గ్రేటర్‌లో కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం
♦ సహజంగా ఉండే సమన్వయలోపాన్ని అధిగమించిన వైనం
♦ ఎన్నికల్లో పార్టీ ప్రచార సామగ్రిని అందించిన టీపీసీసీ
♦ సంప్రదాయానికి భిన్నంగా మేయర్ అభ్యర్థి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని ఆలపించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను గ్రేటర్ ఎన్నికల్లో ఎదుర్కొనడానికి టీపీసీసీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కతో పాటు పార్టీ ముఖ్యులంతా గ్రేటర్ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గాల వారీగా డివిజన్లలో పార్టీ ముఖ్యులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు డివిజన్లలోనే ఉంటూ పార్టీ అభ్యర్థుల ప్రచారవ్యూహాన్ని, సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించారు.
కాంగ్రెస్‌లో సహజంగా ఉండే సమన్వయలోపాన్ని, పార్టీ అంతర్గత సమస్యలను ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధిగమించింది. టికెట్ల కేటాయింపులో స్వల్ప సమస్యలు తప్ప చెప్పుకోదగిన ఇబ్బందులు తలెత్తకపోవడం ఆ పార్టీ నేతల్లోనే ఆశ్చరాన్ని కలిగించింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ ప్రచార సామగ్రిని అందించడానికే పరిమితమైనట్లు తెలుస్తోంది.
పార్టీ పరంగా అభ్యర్థులకు ఆర్థిక వనరులను సమీకరించడంలో టీపీసీసీ విఫలమైనట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేదాకా మేయర్ అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ కాంగ్రెస్‌కు గతంలో ఏనాడూ లేదు. అయితే ప్రత్యేక పరిస్థితుల వల్ల మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సి వచ్చిందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన మాజీమంత్రి ఎం.ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి ప్రధాన ఉద్దేశాలతో మేయర్ అభ్యర్థిని ప్రకటించినట్లు టీపీసీసీ ముఖ్యులు చెప్పారు.
జానారెడ్డి తీరుపై అసంతృప్తి
ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరిన తర్వాత సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌కు ఇబ్బందిని తెచ్చిపెట్టింది. జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న రూ.5 భోజన పథకాన్ని ప్రభుత్వం చాలాబాగా నిర్వహిస్తోందని చెప్పడం ద్వారా టీఆర్‌ఎస్‌కు జానారెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారని సొంత పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ భోజన పథకాన్ని పరిశీలించాలనుకుంటే ఇంత బహిరంగంగా, అది కూడా మీడియా సాక్షిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘గ్రేటర్ హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం బాగుందని ఎలా కితాబిస్తారు? ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతింటుందనే విషయం జానారెడ్డికి గమనం లేదా?’ అని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.