గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
కుత్బుల్లాపూర్: మజ్లిస్‌తో చేతులు కలిపిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ విసృ్తతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎక్సలెన్సీ గార్డెన్‌లో నిర్వహించారు. బీజేపీ అర్బన్ అధ్యక్షుడు మీసాల చంద్రయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నవంబర్ మొదటి వారం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉంటుందని, తరువాత అన్నిస్థాయిల కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
మజ్లిస్‌ను ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి..
గ్రేటర్ హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ పూర్తిగా నాశనం చేసిందని, బీజేపీ శ్రేణులు ‘మజ్లిస్ పార్టీని ఓడించాలి.. హైదరాబాద్‌ను రక్షించాలి’ అన్న నినాదంతో ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ ఉగ్రవాదులకు సేఫ్ జో న్‌గా మారిందని ఆరోపించారు. కేసులు పెట్టకుండా.. అరెస్టులు చేయకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న గ్రేటర్ నగరంలో 80 డివిజన్‌లు ఏర్పడతాయని, వాటన్నింటిలో బీజేపీ పాగా వేయాలని పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంచంద్రరావును గెలిపిచండి
బీజేపీ తరపున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాంచంద్రరావును గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో 129 ఓట్లతో ఓడిపోయిన రాంచంద్రరావు ఈ దఫా ఎమ్మెల్సీగా గెలిచి పెద్దల సభలో గళం విప్పే విధంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కాగా సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బద్దం సుభాష్‌రెడ్డి, రమేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు భీంరావు, స్వామిగౌడ్, జిల్లా ఇన్‌ఛార్జీ శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌గౌడ్, బిల్డర్స్ వింగ్ జిల్లా కన్వీనర్ ఆదిరెడ్డి రాజిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి భరతసింహారెడ్డి, జిల్లా నాయకులు నటరాజ్‌గౌడ్, నందనం దివాకర్, బక్క శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అర్బన్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం పలువురు పార్టీ నాయకులు రూ.50 లక్షల వరకు విరాళాలుగా అందజేస్తామని ప్రకటించారు.