పోలీసులా.. టీఆర్‌ఎస్ కార్యకర్తలా?
అధికార పార్టీకి కొమ్ముకాశారు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్షం నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలతో కలిసి మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.
ఏడాది కాలం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడానికి టీఆర్‌ఎస్సే కారణమన్నారు. 80 శాతం మంది ఓటర్లకు సిబ్బంది పోలింగ్ స్లిప్పులను అందించలేక పోయారన్నారు. పోలింగ్ స్లిప్పులను అందించడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారని, పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. పాలక పార్టీ మెప్పు కోసం పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లాగా పనిచేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, సీఎం కుట్ర వల్లే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందనే యోచన కూడా ఓటర్ల నిరాసక్తతకు కారణమని కిషన్‌రెడ్డి చెప్పారు.
అసద్‌ను అరెస్టు చేయాలి: కాంగ్రెస్ నేతలపై దాడికి దిగిన ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని వెంటనే అరెస్టు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడం ఎంఐఎంకు అలవాటేనన్నారు. ఇప్పటిదాకా ఎంఐఎంను పెంచి పోషించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు దిగడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదన్నారు.