Special surveillance
-
గంజాయిపై గట్టి నిఘా
గంజాయి సాగు, రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టడంతో మన్యంలో సాగుదారులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 20 రోజుల్లో ఏజెన్సీలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లు పోలీసుల కదలికలను పసిగట్టి వారి కళ్లుగప్పి గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో ఈ ఏడాది గంజాయి సాగు, రవాణా భారీగా పెరిగింది. పోలీసులు కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికేదాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను, యువకులను వ్యాపారులు, ఏజెంట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు మభ్యపెట్టి, డబ్బు ఎరచూపి గంజాయి సాగు, రవాణా చేయటానికి దింపుతున్నారు. గతంలో మన్యంలో జి.కె.వీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో 20 నుండి 30 గ్రామాలకు మాత్రమే పరిమితమైన గంజాయి సాగు ఈ ఏడాది ప్రతీ మండలంలోను 20 నుండి 50 గ్రామాలకు పాకింది. గంజాయి స్మగ్లర్లు పెట్టుబడులు అందించి ప్రోత్సహించటంతో మారుమూల గ్రామాల్లో కొండపోడు, పంట భూముల్లో గంజాయి సాగు విస్తృతం చేశారు. ఈ ప్రాంతంలో శీలవతి, పిక్క వంటి విలువైన గంజాయి రకాలు పండిస్తున్నారు. గంజాయి రవాణాకు ఏజెంట్లే కీలకం గిరిజన ప్రాంతాల్లో పండించే గంజాయిని కొనుగోలు చేసి వాహనాలు, మోతబరువుతో హైదరాబాద్, విశాఖపట్నం, వంటి మైదాన ప్రాంతాలకు తరలించటానికి స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు కీలకంగా మారారు. వీరు గంజాయి సాగుదార్ల నుండి సులువుగా కొనుగోలు చేసి రహస్య ప్రాంతాలకు తరలించి 2కిలోలు బరువు ఉండేలా కూలీలతో ప్యాక్ చేయిస్తారు. పోలీస్, ఎక్సైజ్ పోలీస్‌ల కదలికలను పసిగట్టి జీపులు, కార్లు, వ్యాన్ల, లారీ, అటో వంటి వాహనాల్లో స్మగ్లర్లు చెప్పిన చోటకు తరలిస్తుంటారు. గంజాయి సాగుదార్ల కంటే ఏజెంట్లు, దళారీ వ్యాపారులకే అధిక మొత్తంలో నగదు ముడుతుంది. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో స్మగ్లర్లు ఏర్పాటు చేసుకొన్న ఏజెంట్లు స్థిరాస్తులుతో పాటు రూ.లక్షల్లో సొమ్ము కూడపెడుతున్నారు. వాహనాలపై ప్రెస్, పోలీస్, ప్రభుత్వవాహనం, ప్రొహిబిషన్, ఎక్సైజ్ వంటి పేర్లతో పోలీసులు అభ్యంతరం చెప్పని వాహనాల్లో ముందు, వెనుక పెలైట్ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేసుకొని రూ.లక్షల విలువ చేసే గంజాయి తరలిస్తుంటారు. మండలంలో అనేక గ్రామాల్లో రవాణాకు సిద్ధం చేసిన గంజాయి నిల్వలు ఉన్నట్టు తెలిసింది. మండలాల్లో గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు ఏజెంట్లను గుర్తిస్తున్నామని పోలీస్, ఎక్సైజ్ పోలీస్‌లు అధికారులు చెప్పడం తప్ప ఇప్పటివరకు పెద్దగా చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్త్తోంది. గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు, ఏజెంట్లు ఎవరన్నది బహిరంగ రహస్యమే అయినా వారిని విచారించడం, వారి సంపాదన, కదలికలపై దృష్టిపెట్టడం, కూడబెట్టిన ఆస్తులు జప్తు చేయటం, కేసులు నమోదు వంటి చర్యలు లేకపోవడం గంజాయి వ్యాపారులకు వరంగా మారింది, చిన్న వ్యాపారాలు.. పెద్ద ఆస్తులు గ్రామాలు, మండల కేంద్రాల్లో పైకి చిన్న వ్యాపారాలు నడుపుకుంటూ పెద్దపెద్ద ఆస్తులు సంపాదించారంటే దీని వెనుక రహస్యమేమిటో అర్థం చేసుకొవచ్చు. వీరికి మైదాన ప్రాంతాల్లో రూ. కోట్ల ఆస్తులున్నాయంటే అది గంజాయి సొమ్మేనని ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు. అమాయకుల బలి! గంజాయిని వాహనాలు, మోత బరువుతో మైదాన ప్రాంతాలకు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే అసలు స్మగ్లర్లు, ఏజెంట్లు తప్పించుకొని అమాయక గిరిజనులు బలైపోతున్నారు. గంజాయి మూటలు (ఒక్కో మూట 25 కిలోలు) వ్యాపారులు చెప్పిన చోటికి చేర్చటానికి కూలీలకు రూ. మూడు నుంచి నాలుగు వేల వరకు ముట్టచెబుతారని తెలిసింది. గంజాయి దాడుల్లో ఎక్కువ మంది అమాయక గిరిజనులే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. జి.మాడుగుల మండలంలో పలు ప్రాంతాల్లో 20 రోజుల్లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ దాడుల్లో భారీ ఎత్తున రవాణాకు సిద్ధం చేసిన సుమారు మూడ వేల కిలోల గంజాయి పట్టుబడగా 14 మందిని అరెస్టు చేశారు. ఏదేమైనా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటీవల దాడులు పెరిగాయనే చెప్పొచ్చు. దీంతో స్మగ్లర్లలో కూడా వణుకు ప్రారంభమైంది. కొందరు ఆచితూచి అతి జాగ్రత్తగా గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు కొత్తకొత్త ఎత్తుగడలతో పోలీసుల కళ్లుగప్పి గంజాయిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారని తెలిసింది. -
