రూ.వేలల్లో నోటీసులెందుకు?
⇒ పన్ను పెంచలేదంటూనే.. రూ.వేలల్లో నోటీసులు పంపుతున్నారు
⇒ సునామీ పన్నులంటూ వేధిస్తున్నారు?: ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పురపాలక సంఘాల్లో ప్రగతి, హైదరాబాద్‌లో పన్ను వసూళ్లకు సం బంధించి మంత్రి కేటీఆర్ చెప్పిన సమాధానాలకు, వాస్తవాలకు తేడా ఉందని బీజేపీ ఆరో పించింది. ఎక్కడా పన్నులు పెంచలేదని చెబుతూనే పేదలను పీడిస్తున్నారని, రూ.వేల మొత్తంలో పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం తీరు ను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. పురపాలక సంఘాలకు సంబంధించిన పద్దుపై మంత్రి కేటీఆర్ మాట్లాడిన తర్వాత సభ్యులు క్లారిఫికేషన్స్‌పై ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో విలీనం కాకముందు ఉన్న శివారు ప్రాంత ప్రజలకు పన్ను బకాయిల పేరుతో నోటీసులు పంపి వేధిస్తున్నారని, సునామీ ట్యాక్స్ పేరుతో భయాందోళనలకు గురి చేస్తు న్నారని బీజేపీ సభ్యుడు ప్రభాకర్ ఆరోపించారు.
ఎల్‌బీనగర్‌లోని పేదలకు జూబ్లీహిల్స్ స్థాయిలో పన్నులు వేయటం దారుణమని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. 72 పురపాలక సంఘాల్లో సిబ్బందికి వేత నాలు పెంచలేదని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య సభ దృష్టికి తెచ్చారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆస్తి పన్ను బకాయిదా రుల పెనాల్టీలను మాఫీ చేస్తే నిజాయితీగా చెల్లించే వారిని డిస్కరేజ్ చేసినట్ట వుతుందన్న ఉద్దేశంతో పెనాల్టీ వసూలు చేయాలని నిర్ణ యించామని పేర్కొన్నారు. పన్ను బకాయిలు పేరుకుపోయి ఉన్నందున సునామీ పన్ను పేరుతో వసూలు చేస్తున్నామని, 15 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఇంటి పన్ను రివిజన్ జరక్క పోవటం వల్ల ఎల్‌బీనగర్.. జూబ్లీహిల్స్ పన్ను ల్లో తేడా లేకుండా పోయిందని చెప్పారు.
మరి నోటీసులు ఎలా వచ్చాయి..
నారాయణపేట పురపాలక సంఘం విషయం లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మంచినీటి కోసం అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. పన్నులు పెంచలేదని కేటీఆర్ అంటున్నారని, మరి పేదల ఇళ్లకు రూ.వేల పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఎలా వచ్చాయని కొన్ని ప్రతులను సభలో ప్రదర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 50 గజాల పట్టా స్థలంలో ఉన్న చిన్న ఇంటికి గతంలో రూ.218 పన్ను ఉండగా.. ఇప్పుడు రూ.2,831 చెల్లించాలంటూ నోటీసు వచ్చిందన్నారు. ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో నిర్లక్ష్యం చూపుతున్నందున నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రజల కోసం పనిచేస్తున్నాం..: కేటీఆర్
కిషన్‌రెడ్డి మెప్పు కోసమో, బీజేపీ కోసమో తాము పనిచేయబోమని, ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిజంగా పని చేయకుంటే గతంలో ఒక్క కార్పొరేటర్ కూడా లేని జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ నుంచి 100 మంది ఎలా గెలిచారని ప్రశ్నించారు.