- తెలంగాణకు 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులిచ్చాం: అమిత్‌షా
- ఏపీలో ఇప్పటికయితే టీడీపీతో దోస్తీ ఉందని వ్యాఖ్య
నల్లగొండ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తెలంగాణకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర నిధులిచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఇన్ని నిధులు గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.9,550 కోట్లు రాగా.. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.96,706 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గతంలో కంటే స్థానిక సంస్థలకు 30 రెట్లు ఎక్కువగా.. అంటే రూ.8,764 కోట్లు వచ్చాయని తెలిపారు. వీటితోపాటు ఎయిమ్స్ పలు యూనివర్సి టీలు, మౌలిక వసతులకు రూ.40,800 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
రహదారుల నిర్మాణానికి గతంలో కనీవినీ ఎరుగని విధంగా నిధులు మంజూరు చేశామని, 2016–17లో పేదల కోసం రాష్ట్రంలో 90 వేల ఇళ్లను కేటాయించామని తెలిపారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్ మా రాజకీయ ప్రత్యర్థే.. 2019లో సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో మోదీ ప్రభుత్వంపై ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు, ఆదరణ ద్వారా అధికారంలోకి రాగలమని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. కేంద్రం తెచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమైందని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లను పెంచడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
మూడేళ్లు అవినీతి రహిత పాలన
‘‘పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలో విధానాలు పక్షవాతం (పాలసీ పెరాలసిస్) బారిన పడ్డాయి. అందుకు భిన్నంగా మూడేళ్లలో అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడిపించి చూపించాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థికశక్తిగా మారిందని, జీడీపీ పెరుగుదల, ధరల నియంత్రణతో పాటు ఎఫ్‌డీఐలు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 60 శాతం భూభాగంలో బీజేపీ విస్తరించిందని, సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు.
ఎన్నికలకు ఒంటరిగానే..
2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో ఇప్పటికయితే రాజకీయ పొత్తు ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించగా.. దీనిపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని అంత సులభంగా ఎలా బయటపెడతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
లక్ష కోట్లపైనే ఇచ్చాం
Published Wed, May 24 2017 2:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement