అసెంబ్లీలో దూకుడుగా వెళ్లాలి
బీజేఎల్పీ నిర్ణయం
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరించాలని బీజేఎల్పీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టాలని తీర్మానించింది. రెండు పడకల గదుల ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, రైతాంగ సమస్యలు, దళితులకు 3 ఎకరాల పంపిణీ, మిషన్ భగీరథ వంటి అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించింది.
బుధవారం బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కె.లక్ష్మణ్,చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొనగా మరో ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకాలేదు. రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని సభలో ప్రస్తావించాలనే అభిప్రాయానికి వచ్చారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కిషన్‌రెడ్డి
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొస్తే తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సీపీఎంను రాజకీయంగానే ఎదుర్కొంటామని, ఆ పార్టీ త్వరలో నిర్వహించే సభను అడ్డుకోమని కె.లక్ష్మణ్ తెలిపారు.