Railway lines
-
తొలగించింది వారే... హెచ్చరించింది వారే
సూరత్: నైట్ డ్యూటీలు ఉంటే.. రోజంతా కుటుంబంతో గడపవచ్చని భావించారు రైల్వేలైన్లను తనిఖీ చేసే ముగ్గురు ట్రాక్‌మెన్. దాంతో ఉద్దేశపూర్వకంగా ఫిష్‌ప్లేట్లను తొలగించి.. తామే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పెద్ద ప్రమాదాన్ని అరికట్టారనే పేరు వస్తుందని ఆశించారు. అధికారులు తమ అప్రమత్తతను మెచ్చునొని నైట్‌డ్యూటీలు వేస్తారనేది వారి ఆశ. కానీ రైల్వే నిపుణుల దర్యాప్తులో వారి నిర్వాకం బయటపడి అరెస్టయ్యారు. సూరత్ ఎస్పీ హోతేష్ జాయ్సర్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుభాష్ పొద్దార్, మనీష్ మిస్త్రీ, శుభమ్ జైస్వాల్‌లు ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్నారు. కొసాంబా– కిమ్ స్టేషన్ల మధ్య దుండగులెవరో ఎలాస్టిక్ క్లిప్‌లను, రెండు ఫిష్పేట్లను తొలగించారని, వాటిని పక్కనున్న మరో ట్రాక్‌పై పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలని చూశారని ఈ ముగ్గురు శనివారం వేకువజామున 5:30 గంటలకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కిమ్ పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడానికి ట్రాక్‌మెన్ పట్టాల వీడియోను పంపించారు. అంతకు కొద్ది నిమిషాల ముందు ఆ ట్రాక్ మీదుగా ఒక రైలు వెళ్లిందని రైల్వే అధికారులు పోలీసులకు తెలిపారు. ట్రాక్‌మెన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన సమయానికి, రైలు వెళ్లిన సమయానికి.. మధ్య అవధి చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఫిష్‌ప్లేట్లను, ఎలాస్టిక్ క్లిప్‌లను తొలగించడం సాధ్యం కాదు. దాంతో పోలీసులు ట్రాక్‌మెన్ మొబైల్ ఫోన్లను పరిశీలించారు. శనివారం వేకువజామున 2:50 గంటలనుంచి 4:57 గంటలకు వరకు వీరు ట్రాక్ దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టారు. రైలు ప్రమాదాన్ని నివారిస్తే.. అధికారులు సన్మానించి, ఇకపై కూడా నైట్‌డ్యూటీలో కొనసాగిస్తారని వీరు భావించారు. నైట్‌డ్యూటీలు ఉంటే.. మరుసటి రోజు ఆఫ్ దొరుకుతుందని.. రోజంతా కుటుంబంతో గడపొచ్చని వీరు భావించారు. వర్షాకాలానికి సంబంధించి తమవంతు నైట్‌డ్యూటీలు ముగింపునకు రావడంతో వీరి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన సుభాష్ పొద్దారు ఈ ఐడియా ఇచ్చాడు. -
నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదే
సాక్షి, అమరావతి : ‘ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. అభివృద్ధి.. సంక్షేమం చేసి చూపించడం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇందుకోసం ఎంపీలు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు.ఇప్పటికే ఐదు హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచి్చన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీలకు శాఖలు అప్పగించామని, ఆ మేరకు ఎన్ని నిధులు తెచ్చారు.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో అందరి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాలని, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చూడాలని సూచించారు.విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ స్టీల్, కడప ఉక్కుపైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలని సూచించారు. విశాఖలో రైల్వే జోన్‌కు అవసరమైన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలని చెప్పారు.రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, కొత్త వలసలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. 2029లో కూడా పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, దాన్ని 1995లో అమలు చేశానని చెప్పారు. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలని సూచించారు. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చని, ప్రజల తలరాతలు మార్చవచ్చని గతంలో చేసి చూపించామన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వినుకొండ హత్య పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఉనికి కోసం దానికి జగన్ రాజకీయ రంగు వేస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరించారన్నారు. పోలీసుల విచారణలో కూడా అదే విషయం తేలిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.ఉనికి చాటుకోవడానికే జగన్ హింసా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఫేక్ పాలిటిక్స్‌నే నమ్ముకున్నాడని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై నేరస్తుల ఆటలు ఏమాత్రం సాగనివ్వమన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే తానే స్వయంగా విచారణకు వస్తానన్నారు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదన్నారు. -
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
Union Budget 2024: ఎన్నికల ముంగిట.. ఎన్నో ఆశలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో రైల్వే ప్రాజెక్టులకు భారీగానే కేటాయింపులు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. గత మూడు బడ్జెట్లలో లైన్లు, రైళ్ల పరంగా నిరాశే కలిగినా, కేటాయింపులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కానీ, తెలంగాణలో రైల్వేపరంగా ఉన్న డిమాండ్లతో పోలిస్తే, ఇవి సరిపోవు. దీంతో ప్రతీ బడ్జెట్ ఇంకా మెరుగ్గా ఉంటుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ముందు ఎంపీలతో భేటీ అయ్యి వారి నుంచి అధికారులు ప్రతిపాదనలు స్వీకరిస్తారు. కానీ ఈసారి అలాంటి భేటీ దక్షిణమధ్య రైల్వే నిర్వహించలేదు. తను కూడా ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపలేదని తెలిసింది. ఆయా రైల్వే లైన్లు ఇలా.... ఆర్మూరు–ఆదిలాబాద్ : ఈ లైన్ కీలకం. దీనికోసం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాపూరావు, బండి సంజయ్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. ►15 ఏళ్ల క్రితం పటాన్చెరు–ఆదిలాబాద్ లైన్ మంజూరైంది. ఆర్మూరు– నిర్మల్ మీదుగా సాగాల్సిన దీని నిడివి. 317 కి.మీ. ఇందుకు రూ.3771 కోట్లు ఖర్చవుతుదని అంచనా వేశారు. కానీ, ఆ తర్వాత దానిని కేంద్రం పక్కనపెట్టింది. ►పెద్దపల్లి–నిజామాబాద్ లైన్ పూర్తయిన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన పట్టాలెక్కింది. కరీంనగర్–నిజామాబాద్ లైన్లో ఉన్న ఆర్మూరు స్టేషన్ నుంచి కొత్త లైన్ మొదలై ముద్ఖేడ్–నాగ్‌పూర్ లైన్లో ఉన్న ఆదిలాబాద్ స్టేషన్‌తో అనుసంధానమవుతుంది. దీని నిడివి 300 కి.మీ., రూ. 2800 కోట్ల అంచనాతో 2017లో ఈ లైన్ మంజూరైంది. సర్వే పూర్తయ్యాక పనులు పట్టాలెక్కిలేదు. దీనికి నిధులు కేటాయించాలన్న ఒత్తిడి పెరిగింది. వికారాబాద్–కృష్ణా: తెలంగాణ సీఎం మొదలు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు వికారాబాద్–కృష్ణా లైను. గత బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే కూడా మంజూరైనా పనులు మొదలు కాలేదు. ►వికారాబాద్–పరిగి–కొడంగల్–దౌలతాబాద్–మక్తల్–నారాయణపేట్–కృష్ణా మీదుగా 122 కి.మీ.మేర కొనసాగే ఈ ప్రాజెక్టుకు రూ.2196 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రైల్వే కనెక్టివిటీ లేని కొత్త ప్రాంతాలకు ఆ రవాణా వసతి కల్పిస్తుంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సీఎం భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ రెండు తెలంగాణకు కీలక ప్రాజెక్టులు కావటంతో వీటి కేటాయింపులపై ఆశలు పెరుగుతున్నాయి. రాష్ట్రానికొచ్చేసరికి.... మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌కు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భారీగానే కేటాయింపులుంటాయని, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. భద్రాచలం–కొవ్వూరు, రామగుండం–మణుగూరు ప్రాజెక్టు విషయంలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఎంఎంటీఎస్ రెండోదశ, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంది. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం రూ.13786.19 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా రూ.4418 కోట్లు. 2022–23లో కేటాయించిన మొత్తం రూ.8349.75 కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.3048 కోట్లు. -
ఇక ‘లెవల్’ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల తరహాలో క్రాసింగ్స్ లేకుండా రైల్వే లైన్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు మార్గాన్ని రోడ్లు క్రాస్ చేసే ప్రాంతాల్లో, వాటి మీదుగా వెళ్లే వాహనాల రద్దీ ఆధారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టు ప్రణాళికల సమయంలోనే ఇందుకు ఏర్పాట్లు చేసి అంచనా వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఎక్కడా ఇతర రోడ్లు క్రాస్ చేయకుండా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో రైల్వే లైన్లను కూడా నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. నిర్ణయించటమే కాకుండా వెంటనే అమలులోకి తెచ్చింది. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో సైతం: ఈ నిర్ణయం తీసుకునేసరికే మొదలై పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కీలక ప్రాజెక్టు. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ మొదలై గజ్వేల్, సిద్దిపేట మీదుగా కొత్తపల్లి (కరీంనగర్ సమీపం) వరకు ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. గజ్వేల్ సమీపంలోని కొడకండ్ల–సిద్దిపేట మధ్య ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇది పూర్తి అయ్యాక వీలైనంత తొందరలో సిద్దిపేట నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా రైల్వే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు ప్లాన్ చేసినా.. ఇంకా నాలుగు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌లోని ఆ నాలుగులెవల్ క్రాసింగ్స్ కూడా తొలగింపు తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ నాలుగు లెవల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించాలని నిర్ణయించటం విశేషం. గజ్వేల్ దాటిన తర్వాత ఉన్న కొడకండ్ల శివారులోని రామచంద్రాపూర్ రోడ్డు వద్ద లెవల్ క్రాసింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ 3.5 మీటర్ల ఎత్తుతో లిమిటెడ్ ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. కుకునూరుపల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన లెవల్ క్రాసింగ్‌ను తొలగించి ఆర్యూబీ నిర్మించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లికి వెళ్లే రెండో కమాన్ రోడ్డు వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్‌ను తొలగించి దాదాపు అరకి.మీ. నిడివితో ఏడు మీటర్ల ఎత్తు గల ఆర్ఓబీని నిర్మించాలని నిర్ణయించారు. సిద్దిపేట శివారులోని రంగదామ్‌పల్లి లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించారు. ఇంకా 1,150 లెవల్ క్రాసింగ్స్... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద ఇంకా 1,150 వరకు లెవల్ క్రాసింగ్స్ ఉన్నాయి. కాపలా లేని క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించినా, కాపలా ఉన్న లెవల్ క్రాసింగ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని దశల వారీగా తొలగించే పని జరుగుతోంది. కానీ, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టుల్లో మాత్రం అసలు లెవల్ క్రాసింగ్స్ ఉన్న ఊసే ఉండకపోవటం విశేషం. -
15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 కొత్త రైల్వే ప్రాజెక్టులను నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. 2,647 కి.మీ. నిడివితో నిర్మించే ఆ ప్రాజెక్టులకు రూ.50,848 కోట్లు వ్యయం కాను న్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. వీటితోపాటు రూ.32,695 కోట్లు వ్యయమయ్యే 2,588 కి.మీ. 11 డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు కూడా ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైనట్టు వెల్లడించింది. రీజినల్ రింగ్ రైల్, ఆదిలాబాద్–పటాన్చెరు, ఘ ట్కేసర్ – యాదాద్రి, తాండూరు–జహీరాబాద్, మ ణుగూరు – రామగుండం, ఉందానగర్ – జగ్గయ్య పేట, కరీంనగర్ – హసన్‌పర్తి, డోర్నకల్ – మిర్యా లగూడ, భూపాలపల్లి–కాజీపేట, పాండురంగాపు రం–మల్కన్‌గిరి, కొత్తగూడెం–కిరండోల్, బోధన్ – లాతూరు రోడ్ ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేలు మంజూరైనట్టు వెల్లడించింది. కీలకం.. రీజినల్ రింగ్ రైల్ నగరానికి 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వెలుపల దాదాపు 338 కి.మీ. నిడివితో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. రూ.12,408 కోట్ల వ్యయంతో దాదాపు 564 కి.మీ. నిడివితో ఈ ప్రాజెక్టు ఉంటుందని రైల్వే ప్రకటించింది. వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి–భువనగిరి, రామన్నపేట, చిట్యాల, షాద్‌నగర్, షాబాద్ తదితర పట్టణాలను అనుసంధానిస్తూ ఇది రూపొందనుంది. అక్కన్న పేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల మీదుగా కొత్త లైన్లు నిర్మించనుండటం విశేషం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కలగటంతోపాటు సరుకు రవాణా రైళ్లకు కూడా అడ్డంకులు లేని సాఫీ ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుందని రైల్వే చెబుతోంది. ఇక 317 కి.మీ. నిడివితో రూ.5,706 కోట్లతో నిర్మితమయ్యే పటాన్చెరు (నాగులపల్లి) – ఆదిలా బాద్ ప్రాజెక్టు కూడా ఇందులో కీలకం కానుంది. ఇచ్చోడ, నేరేడుగొండ, ధానూరు, నిర్మల్, బాల్కొండ, ఆర్మూరు, బోధన్, రుద్రూరు, బాన్స్వాడ, నిజాంసాగర్, సంగారెడ్డి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చినట్టు అవు తుంది. దీంతోపాటు హైదరాబాద్–ఢిల్లీ ప్రధాన లైన్‌తో వీటికి అనుసంధానం కూడా కలుగుతుంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, ధాన్యం తరలింపునకు ప్రధాన రవాణా సాధనం అందుబాటులోకి వచ్చినట్టు కూడా అవుతుందని రైల్వే తెలిపింది. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి, లేఖలు సమర్పించారు. ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వం.. అనుసంధాతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్‌గా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ & ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే. -
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
మన్యానికి రైలొస్తోంది! 173 కి.మీ. కొత్త రైల్వేలైనుకు రూ 2,800 కోట్ల అంచనా!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): త్వరలోనే మన్యంలో రైలుకూత వినపడనుంది. ఇప్పటివరకు బస్సులు, లాంచీలు మాత్రమే తిరిగిన మన్యం ఏరియాలో రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం మన్యం ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. దీని నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ వరకు నిర్మిస్తారు. ఈ లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి. విలీన మండలాల మీదుగా... మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. నందిగామ నుంచి తెలంగాణలో గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. -
రైలు.. @130
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆరు ప్రధాన రూట్లలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల మేర పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చేందుకు ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, ఢిల్లీ–హౌరా, ముంబై–హౌరా, హౌరా–చెన్నై రూట్లలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. వీటిలో ఢిల్లీ–ముంబై మినహా మిగిలిన ఐదు రూట్లు ఏపీ పరిధిలోనూ ఉన్నాయి. ఈ మార్గాల్లో కన్ఫర్మేటరీ ఆసిల్లోగ్రాఫ్ కార్ రన్ (సీఓసీఆర్) టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పడుతున్న సమయం కన్నా అరగంట ఆదా ► ముంబై–చెన్నై ప్రధాన మార్గంలో గల గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. 280 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైలు మార్గంలో టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది. ► ఈ పరీక్షలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సమయం కంటే అరగంట ఆదా అయింది. ఈ మార్గంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల వేగం 90 కిలోమీటర్ల వరకు ఉంది. ► ఈ వేగాన్ని 130 కి.మీ వరకు పెంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ► గుంతకల్లు–రేణిగుంట మార్గంలో ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్‌పై టెస్ట్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. 130 కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతుంటే పట్టాలు తట్టుకోగలవా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ► టెస్ట్ డ్రైవ్ విజయవంతమైన తర్వాత రైల్వే భద్రత కమిషన్ (సీఆర్సీ) కూడా పరిశీలించి అనుమతులిస్తుంది. ► ముంబై–చెన్నై మార్గంలో ఏపీ పరిధిలోని గుంతకల్ డివిజన్ పరిధిలో 1,330.90 కి.మీ. ట్రాక్ ఉంది. రైల్వే గేట్ల ఎత్తివేత దిశగా.. ► గంటకు 130 కిలోమీటర్ల వేగం పెంచే ఈ ప్రధాన రైలుమార్గాల్లో దాదాపు రైల్వే గేట్లను ఎత్తివేసేందుకు రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది. ► ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న గేట్ల స్థానంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మిస్తోంది. పలు గేట్ల స్థానంలో ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో 30 లెవల్ క్రాసింగ్ గేట్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ► మూసివేయాలనుకుంటున్న ఎల్సీ గేట్ల స్థానంలో ఒక్కో ఆర్యూబీ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల లోపు వ్యయమవుతుందని అంచనా. -
తెలంగాణ ప్రభుత్వం తన వాటా ఇవ్వకనే..
సాక్షి, న్యూఢిల్లీ: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైను ప్రాజెక్టు, అక్కన్నపేట్–మెదక్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించాల్సి ఉందని, అవి జమ చేయకపోవడం వల్లే రాష్ట్ర ప్రాజెక్టుల్లో పురోగతి లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బుధవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. -
‘కూత’ పెట్టిస్తాం.. !
