నిఘా కళ్లు..!
ప్రశాంత ఎన్నికలకు పోలీస్ వ్యూహం
సాంకేతికంగా ‘సున్నిత’ విశ్లేషణ
కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ
గ్రేటర్ ఎన్నికల వేళ..నగరంపై నిఘా పెరిగింది. శాంతిభద్రతల పరిరక్షణకు...ప్రశాంత పోలింగ్‌కు పోలీసు విభాగం సరికొత్త పంథాలో సిద్ధమవుతోంది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్‌బూత్‌ల వారీగా గుర్తిస్తోంది. పోలింగ్ రోజున 20 వేల మందితో బందోబస్తుకు వ్యూహరచన చేస్తోంది. గతంలో సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించేలా..ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
-సాక్షి, సిటీబ్యూరో
ఎన్నికలు వచ్చాయంటే చాలు...నగరంలోని సమస్యాత్మక, అతి సున్నిత, సున్నిత పోలింగ్ బూత్‌ల ఎంపిక తప్పనిసరి. ఇప్పటి వరకు మూసధోరణిలో సాగిన ఈ విశ్లేషణకు నగర పోలీసులు కొత్త పంథా ప్రారంభించారు. పోలింగ్ రోజున 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్న అధికారులు.. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్‌సీసీ, స్కౌట్స్ తదితర బలగాల సేవలూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. సిటీలో అందుబాటులో ఉన్న పోలీసు, కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక నిఘా కోసం వాడాలని నిర్ణయించారు. నేర చరిత్ర ఉన్న వారిని, అసాంఘిక శక్తులను బైండోవర్ చేస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ...
నగరంలో గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ తీసువాల్సిన చర్యల్ని నిర్ణయిస్తున్నారు. ఈసీ నుంచి అందిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్న ఫ్లయింగ్ స్వ్కాడ్స్, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కౌంటిగ్ కేంద్రం వద్ద ఫెన్సింగ్, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మూడంచెల భద్రత ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఎలక్షన్ సెల్ ఇన్‌చార్జ్‌గా ఉన్న అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ వై.నాగిరెడ్డి నిత్యం సమీక్షిస్తూ అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు.
రొటీన్‌కు భిన్నంగా ఎంపిక
నగరంలోని 1400 ప్రాంతాల్లో 4143 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో పోలింగ్ స్టేషన్ నైజం తెలుసుకోవడం అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఆ ప్రాంతంలో ఎంత మంది? ఏ స్థాయి? అధికారుల్ని ఏర్పాటు చేయాలన్నది స్పష్టమవుతుంది. దీనికోసం సాధారణంగా పోలీసు విభాగం గతంలో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పాటు భిన్న వర్గాలకు చెందిన వాటిని పరిగణలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆ పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకమా? అతి సున్నితమా? సున్నితమా? అన్నది నిర్థారిస్తుంటారు. ఈ జాబితాను బట్టే అక్కడి విధులకు సిబ్బందిని కేటాయించడం పరిపాటి.
ఈసారి పోలింగ్ స్టేషన్ నైజాన్ని తెలుసుకోవడానికి నగర పోలీసులు సాంకేతికంగా వ్యవహరిస్తున్నారు. ఆ వార్డులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలతో పాటు ప్రభావితం చేసే అంశాలనూ పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా అధ్యయనం చేస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కొత్వాల్ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
20 వేల మందితో బందోబస్తు
అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి పోలీసు విభాగం 20 వేల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కమిషనరేట్‌లో ఉన్న 15 వేల మందికి అదనంగా జిల్లాలు, ఇతర విభాగాల నుంచి ఐదు వేల మందిని తీసుకువస్తున్నారు. ప్రచార ఘట్టాన్ని సైతం శాంతియుతంగా పూర్తి చేయడానికి ప్రణాళికల్ని ఎలక్షన్ సెల్ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలను క్రమబద్ధీకరించడం కోసం ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, మాజీ సైనికోద్యోగుల సేవలు వినియోగించుకోనున్నారు.