ఎగిరిన ప్రలోభాల జెండా!
♦ చీరల పంపిణీతో వివాదాస్పదమైన టీడీపీ అభ్యర్థి
♦ నోట్లు పంచుతూ చిక్కిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు
♦ గాంధీనగర్‌లో రూ.37 లక్షల బ్లాక్‌మనీ స్వాధీనం
బన్సీలాల్‌పేట, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్: గ్రేటర్ ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. చీరలు పంపిణీ చేస్తూ టీడీపీ అభ్యర్థి వివాదాస్పదం కాగా, నగదు పంచుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు చిక్కారు. వీటితో పాటు గాంధీనగర్‌లో స్వాధీనం చేసుకున్న రూ.37 లక్షలు హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలు శుక్రవారం నగరంలో చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ డివిజన్ టీడీపీ అభ్యర్థి బొడ్డు కామేశ్వరి రామకృష్ణనగర్, అంబేద్కర్‌నగర్, శ్రీరాంనగర్‌లలో ప్రచారం చేశారు. ఈ క్రమంలో చీరలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి పారిజాత భర్త, మాజీ కార్పొరేటర్ గౌరీష్ అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు.
అక్కడున్న కొందరు మహిళలు చీరలు తీసుకెళ్తుండటాన్ని గమనించిన ఆయన వారిని ప్రశ్నించగా టీడీపీ నాయకులే ఇచ్చారని సమాధానం వచ్చింది. కాగా కామేశ్వరికి మద్దతుగా ఎమ్మెల్యే వివేకానంద్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులను టీఆర్‌ఎస్ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతోనే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని గౌరీష్ విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, పలు టీవీల్లో వచ్చిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టాలని కోరతామన్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
డబ్బులు పంచుతూ దొరికిన గులాబీ దళం
సీఎం కేసీఆర్ నివాసానికి కూత వేటు దూరంలోని నందినగర్ బస్తీలో ప్రార్థనా స్థలం ఆవరణలో డబ్బులు పంచుతూ కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుబడ్డారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గులాబీ దళం నోట్లు పంచుతున్నట్లు సమాచారం అందడంతో కాంగ్రెస్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ అభ్యర్ధి బి.భారతి, ఆమె అనుచరులు అక్కడికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయాలంటూ కరపత్రాలు పంచుతూ డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారమందించారు. క్షణాల్లోనే పోలీసులు, ఎన్నికల పరిశీలకులు ఘటనా స్థలానికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గ్రూపునకు ఎంత మొత్తం ఇచ్చారనేది రాసి ఉన్న స్లిప్పులనూ స్వాధీనం చేసుకొని, టీఆర్‌ఎస్ కరపత్రాలను సీజ్ చేశారు. 10 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు.
హవాలా సొమ్ము తీసుకెళ్తున్న ఇద్దరి అరెస్టు
గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌మనీ తీసుకెళ్తున్న ఇద్దరిని గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణ్‌జ్యోతి కాలనీ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు చిక్కారని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. భరత్‌కుమార్ పటేల్, అమిత్‌కుమార్‌లు కలిసి ద్విచక్ర వాహనంపై అక్రమంగా నగదు తరలిస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన వీరు గత కొంత కాలంగా అరుణ్‌జ్యోతి కాలనీలో మహావీర్ ట్రేడర్స్ పేరిట బ్లాక్‌మనీ లావాదేవీలు చేస్తున్నారని డీసీపీ వెల్లడించారు. రూ.లక్షకు రూ.2 వేల నుంచి రూ.3 వేల కమీషన్ తీసుకుంటూ ఆరేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారన్నారు. సొమ్మును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు.