స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి: సీఎం
ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచమంతా తొలిసారి భారత్‌వైపు చూస్తోందని, అందుకు ప్రధాని మోదీనే కారణమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో పాల్గొనడానికి సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే స్థిరమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించామని తెలిపారు.
కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాలన తీరు, ప్రజల తీర్పులపై చర్చించారు. గత మూడేళ్లుగా ఎన్డీఏకు ప్రజల మద్దతు పెరుగుతోందని భాగస్వామ్య పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్డీయేకు నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందించాయి. ఎన్డీయే అనుపరిస్తున్న విధానాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై భాగస్వామ్య పక్షాలు చర్చించాయి.
అమిత్‌షాతో చంద్రబాబు భేటీ
ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి ముందుగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఆ తర్వాత వెంకయ్యతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరితో పాటు తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో గవర్నర్ పదవుల నియామకం జరిగే సమయంలో మోత్కుపల్లికి అవకాశం కల్పించాలని చంద్రబాబు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి.