నేడే విడుదల
ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
పోటాపోటీగా ఉన్న చోట్ల మరింత జాప్యం
కాంగ్రెస్ జాబితాలో బండ కార్తీక... టీఆర్‌ఎస్ జాబితాలో బొంతు
బస్తీల్లో ఎన్నికల ఊరేగింపులు. ప్రచారం కొత్తపుంతలు. హిమాయత్ నగర్‌లో ఓ పార్టీ అభ్యర్థి గంగిరెద్దుల వారి డప్పు వాయిస్తూ... ఓటర్లను
ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సిటీబ్యూరో: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శుక్రవారం విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి సుమారు 51 డివిజన్లకు, కాంగ్రెస్ 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు గురువారం కసరత్తు పూర్తి చేశాయి. ఎంఐఎం అదే బాటలో నడుస్తోంది. టీడీపీ-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులను ప్రకటించే ందుకు యత్నిస్తోంది. తొలి జాబితాలో నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న నాయకుల కుటుంబ సభ్యులతో పాటు మేయర్ అభ్యర్థులుగా రంగంలోకి దింపే వారి పేర్లను ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రాంమోహన్‌ను చర్లపల్లి డివిజన్‌కు... ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ లేదా వెంకటేశ్వర నగర్ డివిజన్లలో ఒకదానికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సుమారు 40 మందితో ఇచ్చే తొలి జాబితాలో ఏకాభిప్రాయం వచ్చిన కుత్బుల్లాపూర్‌లోని ఐదు, ఎల్బీనగర్‌లో ఎనిమిది డివిజన్లకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థులను గుర్తించిన డివిజన్లలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ జాబితాలో తార్నాక నుంచి మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బౌద్ధనగర్ నుంచి ఆదం ఉమాదేవి పోటీ చేయనున్నారు. బీజేపీలో భాగ్‌అంబర్‌పేట నుంచి బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి సతీమణి పేరు తొలి జాబితాలో ప్రకటించనున్నారు.
ఉత్కంఠ
బల్దియా ఎన్నికల్లో పోటీ చేయనున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించనున్నారన్న సమాచారంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో కె.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నగరంలో ముఖ్యనేతలు, మంత్రులు, ఇన్‌చార్జులతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపికపై అధినేతకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. టిక్కెట్లు ఆశించి ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరుతున్న ఆశావహుల మధ్య సిగపట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కీలక డివిజన్లకు ముగ్గురు నుంచి ఐదుగురేసి టిక్కెట్లు ఆశిస్తుండడంతోతీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల ఇతర పార్టీల నుంచి జోరుగా టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నాయకుల్లో అసమ్మతి రాజుకుంటోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఆశావ హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో గెలిచే అవకాశాలున్న అభ్యర్థులపై డివిజన్ స్థాయిలో ఐదు సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అం గబలం, అర్థబలం ఉండి.. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన గెలుపు గుర్రాలకే టిక్కెట్లిస్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇటీవల ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయక గణం, మాజీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరికికార్పొరేటర్ టిక్కెట్లు ఎరజూపి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పిన విషయం విదితమే. తాజాగా చేరుతున్న వారిని తమతో కలుపుకుని వెళ్లేందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులను బలవంతంగా అభ్యర్థులుగా తమపై రుద్దుతున్నారని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇన్‌చార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా స్పష్టం చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకున్న ఇన్‌చార్జులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో పుకార్లు
టిక్కెట్లు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా కొందరికి టీఆర్‌ఎస్ టిక్కెట్లు ఖరారైనట్లు సోషల్ మీడియా గ్రూపుల్లో సంక్షిప్త సందేశాలు అందుతుండడంతో గందరగోళం మొదలైంది. పార్టీ అధిష్టానం మాత్రం తుది జాబితా ప్రకటించలేదని... సోషల్ మీడియాలో ప్రచారం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేస్తోంది.