నిఘా కళ్లు..!
ప్రశాంత ఎన్నికలకు పోలీస్ వ్యూహం సాంకేతికంగా ‘సున్నిత’ విశ్లేషణ కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ గ్రేటర్ ఎన్నికల వేళ..నగరంపై నిఘా పెరిగింది. శాంతిభద్రతల పరిరక్షణకు...ప్రశాంత పోలింగ్‌కు పోలీసు విభాగం సరికొత్త పంథాలో సిద్ధమవుతోంది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్‌బూత్‌ల వారీగా గుర్తిస్తోంది. పోలింగ్ రోజున 20 వేల మందితో బందోబస్తుకు వ్యూహరచన చేస్తోంది. గతంలో సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించేలా..ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -సాక్షి, సిటీబ్యూరో ఎన్నికలు వచ్చాయంటే చాలు...నగరంలోని సమస్యాత్మక, అతి సున్నిత, సున్నిత పోలింగ్ బూత్‌ల ఎంపిక తప్పనిసరి. ఇప్పటి వరకు మూసధోరణిలో సాగిన ఈ విశ్లేషణకు నగర పోలీసులు కొత్త పంథా ప్రారంభించారు. పోలింగ్ రోజున 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్న అధికారులు.. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్సీసీ, స్కౌట్స్ తదితర బలగాల సేవలూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. సిటీలో అందుబాటులో ఉన్న పోలీసు, కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక నిఘా కోసం వాడాలని నిర్ణయించారు. నేర చరిత్ర ఉన్న వారిని, అసాంఘిక శక్తులను బైండోవర్ చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ... నగరంలో గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ తీసువాల్సిన చర్యల్ని నిర్ణయిస్తున్నారు. ఈసీ నుంచి అందిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్న ఫ్లయింగ్ స్వ్కాడ్స్, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కౌంటిగ్ కేంద్రం వద్ద ఫెన్సింగ్, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మూడంచెల భద్రత ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఎలక్షన్ సెల్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ వై.నాగిరెడ్డి నిత్యం సమీక్షిస్తూ అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఎంపిక నగరంలోని 1400 ప్రాంతాల్లో 4143 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో పోలింగ్ స్టేషన్ నైజం తెలుసుకోవడం అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఆ ప్రాంతంలో ఎంత మంది? ఏ స్థాయి? అధికారుల్ని ఏర్పాటు చేయాలన్నది స్పష్టమవుతుంది. దీనికోసం సాధారణంగా పోలీసు విభాగం గతంలో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పాటు భిన్న వర్గాలకు చెందిన వాటిని పరిగణలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆ పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకమా? అతి సున్నితమా? సున్నితమా? అన్నది నిర్థారిస్తుంటారు. ఈ జాబితాను బట్టే అక్కడి విధులకు సిబ్బందిని కేటాయించడం పరిపాటి. ఈసారి పోలింగ్ స్టేషన్ నైజాన్ని తెలుసుకోవడానికి నగర పోలీసులు సాంకేతికంగా వ్యవహరిస్తున్నారు. ఆ వార్డులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలతో పాటు ప్రభావితం చేసే అంశాలనూ పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా అధ్యయనం చేస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కొత్వాల్ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 20 వేల మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి పోలీసు విభాగం 20 వేల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కమిషనరేట్‌లో ఉన్న 15 వేల మందికి అదనంగా జిల్లాలు, ఇతర విభాగాల నుంచి ఐదు వేల మందిని తీసుకువస్తున్నారు. ప్రచార ఘట్టాన్ని సైతం శాంతియుతంగా పూర్తి చేయడానికి ప్రణాళికల్ని ఎలక్షన్ సెల్ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలను క్రమబద్ధీకరించడం కోసం ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, మాజీ సైనికోద్యోగుల సేవలు వినియోగించుకోనున్నారు. -
మేడికొండూరులో పోలీస్ పికెట్
మేడికొండూరు: మేడికొండూరు మండలంపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మేడికొండూరులో ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత రాతలు రాసిన విషయం విదితమే. ఈ మేరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనను పోలీసులు సవాలుగా స్వీకరించి అనుచిత రాతలు రాసిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు. వివాదస్పద, అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో ఉన్న పలువురు పోలీసు అధికారులు మేడికొండూరులో తిష్టవేశారు. ఈద్గా వద్ద పోలీసులకు దొరికిన కీలకమైన ఆధారంగా కేసును దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారని గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు. కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన మండల కేంద్రమైన మేడికొండూరు ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచితరాతలు రాసిన ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులను, సిరిపురంకు చెందిన ముగ్గురిని, మందపాడు గ్రామానికి చెందిన ఇద్దరిని అనూమానంతో స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో తమ పిల్లలు ఏ నేరం చేశారని పోలీసు స్టేషన్ వద్ద వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విచారణ నిమిత్తంగా తీసుకొచ్చామని విచారణ పూర్తయిన అనంతరం పంపుతామని వారితో సీఐ రమేష్‌బాబు చెప్పారు. -
అక్రమార్కులకు ‘పండుగ’
⇒ ఏటీబీల నిలువు దోపిడీ ⇒కృత్రిమ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు ⇒టిక్కెట్ బుకింగ్ కేంద్రాలపై నిఘా ⇒ రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, సిటీబ్యూరో: సొంత ఊళ్లకు వెళ్లే నగర వాసుల సంక్రాంతి సంబరాల సంగతి ఎలా ఉన్నా...ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలు మాత్రం అక్రమార్జనతో ‘పండగ’ చేసుకుంటున్నాయి. సాధారణ చార్జీలపై 50 శాతం అదనపు భారాన్ని మోపుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ... పండుగకు వారం, పది రోజుల ముందు నుంచే చార్జీలను అమాంతంగా రెండింతలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తున్నారు. వీరికి ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఏజెన్సీలు సైతం ప్రయాణికులపై ప్రతాపం చూపుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నాయి. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల్లో కనిపించే ఇలాంటి అక్రమ వ్యాపార ధోరణి కొంతకాలంగా ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలకూ విస్తరించింది. నగరంలోని వందలాది ఏటీబీ కేంద్రాలలో కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ఆర్టీసీపై ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. బినామీ పేర్లతో బుకింగ్ పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రధానరూట్లలో బినామీ పేర్లతో సీట్లు బుక్ చేస్తున్నారు. నిజమైన ప్రయాణికులు బుకింగ్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే సీట్లు నిండిపోయాయని, ఎవరైనా రద్దు చేసుకుంటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక్కో సీటుపైన రూ.100 అదనంగా చెల్లిస్తే రద్దు చేసుకున్న ప్రయాణికుల స్థానంలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో చాలా మంది ఇలా అదనంగా చెల్లించి వెళ్లవలసి వస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఏకంగా రూ.400 అదనంగా చెల్లించవలసిందే. ఏటా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఈసారి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ 5,560 ప్రత్యేకబస్సులను ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 13 వరకు ఈ బస్సులు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిజామాబాద్, బెంగళూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు బయలుదేరుతాయి. రెగ్యులర్‌గా వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లకు ప్రత్యేక బస్సులు తప్ప మరో అవకాశం లేదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడంతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే శరణ్యం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీ, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా చాలా వరకు దూర ప్రాంత బస్సులు ఏటీబీ కేంద్రాల నుంచే బయలుదేరుతాయి. దీంతో వీటి నిర్వహణ, ప్రయాణికుల భర్తీ వంటి వాటిపైన ఏటీబీల ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రత్యేక నిఘా ఇలా ఉండగా.. అక్రమాలకు పాల్పడే ఏటీబీ ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు చెప్పారు. ప్రత్యేక బస్సుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా ఏటీబీ ఏజెంట్లు టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఇవి ఏటీబీ కేంద్రాలపై నిఘా ఉంచడంతో పాటు, ప్రయాణికుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత ఏటీబీ కేంద్రాలను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
చెన్నూర్/మందమర్రిరూరల్/మంచిర్యాల టౌన్ : మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. బుధవారం రాత్రి మంచిర్యాల పోలీసుస్టేషన్, గురువారం చెన్నూర్, మందమర్రిలోని పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. సెంట్రీ, తుపాకులు భద్రపర్చే గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయా స్టేషన్లలో విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల నుంచి జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కాసిపేట మండలం తిర్యాణిలో ఎదురుకాల్పులు జరిగాయని, అక్కడ తప్పించుకుని పారిపోయారని అన్నారు. జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 15ఏళ్ల క్రితం సికాస పనిచేసిందని, ఆ సమయంలో పనిచేసిన సానుభూతి పరులను ఆకట్టుకుని ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా బుధవారం మందమర్రిలో వాల్‌పోస్టర్లు వేశారని తెలిపారు. వీటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మందమర్రి పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌తోపాటు మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్సై నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ‘రక్ష’ యాప్
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు మహిళా హాస్టళ్ల వద్ద ప్రత్యేక నిఘా చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి చిత్తూరు (అర్బన్): మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ‘రక్ష’ పేరిట కొత్త అప్లికేషన్ (యాప్)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్తూరు అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి తెలిపారు. ర్యాగిం గ్ అరికట్టడంపై చిత్తూరులోని ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో స్థానిక పోలీసు అతిథిగృహంలో గురువారం అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రక్ష యాప్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్లలో పనిచేస్తుందన్నారు. ఇంట ర్నెట్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని, ఇందులో ఐదుగురి సెల్ నెంబర్లను మహిళలు ఫీడ్ చేయాల న్నారు. ఏదైనా ప్రమాదం, ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఉపయోగిస్తే ఫీడింగ్‌లో ఉన్న ఐదుగురి సెల్నెంబర్లకు మెసేజ్ వెళ్లడంతో పాటు సంబంధిత మహిళ ఎక్కడుందనే విషయాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా తెలియజేస్తుందన్నారు. చిత్తూరు నగరంలో ప్రతి మహిళా కళాశాల వద్ద ర్యాగింగ్‌ను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పగటిపూట గస్తీ పెంచడం, కళాశాలల్లోనే యాంటీ ర్యాగింగ్ కమిటీలు రూపొందిచడం చేస్తామన్నారు. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు సైతం ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తప్పనిసరిగా ప్రతి కళాశాల వద్ద పోలీసు స్టేషన్, సీఐల నెంబర్లను విద్యార్థులు గుర్తించే లా అందుబాటులో ఉంచాలన్నారు. సీ ఐ రాజశేఖర్ మాట్లాడుతూ బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు మద్యం సేవిం చడం, సెల్ఫోన్లు వాడటం నిరోధించాలన్నారు. సమావేశంలో ఎస్ఐలు కృష్ణయ్య, మురళీమోహన్, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. -
రైల్వే మార్గాలపై నిఘా
ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు డీఎఫ్‌వో శ్రీనివాసులు తిరుపతి(మంగళం): శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా ల నుంచి కూలీలు రాకుండా అటవీశాఖ, రైల్వే, పోలీస్ అధికారులు రైల్వే మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి అటవీశాఖ కార్యాల యంలోని బయోల్యాబ్‌లో తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు శనివారం అటవీశాఖ, రైల్వే, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఎర్రకూలీలను శేషాచల అడవుల్లోకి రాకుండా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు గుంతకల్లు రైల్వే ఎస్పీతో చర్చించినట్టు తెలిపారు. దీంతో ఆయన స్పందించి అటవీశాఖకు సహకరించేందుకు రైల్వే అధికారులకు సూచించారని తెలిపారు. ఎర్రచందనం చెట్లను నరికేందుకు కూలీలు అటవీమార్గం గుండా వస్తే తాము కట్టడి చేస్తామని, బస్సుల్లో వచ్చే వారిని తనిఖీలు చేసి పోలీసులు అదుపు చేయాలని, అదే విధంగా రైళ్లల్లో వచ్చే కూలీలను రైల్వే అధికారులు పసిగట్టి అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాల ని కోరారు. కాట్పాడి, గుంతకల్లు, తిరుత్తుణి మీదుగా రైలు మార్గంలో వచ్చే ఎర్రకూలీలపై రైల్వే అధికారులు పూర్తి నిఘా ఉంచాలన్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే స్మగ్లర్లు, కూలీలను పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. అదేవిధంగా ఎర్రచందనం చెట్లను నరికేందుకు వస్తే జరిగే ప్రమాదాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దాంతో పాటు ప్రతి గ్రామంలో కరపత్రాలను పంచి పెడతామన్నారు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని పరిరక్షించుకునేందుకు అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. ఈ సమావేశంలో తిరుపతి, పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోలు పవన్‌కుమార్, నాగార్జునరెడ్డి, రైల్వే, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
అంతా అప్రమత్తం!
కడెం : మావోయిస్టుల వారోత్సవాలు సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూనే మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కడెం మండలంలో... ఒకప్పుడు కడెం మండలం మావోయిస్టుకు వారికి కంచుకోటగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల కారణంగా క్రమంగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు తగ్గింది. మండలంలోని సమీప అటవీ గ్రామాలైన అల్లంపల్లి, గంగాపూరు, కల్లెడ, దోస్తునగర్, ఉడుంపూరు, ఇస్లాంపూరు, గండిగోపాల్పూర్, మైసంపేట, ధర్మాజీపేట, సింగాపూరు తదితర గ్రామాలన్నీ వారికి ఎంతగానో అనుకూలంగా ఉండేవి. దీంతో ఈ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్ది రోజులుగా ఇక్కడ ప్రధాన రహదారిపై అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా ఉంచారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల ఏగురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులకు రక్షణ పెంచారు. మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం.వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపట్టాం.రాత్రి వేళ పెట్రోలింగును పెంచాం.స్థానికంగా ఇందుకు సంబందించిన అన్ని చర్యలను తీస్కున్నాం.పోలీస్టేషను వద్ద భద్రతను పెంచాం. ప్రజా ప్రతినిధులను కూడా అప్రమత్తం చేశాం. వాహనాల తనిఖీలు ఖానాపూర్ : మండలంలోని తర్లపాడ్ గ్రామంలో బాసర-మంచిర్యాల 222 ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోకి మావోయిస్టులు చొరబడ్డారనే అనుమానంతో పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని వేర్వేరు చోట్ల పలు సందర్భాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానం ఉన్న వారి వివరాలు సేకరించారు. జిల్లా ఉన్నతాధికారులతోపాటు సీఐ ఎల్.జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు ఎస్సై సునిల్ తెలిపారు. -
