అది నేనే.. ఇది నేనే..
‘సేమ్ కార్డ్, సేమ్ ప్లేస్ బట్ నేమ్స్ చేంజ్’ అని అప్పట్లో ఓ సినిమాలో కోటశ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ సూపర్‌హిట్. డైలాగ్ మాదిరిగానే సేమ్ డివిజన్, సేమ్ కేండిడేట్స్ బట్ సింబల్స్ చేంజ్ అన్నట్టుగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌కు జరుగుతున్న ఎన్నికల్లో పలు చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడానికే టీఆర్‌ఎస్ వెనుకంజ వేసింది. పోటీచేయడానికి బలం లేక, పోటీచేసి చావు దెబ్బతినడం ఎందుకని గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీచేయలేదని పార్టీ నేతలు చెప్పుకున్నారు. 2009 తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌కు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్లో ఒక వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు గులాబీ కండువాలను కప్పుకుని కారెక్కారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా డివిజన్లలో పాతకాపులు, వారి కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్ టికెట్లతో ప్రజల ముందుకొస్తున్నారు. అదే డివిజను, అదే ముఖం అయినా గుర్తు మాత్రమే వేరు అని వారి అనుచరులు కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు.