి కావాలి. - ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యువతకు టికెట్లివ్వడం మంచి పరిణామం గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈసారి యువతకు టికెట్లివ్వడం మంచి పరిణామం. చొరవ, కార్యదక్షత వంటి విషయాల్లో యువకులే ముందుంటారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడం యువత ద్వారానే సాధ్యం. ఈవిషయాన్ని గ్రహించే అన్ని రాజకీయ పార్టీలు యువతీ యువకులను బరిలో నిలిపాయి. - కోడం కుమార్, తెలంగాణ స్కాలర్స్ అసోసియేషన్ గ్రేటర్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారే అధికంగా ఉన్నారు. మహానగర పరిపాలన, సమస్యల పరిష్కారం.. ప్రజలకు తక్షణం మెరుగైన సేవలందించే గ్రేటర్ పాలకమండలిలో యువరక్తాన్ని నింపడం ద్వారా విశ్వనగరం దిశగా అడుగులేసేందుకు ఆయా పార్టీలు సన్నద్ధమయ్యాయి.ఇక మహిళా సాధికారత విషయానికి వస్తే మహిళలకు సింహభాగం సీట్లు కేటాయించడం ద్వారా మహిళాశక్తిని నిరూపించుకునే అవకాశం కల్పించారు. విద్యార్హతల విషయానికి వస్తే కొంత నిరాశే ఎదురవుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల విద్యార్హతలు, వయసుల వివరాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న మహానగరంలో పలు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో వారి విద్యార్హతలకంటే గెలుపుగుర్రాలనే అన్వేషించాయంటే అతిశయోక్తి కాదు. పలు రాజకీయ పార్టీల్లో పలువురు అభ్యర్థుల విద్యార్హతలు పదోతరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే. అంగబలం, అర్థబలం, సామాజిక సమీకరణలు వెరసి అభ్యర్థుల చదువును పక్కనబెట్టేలా చేశాయని పలు పార్టీలు సెలవిస్తున్నాయి. హైటెక్ నగరిలో రాబోయే కార్పొరేటర్లు టె క్ గురూల అవతారం ఎత్తాలని భావిస్తున్న వారికి ఈ విషయంలో నిరాశపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే అభ్యర్థి విద్యార్హతలకంటే స్థానికంగా ఉండి..నేరచరిత లేనివారు, సేవాభావం ఉన్నవారిని ఎన్నుకుంటే జనం సమస్యలు పరిష్కారం అవుతాయన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల విద్యార్హతలు, వయోగ్రూపుల వివరాలు పైవిధంగా ఉన్నాయి... -
అత్త ‘కారు’.. కోడలు ‘సైకిల్’
కూకట్పల్లి: గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని చిత్ర విచిత్రాలో.. బంధువులు ప్రత్యర్థులవుతున్నారు. ప్రత్యర్థులు ఒకటవుతున్నారు. కూకట్పల్లి వివేకానందనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మొదట మాధవరం స్వాతిని ఖరారు చేశారు. అయితే స్వాతి పేరు ఓటర్ లిస్ట్‌లో లేకపోవడంతో ఆమె తల్లి ఎం.లక్ష్మిబాయిని రంగంలోకి దింపారు. కాగా బాలాజీనగర్ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా లక్ష్మీబాయి సొంత అన్న కూతురు గోనె రూప అంతకముందే బరి లో ఉన్నారు. దీంతో కోడలు సైకిలెక్కితే.. అత్త కారెక్కిందని స్థానికులు చమత్కరిస్తున్నారు. వీరిద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడంతో పాపం బంధువులు పడరాని కష్టాలు పడుతున్నారు. ఓ పూట అత్త పార్టీకి, మరో పూట కోడలు పార్టీకి మద్దతు పలుకుతూ ప్రచారం చేస్తున్నారు. -
నిఘా కళ్లు..!
