అమిత్ షా ఏం నిర్ణయం తీసుకుంటారో?
గుంటూరు : తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంపై బీజేపీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అసంతృప్తి వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని వెంకయ్య నాయుడు చెప్పారని, అయితే ఎన్నికల నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని ఆయన గురువారమిక్కడ అన్నారు.
టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, ఇదే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు కన్నా తెలిపారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరుపుతామన్నారని అమిత్ షా తెలిపారన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ఏపీ బీజేపీ నేతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా కన్నా లక్ష్మీ నారాయణ కూడా అదే అంశాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.