అంత బరితెగింపా?
రాష్ట్రంలో ఫిరాయింపులపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విస్మయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వివిధ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 48 మంది వరకు టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో రాజకీయపార్టీలు ప్రజాస్వామ్యా న్ని ఎటు తీసుకువెళుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర నేతలను ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ రెండేళ్లపాలనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, అమిత్‌షాకు సమగ్ర నివేదికతోపాటు, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఢిల్లీలో బీజేపీ ముఖ్యులతో ఇటీవల జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ, నిర్ణయాలు జరిగాయి. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నెలకోసారి రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. కాగా, పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యల వల్ల జరిగే దుష్పరిణామాలను క్షేత్రస్థాయిలో చర్చకు పెట్టాలని పార్టీ శ్రేణులకు అమిత్ షా సూచించారు. ‘టీడీపీ ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవిని కట్టబెట్టారా?ఇలాంటి వార్తను నేనెక్కడా వినలేదు. ఇంత జరిగితే పార్టీలేం చేస్తున్నా యి? ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరేం చేస్తున్నారు? అవగాహన పెంచడానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 17 సంగతేమిటి?
హైదరాబాద్ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలను అమిత్ షా ఆదేశించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 17న తెలంగాణకు అసలైన స్వాతంత్య్రం వచ్చిందని, ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దౌర్భాగ్య జాతి తెలంగాణ ఒక్కటే అంటూ నాడు కేసీఆర్ చేసిన ప్రసం గం సీడీని లక్ష్మణ్... అమిత్‌షాకు చూపిం చారు. దీనిపైనా అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ చేసిన డిమాండును ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనతో అమలుచేయించడంలో ప్రతిపక్షపార్టీలు ఎందుకు విఫలం అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి నుంచి దీనిపై పోరాటాన్ని మొదలుపెట్టాలని సూచించారు. దీనికోసం జరిగే ముగింపు సభకు హాజరవుతానని అమిత్ షా రాష్ట్ర నేతలకు చెప్పారు. అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తారని ఈ సందర్భంగా అమిత్ షా ప్రకటించారు. ఇప్పటిదాకా రాష్ట్రప్రభుత్వం ప్రధాని మోదీని తెలంగాణకు ఆహ్వానించలేదని, ఆ లోపుగా ప్రభుత్వం ఆహ్వానించినా, లేకున్నా పార్టీపరంగా ప్రధాని మోదీ హాజరు అవుతారని అమిత్ షా వెల్లడించారు.
పోరాటాలతోనే బలోపేతం కావాలి..
ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాటాలు చేయ డం ద్వారానే పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని అమిత్‌షా సూచిం చారు. లక్ష్మణ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణలో పోరాటాలు చేయడానికి చాలా అంశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారని తెలిసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు భూమి, సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెంపు వంటివాటితో పాటు వ్యవసాయం, ఉపాధి, విద్యారంగాల్లో టీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని, అందుకు జాతీయ నాయకత్వం సహకారం అందిస్తుందని చెప్పినట్టు పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు.