టీడీపీతో పొత్తుపై పునరాలోచిద్దాం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే అంశంపై వచ్చే ఎన్నికల సమయంలో పునరాలోచిద్దామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుని, పొత్తుపై ఒక నిర్ణయం తీసుకుందామన్నారు.ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన అమిత్ షాను బీజేపీ రాష్ట్ర నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఉదయం విజయవాడకు చేరుకొని, ఎంపీ గోకరాజు గంగరాజు అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీ మంత్రులు కృష్ణంరాజు, పురందేశ్వరి, కావూరి సాంబశిరావు, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు కలిశారు.
బీజేపీ పట్ల మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న తీరు, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి అక్రమాల గురించి వివరించారు. పార్టీ నేతలను చెప్పిన విషయాలను అమిత్‌షా సావధానంగా విన్నారు. పొత్తు తదితర అంశాలపై వచ్చే ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుందామని ఆయన వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాల సమాచారం.