ప్రశాంత ఎన్నికలకు పోలీస్ వ్యూహం సాంకేతికంగా ‘సున్నిత’ విశ్లేషణ కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ గ్రేటర్ ఎన్నికల వేళ..నగరంపై నిఘా పెరిగింది. శాంతిభద్రతల పరిరక్షణకు...ప్రశాంత పోలింగ్‌కు పోలీసు విభాగం సరికొత్త పంథాలో సిద్ధమవుతోంది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్‌బూత్‌ల వారీగా గుర్తిస్తోంది. పోలింగ్ రోజున 20 వేల మందితో బందోబస్తుకు వ్యూహరచన చేస్తోంది. గతంలో సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించేలా..ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -సాక్షి, సిటీబ్యూరో ఎన్నికలు వచ్చాయంటే చాలు...నగరంలోని సమస్యాత్మక, అతి సున్నిత, సున్నిత పోలింగ్ బూత్‌ల ఎంపిక తప్పనిసరి. ఇప్పటి వరకు మూసధోరణిలో సాగిన ఈ విశ్లేషణకు నగర పోలీసులు కొత్త పంథా ప్రారంభించారు. పోలింగ్ రోజున 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్న అధికారులు.. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్సీసీ, స్కౌట్స్ తదితర బలగాల సేవలూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. సిటీలో అందుబాటులో ఉన్న పోలీసు, కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక నిఘా కోసం వాడాలని నిర్ణయించారు. నేర చరిత్ర ఉన్న వారిని, అసాంఘిక శక్తులను బైండోవర్ చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ... నగరంలో గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ తీసువాల్సిన చర్యల్ని నిర్ణయిస్తున్నారు. ఈసీ నుంచి అందిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్న ఫ్లయింగ్ స్వ్కాడ్స్, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కౌంటిగ్ కేంద్రం వద్ద ఫెన్సింగ్, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మూడంచెల భద్రత ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఎలక్షన్ సెల్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ వై.నాగిరెడ్డి నిత్యం సమీక్షిస్తూ అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఎంపిక నగరంలోని 1400 ప్రాంతాల్లో 4143 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో పోలింగ్ స్టేషన్ నైజం తెలుసుకోవడం అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఆ ప్రాంతంలో ఎంత మంది? ఏ స్థాయి? అధికారుల్ని ఏర్పాటు చేయాలన్నది స్పష్టమవుతుంది. దీనికోసం సాధారణంగా పోలీసు విభాగం గతంలో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పాటు భిన్న వర్గాలకు చెందిన వాటిని పరిగణలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆ పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకమా? అతి సున్నితమా? సున్నితమా? అన్నది నిర్థారిస్తుంటారు. ఈ జాబితాను బట్టే అక్కడి విధులకు సిబ్బందిని కేటాయించడం పరిపాటి. ఈసారి పోలింగ్ స్టేషన్ నైజాన్ని తెలుసుకోవడానికి నగర పోలీసులు సాంకేతికంగా వ్యవహరిస్తున్నారు. ఆ వార్డులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలతో పాటు ప్రభావితం చేసే అంశాలనూ పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా అధ్యయనం చేస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కొత్వాల్ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 20 వేల మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి పోలీసు విభాగం 20 వేల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కమిషనరేట్‌లో ఉన్న 15 వేల మందికి అదనంగా జిల్లాలు, ఇతర విభాగాల నుంచి ఐదు వేల మందిని తీసుకువస్తున్నారు. ప్రచార ఘట్టాన్ని సైతం శాంతియుతంగా పూర్తి చేయడానికి ప్రణాళికల్ని ఎలక్షన్ సెల్ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలను క్రమబద్ధీకరించడం కోసం ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, మాజీ సైనికోద్యోగుల సేవలు వినియోగించుకోనున్నారు. -
గుండెల్లో రె‘బెల్స్’
-
గుండెల్లో రె‘బెల్స్’
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో వీరి సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... కుత్బుల్లాపూర్‌లో.. జీడిమెట్లలో గుమ్మడి మాధవి, చింతల్లో ఐదుగురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. సూరారంలో అత్యధికంగా ఎనిమిది మంది ఔత్సాహికులు నామినేషన్లు వేయడం గమనార్హం. ఖైరతాబాద్‌లో.. బంజారాహిల్స్ డివిజన్ నుంచి ప్రగతిరెడ్డి, రఘుముదిరాజ్, సోమాజిగూడ నుంచి కె.ప్రసన్న నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కూకట్‌పల్లిలో... కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి జనగాం సురేష్‌రెడ్డి, లింగ్యానాయక్, వివేకానందనగర్ కు మాచర్ల పద్మభద్రయ్య, కె.శ్రీలత, శ్వేత నామినేషన్లు వేశారు. ఆల్విన్ కాలనీ నుంచి లద్దె నాగరాజు, కె.వెంకటేశ్ గౌడ్, హైదర్‌నగర్ నుంచి కోడూరి రాధాకృష్ణ, జానకిరామరాజు, రాధాకృష్ణ నామినేషన్లు వేశారు. అల్లాపూర్ నుంచి టి.అంజమ్మ, ఎన్.పుష్పలత, మూసాపేట్ నుంచి టి.ఎల్లారావు, బి.నర్సింగ్‌రావు, ఎ.వీరబాబు, ఫతేనగర్ నుంచి టి.ఎల్లారావు, భిక్షపతి, శ్రీనివాస్ గౌడ్, ఓల్డ్‌బోయిన్‌పల్లి నుంచి యాదగిరి, అమూల్య, జంగయ్య, అజార్, రవికుమార్, బాలానగర్ నుంచి ఆవుల రవీందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, కూకట్పల్లి నుంచి జూపల్లి శైలజ, ఎమ్డీ ఇబ్రహీం నామినేషన్లు వేశారు. రాజేంద్రనగర్‌లో.. రాజేంద్రనగర్‌లో టి.అర్చన జయప్రకాశ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. సికింద్రాబాద్‌లో... అడ్డగుట్టలో లక్ష్మీ హంసరాజ్, మెట్టుగూడలో సంధ్య, తార్నాకలో ఎల్లమ్మ, సీతాఫల్మండిలో హేమ, జ్యోతి రెబెల్స్‌గా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మహేశ్వరంలో.. సరూర్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఏడుగురు నామినేషన్లు వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజ్‌గిరిలో.. మచ్చబొల్లారం నుంచి రాజ్ జితేంద్రనాథ్, మన్నె శ్రీనివాస్‌రాజు, ఉదయ్‌కుమార్, సువర్ణ నామినేషన్లు వేశారు. వెంకటాపురం నుంచి సీఎల్ యాదగిరి, సబితాకిషోర్, సంపత్, శ్రీలత బరిలో నిలిచారు. అంబర్‌పేట్‌లో... నల్లకుంట నుంచి గుంటి నాగరాణి, అంబర్పేట్ నుంచి కె.పద్మావతి, కాచిగూడ నుంచి లావ ణ్య నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లిలో.. కొండాపూర్ డివిజన్ నుంచి మమత, రాజేష్ నామినేషన్లు వేశారు. మిగతా డివిజన్లలో రెబెల్స్ బెడద అంతగా లేనట్లు సమాచారం. ముషీరాబాద్‌లో.. రాంనగర్ డివిజన్లో నందికంటి నర్సింగ్‌రావు, అడిక్‌మెట్ నుంచి సునీత ప్రకాశ్‌గౌడ్, హేమలత జయరాంరెడ్డి నామినేషన్లు వేశారు. ఉప్పల్‌లో.. ఏఎస్‌రావునగర్‌లో మణెమ్మ, పద్మ, చర్లపల్లిలో చెన్నయ్య గౌడ్, మీర్పేట్లో ప్రభుదాస్, మల్లాపూర్‌లో భాస్కర్‌గౌడ్, కొత్తమల్లారెడ్డి, నాచారంలో సువర్ణ, రామంతాపూర్‌లో భాగ్యరేఖ, రాజేశ్వరి, హ బ్సిగూడలో గడ్డం శాంతమ్మ రెబెల్స్‌గా బరిలో నిలిచారు. సనత్‌నగర్‌లో... బేగంపేట్‌లో కాంచనమాల, తరుణి, అనిత, సనత్ నగర్ నుంచి బైరు రమ్య అసంతృప్తులుగా బరిలోకి దిగారు.ట ఎల్బీ నగర్లో... నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అధికార టీఆర్ఎస్కు రెబెల్స్ బెడద అధికంగా ఉంది. హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, మన్సూరాబాద్, నాగోల్, లింగోజిగూడ, చంపాపేట్, కొత్తపేట్, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్ల లో కొంతమందికి పార్టీ టిక్కెట్ ప్రకటించనప్పటికీ నామినేషన్లు వేయ డం గమనార్హం. వనస్థలిపురంలో జిట్టా రాజశేఖర్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి నగర్లో లక్ష్మీప్రసన్న, రంజిత్గౌడ్తో పాటు ఐదుగురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. మన్సూరాబాద్‌లో నాగరాజు, నాగోల్‌లో చెరుకు ప్రశాంత్‌గౌడ్ సహా ఏడుగురు నామినేషన్లు వేశారు. లింగోజిగూడలో అత్యధికంగా 17 మంది టీఆర్ఎస్ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. చంపాపేట్‌లో ఆరుగురు, కొత్తపేట్‌లో 8మంది, గడ్డిఅన్నారంలో ఇద్దరు, హస్తినాపురంలో ఏడుగురు నామినేషన్లు వేయడం గమనార్హం. బీజేపీలోనూ అసంతృప్తులు బీజేపీలోనూ అసంతృప్తులు తప్పడం లేదు. బీజేపీ బలంగా ఉన్న డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో కమలనాథులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అంబర్పేట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి కాస్తోకూస్తో బలం ఉన్న డివిజన్లను టీడీపీకి కేటాయించడంతో పలువురు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులవుతున్నారు. -
నేడే విడుదల
ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పోటాపోటీగా ఉన్న చోట్ల మరింత జాప్యం కాంగ్రెస్ జాబితాలో బండ కార్తీక... టీఆర్ఎస్ జాబితాలో బొంతు బస్తీల్లో ఎన్నికల ఊరేగింపులు. ప్రచారం కొత్తపుంతలు. హిమాయత్ నగర్లో ఓ పార్టీ అభ్యర్థి గంగిరెద్దుల వారి డప్పు వాయిస్తూ... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సిటీబ్యూరో: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి సుమారు 51 డివిజన్లకు, కాంగ్రెస్ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గురువారం కసరత్తు పూర్తి చేశాయి. ఎంఐఎం అదే బాటలో నడుస్తోంది. టీడీపీ-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించే ందుకు యత్నిస్తోంది. తొలి జాబితాలో నియోజకవర్గాల ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్న నాయకుల కుటుంబ సభ్యులతో పాటు మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దింపే వారి పేర్లను ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రాంమోహన్‌ను చర్లపల్లి డివిజన్‌కు... ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ లేదా వెంకటేశ్వర నగర్ డివిజన్లలో ఒకదానికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సుమారు 40 మందితో ఇచ్చే తొలి జాబితాలో ఏకాభిప్రాయం వచ్చిన కుత్బుల్లాపూర్‌లోని ఐదు, ఎల్బీనగర్లో ఎనిమిది డివిజన్లకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థులను గుర్తించిన డివిజన్లలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ జాబితాలో తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బౌద్ధనగర్ నుంచి ఆదం ఉమాదేవి పోటీ చేయనున్నారు. బీజేపీలో భాగ్‌అంబర్‌పేట నుంచి బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి సతీమణి పేరు తొలి జాబితాలో ప్రకటించనున్నారు. ఉత్కంఠ బల్దియా ఎన్నికల్లో పోటీ చేయనున్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నారన్న సమాచారంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కె.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నగరంలో ముఖ్యనేతలు, మంత్రులు, ఇన్చార్జులతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపికపై అధినేతకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. టిక్కెట్లు ఆశించి ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరుతున్న ఆశావహుల మధ్య సిగపట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కీలక డివిజన్లకు ముగ్గురు నుంచి ఐదుగురేసి టిక్కెట్లు ఆశిస్తుండడంతోతీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇతర పార్టీల నుంచి జోరుగా టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఆశావ హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపై డివిజన్ స్థాయిలో ఐదు సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అం గబలం, అర్థబలం ఉండి.. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన గెలుపు గుర్రాలకే టిక్కెట్లిస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇటీవల ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయక గణం, మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరికికార్పొరేటర్ టిక్కెట్లు ఎరజూపి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పిన విషయం విదితమే. తాజాగా చేరుతున్న వారిని తమతో కలుపుకుని వెళ్లేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులను బలవంతంగా అభ్యర్థులుగా తమపై రుద్దుతున్నారని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇన్చార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్న ఇన్చార్జులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు టిక్కెట్లు ఆశిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా కొందరికి టీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారైనట్లు సోషల్ మీడియా గ్రూపుల్లో సంక్షిప్త సందేశాలు అందుతుండడంతో గందరగోళం మొదలైంది. పార్టీ అధిష్టానం మాత్రం తుది జాబితా ప్రకటించలేదని... సోషల్ మీడియాలో ప్రచారం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేస్తోంది. -
ఖైదీల క్షమాభిక్షపై నీలినీడలు!
గ్రేటర్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాప్యం సాక్షి, హైదరాబాద్: ఖైదీలకు మళ్లీ ఎదురుచూపులు తప్పడంలేదు. క్షమాభిక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున విడుదల చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఖైదీల క్షమాభిక్షపై ఏర్పాటైన జైలు సూపరింటెండెంట్ల కమిటీ ఒక జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించే పరిస్థితి లేదు. నిర్ణయాన్ని ప్రకటించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం. ఇప్పటికిప్పుడు ఈసీ నుంచి అనుమతి తీసుకున్నా ఖైదీల క్షమాభిక్ష జనవరి 26 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కొన్ని మార్గదర్శకాలను సూచించింది. తీర్పు ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాయి. న్యాయస్థానం తీర్పును అనుసరించి నియమ నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర జైళ్ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమిస్తూ జైళ్లశాఖ ఒక కమిటీని వేసింది. క్షమాభిక్షకు అర్హత కలిగిన ఖైదీలను కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలో అందజేసింది. తెలంగాణలోని అన్ని జైళ్లలో శిక్షపడిన ఖైదీలు 18 వందల మంది వరకు ఉండగా వీరిలో దాదాపు 300 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హత కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. -
మారాలి మన నగరి!
‘మనది గ్రేటర్ సిటీ.. గ్రేట్ సిటీ. నిజమే.. కానీ మన లైఫ్ మాత్రం అంత ఈజీగా లేదీ నగరంలో. అందుకే ఈ నగరం మారాలి. మార్పు తేవాలి’ అంటున్నారు నగర యువత. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగర జీవనం, వసతులు, ఇక్కడి పరిస్థితులపై బేగంపేటలో ‘సాక్షి’ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. ఈవ్ టీజింగ్, ట్రాఫిక్, రోడ్లు, పర్యావరణ సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారని, వీటి పరిష్కారానికి కృషి చేసేవారికే పట్టం కడతామన్నారు. - సోమాజిగూడ ట్రాఫిక్.. టెర్రిఫిక్ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ అని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ జామ్‌లు, తద్వారా వచ్చే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారులో రావడం స్టేటస్ సింబల్‌గా భావించడం మానుకోవాలి, బస్, ఎంఎంటీఎస్ సౌకర్యం మరింత పెంచాలి. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరించాలి. మెట్రోరైల్ వేగంగా పూర్తిచేస్తే కొంతట్రాఫిక్ తగ్గుతుంది. ‘ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్’ నా స్వప్నం. ఈ దిశగా ఆలోచించే వారికి ఓటెయ్యాలి. - గిరీష్మా పట్నాయక్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ ఈజీగా ఇండస్ట్రీ పాలసీ.. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేయాలి. ఐటీ రంగం సహా ఫ్యాషన్ పరిశ్రమను ప్రోత్సహించాలి. దేశానికే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఉద్యోగాల కల్పనలో మేటిగా నిలపాలి. పదవ తరగతి, ఇంటర్ పాసైన వారిలో కూడా నైపుణ్యం పెంచే శిక్షణ ఇవ్వాలి. ప్రతిఒక్కరికి ఉద్యోగం, ఉపాధి లభించాలనేదే నా డ్రీమ్. పార్టీల ఎజెండాల్లో పై అంశాలకు స్థానం కల్పించాలి. - స్వప్న, మేనేజర్, హామ్స్టెక్ ఇనిస్టిట్యూట్ డీజిల్ వెహికిల్స్‌ను నిషేధించాలి అభివృద్ది పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం నగరం ఎదుర్కుంటున్న పెద్ద సమస్య. కాలుష్యం వెదజల్లుతున్న ఆటోలను, ఇతర వాహనాలను నిషేధించాలి. ఢిల్లీ నగరం మాదిరిగా మన సిటీలోనూ డీజిల్ కార్లపై నిషేధం విధించాలి. ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్, పాఠశాల, కార్యాలయం సహా ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచేలా చట్టాలను కఠినతరం చేయాలి. నాయకులు ఆదిశగా ఆలోచించరు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించే వారికే పట్టం కట్టాలి. - దీపిక అరుమళ్ల, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబోయ్ రోడ్లు... నగరంలో రోడ్లు గుంతలతో దారుణంగా ఉన్నాయి. వీటి వల్ల వాహనాలపై వెళ్తున్నవారు కిందపడి తీవ్ర గాయాలపాలు కావడం చూశాను. హైవేలు నిర్మించినట్లే సిటీరోడ్ల రూపురేఖలు మార్చాలి. శుభ్రమైన, విశాలమైన రహాదారులతో నగరం వెలిగిపోవాలనేది నా డ్రీమ్ హైదరాబాద్. ఫ్యామిలీస్ ఉంటున్న ఏరియాల్లో వైన్స్, బార్లను తొలగించాలి. గ్రేటర్ బరిలో నిలిచే నాయకులు ఈ దిశగా ఆలోచించాలి. - నిహారికరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ -
బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్
హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికల్లో విజయం తమదేనని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం రాత్రి గోల్కొండ సీరత్ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ మిలాద్ గ్రౌండ్లో జరిగిన జల్సా మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. నగర ప్రజలు మజ్లిస్ పార్టీని ఆదరిస్తున్నారనీ, తాము ఎలాంటి ఎన్నికల హామీలు ఇవ్వమని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తమకు బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇస్తామని, అదేవిధంగా అవసరమైతే వారి నుంచి మద్దతు తీసుకుంటామని తెలిపారు. కొందరు యువకులు ఇస్లాం పట్ల సరైన అవగాహన లేక ప్రలోభాలకు లొంగి విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు -
కొట్లాటలకు ఇదేనా సమయం?
దానం, మల్లేశ్‌లను మందలించిన ఉత్తమ్, భట్టి సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అంతర్గత కొట్లాటలు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఇష్టాయిష్టాలకు అతీతంగా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో తన్నులాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీదా ఉంది’ అని కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ విషయంలో జరిగిన కొట్లాట నేపథ్యంలో వీరిద్దరితో ఉత్తమ్, భట్టి బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు వస్తున్న తరుణంలో సరిహద్దులంటూ వివాదం చేయడం, భౌతికదాడులకు దిగడం తప్పుడు సంకేతాలను ఇస్తాయన్నారు. భవిష్యత్తులో ఎవరూ, ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, ఇకపై అలాంటివి మళ్లీ జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
ఐదేళ్లలో అద్దంలా తీర్చిదిద్దుతాం
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటువేసి ఐదేళ్ల సమయమిస్తే.. మహానగరాన్ని దశలవారీగా అద్దంలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎంతసేపూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నా రు. విమర్శలుమాని ఢిల్లీ బాట పట్టి తెలంగాణకు నిధులు సాధించే పని పెట్టుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించేలా కృషి చేయాలని సవాల్ విసిరారు. దేశంలో ఎన్నికలు జరిగే ప్రతిచోటుకూ వెళ్లి ప్యాకేజీలు ప్రకటించడాన్ని మోదీ అలవాటు చేసుకున్నారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ స్వచ్ఛ భారత్ పేరిట ఎవరి చీపురు వారికిచ్చి ఊడ్చుకొమ్మని.. ఎవరి డబ్బుతో వారు బ్యాంక్ ఖాతా తె రుచుకోవాలని చెప్పిందే తప్ప పేదలకు లబ్ధి చేకూర్చే ఒక్క సంక్షేమ పథకాన్నీ ప్రవేశపెట్టలేదన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలులో దళారులు డబ్బులు అడిగితే చెప్పుతో కోట్టాలని కేటీఆర్ పేదలకు సూచించారు. -
‘గ్రేటర్’కు చంద్రబాబు వస్తారా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు త్వరలో జరగనున్న ఎన్నికలు తెలంగాణ టీడీపీలో గుబులు రేపుతున్నాయి. వరుసబెట్టి నేత లు ఫిరాయిస్తుండడంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన టీ టీడీపీ నేతలు... పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్ర బాబుపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రచారానికి రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ చంద్రబాబు వచ్చేదీ లేనిదీ తేల్చకుండా.. ‘మీరు స్వతంత్రంగా ఎదగాలి. ప్రతి విషయానికి నావైపు చూడొద్దు..’ అంటూ హితబోధ చేస్తున్నారు. దీంతో టీటీడీపీ నేతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉనికి కోసమైనా.. వరంగల్ ఉప ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న బీజేపీ, టీడీపీలు గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ జట్టుకట్టనున్నాయి. అయితే తెలంగాణలో కనిపించకుండా పోయిన టీడీపీ ఉనికిని కనీసం హైదరాబాద్‌లోనైనా కాపాడుకోవాలంటే... ‘గ్రేటర్’ ఎన్నికల్లో చెప్పుకోదగిన స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితి. అసలు సార్వత్రిక ఎన్నికల్లో టీ టీడీపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా గ్రేటర్ పరిధిలోవే. కానీ ఇక్కడి ఎమ్మెల్యేల్లో నలుగురు అధికార టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారం చేసి ఫలితం రాబట్టడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీటీడీపీ నాయకత్వం పార్టీ అధినేత చంద్రబాబుపైనే ఆధారపడుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబుతో నేతలు భేటీ అయ్యారు. ‘గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మీరు పాల్గొనాలి. మీరు ప్రచారం చేస్తేనే గట్టెక్కుతాం.’ అని మొరపెట్టుకున్నారని సమాచారం. కానీ ప్రచారానికి వచ్చేదీ, రానిదీ తేల్చకుండా... ‘మీరు స్వతంత్రంగా ఎదగాలి. ప్రతి విషయానికి నావైపు చూడొద్దు..’ అని చంద్రబాబు పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు గ్రేటర్ ప్రచారానికి వస్తారా, లేదా అన్న విషయం తెలియక పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఫిరాయింపులతో ఆందోళన ఒకవైపు ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు దూసుకువస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో... తమ నేతలు పార్టీ ఫిరాయిస్తుండడంతో టీ టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిపై చర్చించేందుకు టీ టీడీపీ నాయకత్వం శనివారం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కానుందని తెలిసింది. ‘రాజకీయాల్లో ఇవన్నీ సహజం. అధికార పార్టీ తాయిలాలకు లొంగిపోయి పార్టీలు మారే వారుంటారు. అయినా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడ డానికే ప్రాధాన్యం ఇస్తాం. ఎమ్మెల్యేలు మారుతున్నా, మా క్యాడర్ మాకుంది..’ అని టీ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
సరికారు మాకెవ్వరూ!
తెరాసలో విజయోత్సాహం ‘గ్రేటర్’ ఎన్నికలకూ ఓరుగల్లు మంత్రం ఒంటరి పోరుకు గులాబీ శ్రే ణులు సన్నద్ధం సిటీబ్యూరో: వరంగల్ ఉప ఎన్నికల ఫలితం నగర తెరాస శ్రేణుల్లో కొత్త జోష్‌ను తెచ్చిపెట్టింది. సరి‘కారు’ మాకెవ్వరూ అంటూ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే ఊపుతో జనవరిలో నిర్వహించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగానే సత్తా చాటేందుకు వీలుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని అధికార టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భేష్ అంటూ వరంగల్ ఓటర్లు తీర్పునిచ్చిన నేపథ్యంలో... కాస్త అటూ ఇటూగా అదే నినాదంతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లనుంది. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు స్థానాలకే పరిమితమవడం... గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమి పాలవటంతో నగరంలోని పార్టీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డారు. అనంతరం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి రావడంతో మళ్లీ వీరిలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరోవైపు నగరంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేసి... సానుకూల ఫలితాన్ని రాబట్టే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మంత్రులు తలసాని, పద్మారావు, నాయిని, మహమూద్ అలీతో పాటు కేటీఆర్, హరీష్, మహేందర్‌రెడ్డి నగరంలో మరింతగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను పరుగెత్తించే బాధ్యతలు తీసుకోనున్నారు. డివిజన్ల వారీగా పార్టీ, ప్రభుత్వ బలాలు, బలహీనతలను క్షేత్ర స్థాయిలో అంచనా వేయనున్నారు. నగర వాసులపై వరాల వర్షం గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నగర వాసులపై ప్రభుత్వం మరింతగా వరాల వర్షం కురిపించనుంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇప్పటికే 20 లక్షల ఇళ్లకు రెండేసి చెత్త డబ్బాలు పంపిణీ చేయడంతో పాటు... నగర రహదారులను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా నగరంలో 1000 కి.మీ. రహదారులు, 400 కి.మీ. మేర వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. ఇవి కాకుండా మహిళా స్వయం సంఘాలకు రూ.1000 కోట్ల రుణాలు... నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు... మరో 50 ప్రాంతాల్లో రూ.5కే భోజనం... జీఓ 58 కింద సుమారు లక్ష మందికి ఉచిత భూ క్రమబద్ధీకరణ వంటి అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. అదే విధంగా డిసెంబర్ 15 నుంచి నగరానికి గోదావరి జలాల రాకతో పాటు మురికివాడల్లో రూ.100కే మంచినీరు, రూ.100కే విద్యుత్ సరఫరా అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
మాటలే..చేతల్లేవ్
- గ్రేటర్ ఎన్నికల కోసమే స్వచ్ఛ హైదరాబాద్.... - టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు అధ్వానం - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం ఆర్కేపురం: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి స్వచ్ఛహైదరాబాద్ పేరుతో తమ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం ఆర్కేపురంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు సెటిలర్లను, సినిమా వాళ్లను ఇష్టమొచ్చినట్లు తిట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, తెలంగాణ తెచ్చింది తామేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెటిలర్లకు రక్షణగా ఉంటుందని అన్నారు. ముస్లింల ఓట్ల కోసం 12 శాతం రిజర్వేషన్ చేస్తామన్నారని, ఇంత వరకు దాని ఊసెత్తలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందన్నారు. ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, పీవీ నర్సింహారావు హైవే, ఔటర్ రింగురోడ్డు, కృష్ణా నీటి మూడవ ఫేజ్ పైపులైన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు టి.నాగయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, బండి నర్సింహాగౌడ్, కార్తీక్‌రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జంగారెడ్డి, హనుమంత్‌రెడ్డి, సాంబయాదవ్, లావణ్య, ఎస్.సుధీర్‌రెడ్డి, పున్న గణేష్, మహేందర్‌యాదవ్, సాజీద్, కొండల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీలక్ష్మి, దేవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్‌తోపాటు ఇతర నాయకులు ఘనంగా సత్కరించారు. -
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కుత్బుల్లాపూర్: మజ్లిస్‌తో చేతులు కలిపిన టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ విసృ్తతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎక్సలెన్సీ గార్డెన్లో నిర్వహించారు. బీజేపీ అర్బన్ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నవంబర్ మొదటి వారం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉంటుందని, తరువాత అన్నిస్థాయిల కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. మజ్లిస్‌ను ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి.. గ్రేటర్ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ పూర్తిగా నాశనం చేసిందని, బీజేపీ శ్రేణులు ‘మజ్లిస్ పార్టీని ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి’ అన్న నినాదంతో ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ ఉగ్రవాదులకు సేఫ్ జో న్గా మారిందని ఆరోపించారు. కేసులు పెట్టకుండా.. అరెస్టులు చేయకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న గ్రేటర్ నగరంలో 80 డివిజన్లు ఏర్పడతాయని, వాటన్నింటిలో బీజేపీ పాగా వేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంచంద్రరావును గెలిపిచండి బీజేపీ తరపున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాంచంద్రరావును గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో 129 ఓట్లతో ఓడిపోయిన రాంచంద్రరావు ఈ దఫా ఎమ్మెల్సీగా గెలిచి పెద్దల సభలో గళం విప్పే విధంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కాగా సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బద్దం సుభాష్‌రెడ్డి, రమేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు భీంరావు, స్వామిగౌడ్, జిల్లా ఇన్ఛార్జీ శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌గౌడ్, బిల్డర్స్ వింగ్ జిల్లా కన్వీనర్ ఆదిరెడ్డి రాజిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి భరతసింహారెడ్డి, జిల్లా నాయకులు నటరాజ్‌గౌడ్, నందనం దివాకర్, బక్క శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అర్బన్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం పలువురు పార్టీ నాయకులు రూ.50 లక్షల వరకు విరాళాలుగా అందజేస్తామని ప్రకటించారు. -
నేడే తేలేది..
నేడే తేలేది.. బరిలో మిగిలేదెవరో.. తప్పుకునేదెవరో! ఊపందుకున్న బుజ్జగింపులు ప్రచారాస్త్రాలతో సమరాంగణంలోకి.. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును సాక్షి, సిటీబ్యూరో: వాడివేడి వ్యూహాలు.. బుజ్జగింపులు..బేరసారాలు.. సిద్ధమైన ప్రచారాస్త్రాలు.. గ్రేటర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరాహోరీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులంతా నేటి నుంచి సమరాంగణంలోకి దూకనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా బరిలో దిగిన వారిని బుజ్జగించే యత్నాలు జోరందుకున్నాయి. రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే ఎన్నికల బ్యాలెట్లో వారి పేరుంటుంది. దీన్ని నివారించేందుకు ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచార సన్నాహాలు తుదిగా బరిలో ఎవరెవరు ఉంటారో నేడు తేలిపోనుంది. ప్రత్యర్థులెవరో దాదాపు తెలిసిపోయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు. హంగు ఆర్భాటాలు, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్ని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రారంభించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల, టీడీపీ, టీఆర్ఎస్ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలకు భారీగా జనాన్ని తరలించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు. అధికారులకు ఈవీఎంల బెడద నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు కావడంతో, చివరకు బరిలో ఎందరు మిగులుతారనే దానిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు వినియోగించే ఈవీఎంలలో మొత్తం 16 బటన్లుండగా, వీటిలో ఒకటి ‘నోటా’కు పోను 15 పార్టీ చిహ్నాల డిస్ప్లేకు వీలుంటుంది. అంతకుమించి రంగంలో మిగిలితే మరో ఈవీఎంను అదనంగా వాడాల్సిందే. శనివారం ఈ విషయంలో స్పష్టత ఏర్పడనుంది. కొందరు దారిలో.. ఇంకొందరు బరిలోనే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్.. ప్రజల మద్దతున్న తాను పోటీలోనే ఉంటానని చెబుతున్నారు. పలు బస్తీలవాసులు ఆయనను కలిసి అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన మనసు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన పోటీలో ఉంటే అది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని భావిస్తున్న చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్‌గౌడ్‌ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది శేరిలింగంపల్లిలో టీడీపీకీ రెబల్ పోటు తప్పేలా లేదు. మొవ్వా సత్యనారాయణ పట్టు వీడేది లేదని చెబుతున్నారు. గడువులోగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే ఎల్బీనగర్ నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీలో ఉంటాననే చెబుతున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్, ఏడుకొండ లు ఆంతర్యం పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు గోషామహల్లో పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతున్న గోవింద్‌రాఠి, నందకిశోర్‌వ్యాస్, రామస్వామిలను బుజ్జగించడంలో బీజేపీ అధిష్ఠానం కొంతమేర సఫలమైనట్లు తెలుస్తోంది ముషీరాబాద్‌లో కాంగ్రెస్ రెబల్స్ సునీతాప్రకాశ్, బీసీ సెల్ చైర్మన్ నగేష్ముదిరాజ్లను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్‌కుమార్ సునీతా ప్రకాశ్ ఇంటికి వెళ్లి సహకరించాలని కోరడంతో ఆమె మెత్తబడ్డట్లు సమాచారం. నగేశ్ ముదిరాజ్‌ను దారిలోకి తెచ్చుకునే పనిలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది