యువహో...
♦ అభ్యర్థుల ఎంపికలో యువతకు ప్రాధాన్యం
♦ అన్ని పార్టీలదీ అదే బాట... విద్యార్హతల్లో మాత్రం నిరాశ!
అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు ‘యువ’ మంత్రం పఠించాయి. ‘గ్రేటర్’ ఇక యువతదే కాబోతోంది. ‘మహా పోరు’ బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు యుక్త వయస్కులే కావడం విశేషం. గతంలో అవలంబించిన మూస పద్ధతులను, విధానాలను పక్కనబెట్టి సింహభాగం టిక్కెట్లు యువతకు కేటాయించడం ద్వారా అన్ని పార్టీలూ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. గ్రేటర్ పరిధిలో యువ ఓటర్లే కాదు..యువ కార్పొరేటర్లదే హవా కాబోతోంది. ఇక విద్యార్హతల విషయానికొస్తే.. ఈసారి కొంత నిరాశే కలుగుతుంది. ఎక్కువ మంది ఎస్సెస్సీ విద్యార్హత కలిగిన వారే ఉండడం గమనార్హం.
- సాక్షి, సిటీబ్యూరో
కాంగ్రెస్ పార్టీలో..
కాంగ్రెస్‌పార్టీ 149 డివిజన్లకు అభ్యర్థులను నిలిపింది. ఇందులో 20-30 మధ్య వయసున్నవారు 22 మంది, 30-40 మధ్య వయస్సున్నవారు 56 మంది, 40-50 మధ్యనున్నవారు 60 మంది, 50-60 ఏళ్లమధ్యనున్నవారు 9 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరున్నారు.
విద్యార్హతలిలా..
ఎస్సెస్సీలోపు ఆరుగురు, పదోతరగతి చదివినవారు 64, ఇంటర్మీడియెట్ పూర్తిచేసినవారు 21, డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు 46, పీజీ చదివినవారు 12 మంది ఉన్నారు.
తెలుగుదేశం పార్టీలో..
గ్రేటర్ పరిధిలో టీడీపీ 92 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలిపింది. వయసులవారీగా పరిశీలిస్తే 20-30 ఏళ్ల మధ్యలో 16 మంది, 30-40 ఏళ్ల మధ్యలో 38 మంది, 40-50 ఏళ్ల మధ్యలో 25 మంది, 50-60 ఏళ్ల మధ్యలో 13 మంది ఉన్నారు.
విద్యార్హతలు...
ఎస్సెస్సీ చదివినవారు 36 మంది, ఇంటర్మీడియెట్ 18 మంది, డిగ్రీ- 33, పీజీ పూర్తిచేసినవారు ఐదుగురు ఉన్నారు.
టీఆర్‌ఎస్‌లో ..
అధికార టీఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇందులో 20-30 ఏళ్ల మధ్యవయస్సున్నవారు 34 మంది, 30-40 ఏళ్ల మధ్య గ్రూపువారు 56 మంది, 40-50 మధ్య వయోగ్రూపువారు 48 మంది, 50-60 మధ్యనున్నవారు 8 మంది, అరవై ఏళ్లు పైబడిన వయోవృద్ధులు నలుగురున్నారు.
విద్యార్హతలిలా..
150 మంది అభ్యర్థులలో పదోతరగతి లోపు చదివినవారు ఐదుగురు, పదోతరగతి చదివినవారు 52 మంది, ఇంటర్ పూర్తిచేసినవారు 30 మంది ఉన్నారు. ఇక డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు 40 మంది, పీజీ పూర్తయినవారు 20 మంది ఉన్నారు. న్యాయశాస్త్రం అభ్యసించిన వారు ముగ్గురున్నారు.
ఎంఐఎం పార్టీలో..
గ్రేటర్ పరిధిలో ఎంఐఎం 60 డివిజన్లలో అభ్యర్థులను నిలిపింది. వీరిలో 20-30 ఏళ్ల మధ్యనున్నవారు 9 మంది, 30-40 మధ్య వయస్సున్నవారు 18 మంది, 40-50 ఏళ్ల మధ్యనున్నవారు 22 మంది, 50-60 ఏళ్ల మధ్య వయసున్నవారు 9 మంది, 60 ఏళ్లు పైబడినవారు ఇద్దరు ఉన్నారు.
విద్యార్హతలు..
పదో తరగతి లోపు 8 మంది, పదోతరగతి చదివినవారు 10 మంది, ఇంటర్ చదివినవారు 22 మంది, డిగ్రీ పూర్తిచేసినవారు 11 మంది, పీజీ పూర్తిచేసినవారు 9 మంది ఉన్నారు.
బీజేపీలో..
గ్రేటర్ పరిధిలో బీజేపీ 65 సీట్లలో పోటీ చేస్తుంది. ఇందులో 20-30 ఏళ్ల మధ్యవయసున్నవారు 21 మంది, 30-40 ఏళ్ల మధ్యన 30, 40-50 ఏళ్ల మధ్యన 10, 50-60 మధ్య వయసున్నవారు నలుగురున్నారు.
విద్యార్హతలు..
నిరక్ష్యరాస్యులు ఒకరు, ఎస్సెస్సీ 16 మంది, ఇంటర్ 17 మంది, డిగ్రీ 24 మంది, పీజీ చేసినవారు 8 మంది ఉన్నారు.
విద్యార్హతే ప్రామాణికం కాదు
అన్ని పార్టీలు గెలుపుగుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. డబ్బు, కులం వంటివి ప్రముఖ పాత్ర వహించాయి. అయితే విద్యార్హత ఉన్నవారు నీతివంతులని చెప్పలేం. చదువుకోనంత మాత్రాన వాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. ప్రజల సమస్యల పట్ల అవగాహన, నిబద్ధత ఉంటే చాలు. కార్పొరేటర్లకు ప్రజాసేవే పరమావధి కావాలి.
- ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు
యువతకు టికెట్లివ్వడం మంచి పరిణామం
గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈసారి యువతకు టికెట్లివ్వడం మంచి పరిణామం. చొరవ, కార్యదక్షత వంటి విషయాల్లో యువకులే ముందుంటారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడం యువత ద్వారానే సాధ్యం. ఈవిషయాన్ని గ్రహించే అన్ని రాజకీయ పార్టీలు యువతీ యువకులను బరిలో నిలిపాయి.
- కోడం కుమార్, తెలంగాణ స్కాలర్స్ అసోసియేషన్
గ్రేటర్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారే అధికంగా ఉన్నారు. మహానగర పరిపాలన, సమస్యల పరిష్కారం.. ప్రజలకు తక్షణం మెరుగైన సేవలందించే గ్రేటర్ పాలకమండలిలో యువరక్తాన్ని నింపడం ద్వారా విశ్వనగరం దిశగా అడుగులేసేందుకు ఆయా పార్టీలు సన్నద్ధమయ్యాయి.ఇక మహిళా సాధికారత విషయానికి వస్తే మహిళలకు సింహభాగం సీట్లు కేటాయించడం ద్వారా మహిళాశక్తిని నిరూపించుకునే అవకాశం కల్పించారు.
విద్యార్హతల విషయానికి వస్తే కొంత నిరాశే ఎదురవుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల విద్యార్హతలు, వయసుల వివరాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న మహానగరంలో పలు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో వారి విద్యార్హతలకంటే గెలుపుగుర్రాలనే అన్వేషించాయంటే అతిశయోక్తి కాదు. పలు రాజకీయ పార్టీల్లో పలువురు అభ్యర్థుల విద్యార్హతలు పదోతరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే. అంగబలం, అర్థబలం, సామాజిక సమీకరణలు వెరసి అభ్యర్థుల చదువును పక్కనబెట్టేలా చేశాయని పలు పార్టీలు సెలవిస్తున్నాయి.
హైటెక్ నగరిలో రాబోయే కార్పొరేటర్లు టె క్ గురూల అవతారం ఎత్తాలని భావిస్తున్న వారికి ఈ విషయంలో నిరాశపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే అభ్యర్థి విద్యార్హతలకంటే స్థానికంగా ఉండి..నేరచరిత లేనివారు, సేవాభావం ఉన్నవారిని ఎన్నుకుంటే జనం సమస్యలు పరిష్కారం అవుతాయన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల విద్యార్హతలు, వయోగ్రూపుల వివరాలు పైవిధంగా ఉన్నాయి...