నిఘా నేత్రం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లాలో బుధవారం నిర్వహించనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్‌కు జిల్లా వ్యాప్తంగా 9800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశమున్న అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. వీరితోపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న 18 మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. గగనతలం నుంచి నిఘా... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం నుంచి రెండు హెలికాప్టర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన హెలికాప్టర్లను ఎస్పీ గజరావు భూపాల్ పరి శీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద యం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించనున్నారు. మావోయిస్టుల నుంచి ముప్పును పసిగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నారు. సరిహద్దుప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచామని, సమాచార వ్యవస్థతోపాటు స్పెషల్ బ్రాం చ్ పోలీసులు అనుక్షణం సమాచారం సేకరిస్తున్నారని ఎస్పీ భూపాల్ తెలిపారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రతిచర్యలకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పోలీసు బందబోస్తు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 2318 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 185 కేంద్రాలు అతిసమస్యాత్మకం, 340 కేంద్రాలు సమస్యాత్మకం, 79 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున నలుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 1800 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 3000 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది మహిళా పోలీసులు, 800 మంది హోంగార్డులతోపాటు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన 2500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ రోజున అలజడి సృష్టించే అనుమానాస్పద వ్యక్తులున్నా కేంద్రాలుగా 47 కేంద్రాలను గుర్తించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
పరిగి, న్యూస్‌లైన్: సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన గ్రామాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రాజకుమారితో కలిసి పరిగి మండల పరిధిలోని అతి సమస్యాత్మక గ్రామమైన రంగంపల్లిలో పోలింగ్ బూత్‌ను. అనంతరం పరిగిలోని నంబర్-1 ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని చోట్లా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని చెప్పారు. ఆయా చోట్ల ప్రచారం నుంచి పోలింగ్ రోజు వరకూ వీడియో చిత్రీకరణ జరపనున్నట్టు, నిఘా బృందాల సేవలు కూడా వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. తర్వాత ఎస్పీ రాజకుమారి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అందులో లైట్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ విజయకుమార్ రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డిలకు సూచించారు. ఓటర్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్పీ వెంట చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు లింగయ్య, శంషోద్దీన్, హెచ్ఎం గోపాల్ ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి తాండూరు రూరల్: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఆయన తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల ఓట్లు భద్రపర్చే స్టాంగ్‌రూంల వద్ద ఆయన వివరాలు సేకరించారు. సమస్యాత్మకమైన పాత తాండూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ శశిధర్‌రెడ్డి సూచించారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ప్రజలు ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డీఐజీతో పాటు ఎస్పీ రాజకుమారి, రూరల్ సీఐ రవి, పట్టణ ఎస్ఐ ప్రణయ్‌లు ఉన్నారు. -
పెయిడ్ ఆర్టికల్స్‌పై ప్రత్యేక నిఘా
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సాధారణ ఎన్నికల సమయంలో వార్తల ముసుగులో పెయిడ్ ఆర్టికల్స్ ప్రచురించినా, ప్రసారం చేసినా ప్రత్యేక నిఘా పెడతామని.. వీటిని ఎన్నికల ఖర్చు ఖాతాలో పొందుపరుస్తామని కలెక్టర్ సిద్ధార్థజైన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం మీడియా సర్టిఫికేషన్, మోనిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయిడ్ ఆర్టికల్స్‌ను ప్రతిరోజూ పరిశీలించి నివేదికను ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేస్తామన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనల సమాచారానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కో రారు. సమాచార శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వి.భాస్కర నరసింహం మాట్లాడుతూ ఇతరులను కించపరిచే, రెచ్చగొట్టేలా ప్రకటనలు ఉండకూడదని సూచించారు. ఏలూరులో మీడియా సెంటర్ సాధారణ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా త్వరలో ఏలూరులో మీడియా సెంటర్‌ను ఏ ర్పాటు చేస్తామని కలె క్టర్ తెలిపారు. ఎన్నికల నిబంధనల సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. కమిటీ కన్వీనర్, డీపీఆర్వో భాస్కరనారాయణ, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, జె. వెంకటేశ్వరరావు, ఎం. శ్రీహరిరావు, మీడి యా ప్రతినిధులు కె.మాణిక్యరావు, జి.రఘురాం, మురళీ, బీవీ రామాంజనేయు లు, నాగరాజు పాల్గొన్నారు. రేపు ఓటర్ల నమోదు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని.. ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. ఓటు నమోదు చేసుకోనివారి కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని చెప్పారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉద యం 10 గంటల నుంచి సాయంత్ర 5 గం టల వరకూ ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, చేర్పులు, మార్పుల కోసం కూడా అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు -
ఉపాధి చెల్లింపులపై ప్రత్యేక నిఘా
=క్లస్టర్ల వారీగా ప్రత్యేక బృందాలు =చేతివాటం ప్రదర్శిస్తే కఠిన చర్యలు =సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ ఎస్కార్ట్ సాక్షి, విశాఖపట్నం: ఉపాధి హామీ చెల్లింపుల్లో ఎడాపెడా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్‌కార్డు ద్వారా జరిగిన చెల్లింపుల్లోనే అక్రమాలు జరిగాయన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఇక నగదును నేరుగా అందిస్తే ఇంకెన్ని జరుగుతాయోనన్న అనుమానం అందరిలోనూ ఉంది. దాంతో అక్రమాలకు ఆస్కారమివ్వకూడదని నేరుగా చేసే ఉపాధి చెల్లింపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రామ స్థాయి కమిటీలతోనే సరిపెట్టకుండా మండల స్పెషలాఫీసర్లకు పర్యవేక్షక బాధ్యతలు అప్పగించారు. అంతటితో ఆగకుండా క్లస్టర్ల వారీగా పర్యవేక్షక కమిటీని నియమించారు. అయినప్పటికీ అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోనున్నారు. ఈమేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్, జూలై నెలకు సంబంధించి ఉపాధి కూలీల చెల్లింపులు జరగలేదు. రూ.17.9 కోట్ల మేర బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ బకాయి వేతనాల కోసం ఆందోళనలు చేశారు. ఇంతలోనే ఉపాధి చెల్లింపులు చేస్తున్న ఫినో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో బకాయిల విడుదల, పంపిణీ ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిధులు విడుదలతో పాటు నేరుగా (మాన్యువల్) చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆమేరకు తొలి విడతగా రూ.13,87,24,000విడుదల చేయగా మిగతా మొత్తాన్ని తాజాగా విడుదల చేసింది. దీంతో 675 పంచాయతీల్లో చెల్లింపులకు చర్యలు తీసుకున్నారు. అయితే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి, మండల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమేరకు సర్పంచ్, విలేజ్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌సీలతో ఉండే కమిటీలను గ్రామాల్లో నియమించారు. గ్రామాల వారీగా బకాయిలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు సెల్ఫ్ చెక్ ఇచ్చారు. వాటిని డ్రా చేసి సోమవారం నుంచి చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. కాకపోతే ఈ విధానంలో కూడా అక్రమాలు చోటు చేసుకోవచ్చన్న భయంతో ప్రత్యేక నిఘా పెట్టారు. స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాను చోడవరం, పెందుర్తి, పాడేరు, నర్సీపట్నం, యలమంచిలి, అరకు క్లస్టర్లగా విభజించి, వాటికి ముగ్గురు సభ్యుల గల పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మాన్యువల్‌గా చేసిన చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శిస్తే బాధ్యులైన కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోజూ చెల్లింపులపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఉపాధి చెల్లింపులు చేయాల్సిన వాటిలో 10 సమస్యాత్మక గ్రామాలున్నాయి. వాటిలో పంపిణీ దృష్ట్యా నగదు పట్టుకుని వచ్చి వెళ్లే పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్ ఇస్తున్నారు.