టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి
బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా పార్టీని తీర్చిదిద్దుతామన్నారు.
యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ విజయంతోనైనా కుహనా లౌకికవాదులు కులం, మత, భాష ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే చర్యలను విడనాడాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. వచ్చే ఎన్నికలకల్లా రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతున్నదని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్‌రావు ఆరోపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎస్,.కుమార్, శేరి నరసింగరావు, సుధాకరశర్మ తదితరులు పాల్గొన్నారు.