- ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
- డీఎఫ్‌వో శ్రీనివాసులు
తిరుపతి(మంగళం): శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా ల నుంచి కూలీలు రాకుండా అటవీశాఖ, రైల్వే, పోలీస్ అధికారులు రైల్వే మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి అటవీశాఖ కార్యాల యంలోని బయోల్యాబ్‌లో తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు శనివారం అటవీశాఖ, రైల్వే, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఎర్రకూలీలను శేషాచల అడవుల్లోకి రాకుండా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు గుంతకల్లు రైల్వే ఎస్పీతో చర్చించినట్టు తెలిపారు. దీంతో ఆయన స్పందించి అటవీశాఖకు సహకరించేందుకు రైల్వే అధికారులకు సూచించారని తెలిపారు. ఎర్రచందనం చెట్లను నరికేందుకు కూలీలు అటవీమార్గం గుండా వస్తే తాము కట్టడి చేస్తామని, బస్సుల్లో వచ్చే వారిని తనిఖీలు చేసి పోలీసులు అదుపు చేయాలని, అదే విధంగా రైళ్లల్లో వచ్చే కూలీలను రైల్వే అధికారులు పసిగట్టి అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాల ని కోరారు.
కాట్పాడి, గుంతకల్లు, తిరుత్తుణి మీదుగా రైలు మార్గంలో వచ్చే ఎర్రకూలీలపై రైల్వే అధికారులు పూర్తి నిఘా ఉంచాలన్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే స్మగ్లర్లు, కూలీలను పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. అదేవిధంగా ఎర్రచందనం చెట్లను నరికేందుకు వస్తే జరిగే ప్రమాదాలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
దాంతో పాటు ప్రతి గ్రామంలో కరపత్రాలను పంచి పెడతామన్నారు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని పరిరక్షించుకునేందుకు అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. ఈ సమావేశంలో తిరుపతి, పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోలు పవన్‌కుమార్, నాగార్జునరెడ్డి, రైల్వే, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.