సాక్షి, హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్కి పలు ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. వీటిలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు, రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) కూడా ఉన్నాయి. ఆయా జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టులు తమను గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా వీటి పనుల పురోగతిని ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఆదేశించారు. ఐదింట రైలు కూత..: కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రజలకు రైల్వే సదుపాయం అంతంతే. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట వాసులకు ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్డు మార్గమే ఆధారం. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ ఆమోదం పొందినా.. పనులు 2016లో ప్రారంభించారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మీదుగా రైల్వేలైన్ వెళుతుంది. ఈ నియోజకవర్గాల టీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఎన్నికల హామీలో ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తొమ్మిదింట ‘రింగు’..: రీజినల్ రింగురోడ్డు ఇప్పుడు 9 నియోజకవర్గాల్లో ప్రచారాస్త్రంగా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. 338 కిలోమీటర్లతో నిర్మించే ఈ రోడ్డు సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్‌నగర్, చేవేళ్ల నియోజకవర్గాల గుండా వెళుతుంది. ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క కల్వకుర్తి మినహా మిగిలిన స్థానాల్లో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలే ఉండటంతో ఆర్ఆర్ఆర్ గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. -
సామాన్యుడికి చేరువ కావాలి అదే మా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. సామాన్యుడికి రైల్వే సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, దక్షిణమధ్య రైల్వే పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రత, కొత్తలైన్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలివీ... సాక్షి: దక్షిణ మధ్య రైల్వే పురోగతి ఎలా ఉంది? జీఎం: బావుంది. ఆదాయ పెరుగుదలతో దక్షిణమధ్య రైల్వే ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.7,017 కోట్లు ఆర్జించింది. 2016లో ఇది రూ.6,171గా ఉంది. అంటే 13.71 శాతం పెరుగుదల నమోదైంది. ఆదాయాభివృద్ధి పెరుగుదలలో దేశంలోనే మొదటిస్థానం సాధించాం. ఇక సరుకు రవాణా ఆదాయంలో దేశంలో 5వ స్థానంలో నిలిచాం. భారతీయ రైల్వే చేపట్టిన అంబ్రెల్లా ప్రాజెక్టుల గురించి వివరిస్తారా? దీని కింద ప్రతీ జోన్లో ఉన్న జీఎంకు రూ.100 కోట్ల నిధులొస్తాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్యం మేరకు స్టేషన్లలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వెచ్చించవచ్చు. ముఖ్యంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, హైలెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పా టు చేస్తున్నాం. రాబోయే రెండు మూడేళ్లలో జోన్ పరిధిలో ఉన్న 742 స్టేషన్లలో ఈ పనులు పూర్తవుతాయి. మాసాయిపేట దుర్ఘటన తరువాత కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగుల నిర్మూలిస్తామన్నారు కదా! ఆ పనులు పూర్తయ్యాయా? కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ పనులు అక్టోబర్ 31 గడువుగా పెట్టుకుని పూర్తిచేశాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగులు లేవు. 2018 చివరి నాటికి దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల నిర్మూలన దిశగా భారతీయ రైల్వే కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆర్వోబీ/ఆర్యూబీల పనుల పురోగతి? గత నాలుగేళ్లలో 379 ఆర్వోబీ/ఆర్‌యూబీలను పూర్తి చేశాం. మిగిలిన 264 ఆర్వోబీ/ఆర్యూబీ ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనులు ఎంతవరకు వచ్చాయి? ఎంఎంటీఎస్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేక్స్(నాలుగు బోగీలు కలిగిన రైళ్లు) కొనుగోలు మాత్రమే మిగిలింది. అవి రాగానే సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్ ఫేజ్–2ని యాదాద్రి వరకు పొడిగిస్తారా? ఈ ప్రాజెక్టు చేపట్టడానికి మేం సుముఖమే. సర్వే కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరీంనగర్–హసన్‌పర్తి కొత్త లైన్ సర్వే పనులు ఎలా ఉన్నాయి? ఉత్తర తెలంగాణను ఉత్తర భారతంతో కలిపే ప్రాజెక్టు ఇది. దీని సర్వే పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి సర్వే పూర్తవుతుంది. శివారు స్టేషన్ల అభివృద్ధి, టెర్మినళ్ల నిర్మాణానికి ఏం చర్యలు తీసుకున్నారు? సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై రద్దీ పెరిగిన నేపథ్యంలో లింగంపల్లి స్టేషన్‌ని నాలుగో టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం 5 రైళ్లను అక్కడ నుంచి నడుపుతున్నాం. త్వరలోనే మరిన్ని నడుపుతాం. చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలుపెట్టాం. అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నాం. మొత్తం రూ.224 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రైల్వే పనుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొత్త రైల్వే పనుల కోసం భారతీయ రైల్వే ఎప్పుడూ ముందుంటుంది. ఇందుకోసం జాయింట్ వెంచర్ విధానంలో ముందుకెళుతున్నాం. రాష్ట్రాలు 51 శాతం, కేంద్రం 49 శాతం నిధులతో ప్రాజెక్టులు చేపడతాం. ఈ విధానాన్ని వినియోగించుకోవడంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. దీనిపై ఏపీ సంతకం చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. తెలంగాణతో ఇంకా సంప్రదింపులు నడుస్తున్నాయి. స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతీ స్టేషన్‌కు రూ.30 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. స్టేషన్ల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ఆయా స్టేషన్ల ముఖద్వారాల్లో స్థానిక పట్టణ విశిష్టతను తెలిపేలా చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక రూ.400 కోట్ల నిధులతో తిరుపతి స్టేషన్‌కు అభివృద్ధి పనులు చేపట్టాం -
పట్టాలెక్కేదెప్పుడో?
నారాయణఖేడ్: దశాబ్దాలు గడుస్తున్న బోధన్–బీదర్ రైల్వేలైన్‌కు మోక్షం కలగడం లేదు. ప్రతీసారి బడ్జెట్లో ఆశలు నెరవేరుతాయని ఎదురుచూడడం.. నిరాశే మూటగట్టుకోవడ పరిపాటిగా మారింది. ఒకటికాదు రెండు కాదు ఎనిమిది దశాబ్దాలుగా బోధన్– బీదర్ రైల్వేలైన్ పట్టాలెక్కడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, నేతలు మారుతున్నా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. స్వరాష్ట్రంలోనైనా కలనెరవేరుతుందని ఆశించినా అడియాసే ఎదురవుతోంది. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగించేందుకు 1938లో నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. బోధన్–బాన్సువాడ–పిట్లం– నారాయణఖేడ్–బీదర్ ప్రాంతాల ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి లైన్ క్లియర్ చేశారు. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్యకొత్తగా మరో రైల్వేలైన్ సర్వేకోసం ఆదేశించారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ మీదుగా బీదర్‌వరకు సర్వే పూర్తి చేశారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. రూ.1,029 కోట్ల వ్యయంతో లైన్ వేయొచ్చని అధికారులు తేల్చారు. నారాయణఖేడ్ సమీపంలోని జి.హుక్రాన సమీపంలో ఈమేరకు అధికారులు హద్దురాళ్లు పాతడం, రోడ్లపై మార్కింగ్ సైతం వేశారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితిపై అంచనా వేసి రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సర్వే విషయమై అప్పటి ఎంపీ సురేష్ షెట్కార్ పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి స్పందన కరువు.. 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లు పూర్తయినా పైసా విదిల్చింది లేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాలకు నిధులు కేటాయించిన కేంద్రం బోధన్–బీదర్ రైల్వే లైన్‌కు మాత్రం మొండిచేయి చూపించింది. రూ.1,029 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. జాప్యం కారణంగా వ్యయం రెట్టింపై రూ.2వేల కోట్లకు చేరింది. మారిన నిబంధనల ప్రకారం రైల్వేలైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులు కేటాయిస్తే కేంద్రం సగం కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువయ్యింది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఇప్పట్లో ఈ రైలుమార్గానికి మోక్షం కలిగేలా లేదు. రైల్వేలైన్ ఏళ్లనాటి కల రైల్వే లైన్ ఏర్పాటు ఏళ్లనాటి కల. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. బోధన్–బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు జరిగితే రవాణా పరంగా ఎంతో మేలు చేకూరుతుంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. –చిరంజీవి, తుర్కాపల్లి, నారాయణఖేడ్ -
రైల్వే మంత్రిగారూ.. దయచేసి వినండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రైల్వే బడ్జెట్ ప్రతిసారీ ఊరించి ఉస్సూరనిపిస్తోంది. కొత్త రైళ్ల ఊసే ఉండడం లేదు. కొత్త రైల్వే లైన్ల పరిస్థితి కూడా అంతే. జిల్లా ఎంపీల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సమస్యల కూతలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నా స్టేషన్ల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. బడ్జెట్లో ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రధానమైన ప్రతిపాదనలివీ... కాకినాడ–కోటిపల్లి రైల్వేను లైన్ నర్సాపురం వరకు విస్తరించేందుకు మరో రూ. 600 కోట్లు రైల్వే శాఖ నుంచి రావల్సి ఉంది. అవి వస్తే తప్ప కోటిపల్లి నుంచి రైల్వే పనులు ప్రారంభంకావు. వీటి విషయంలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ 30 ఏళ్ల క్రితం నివేదిక ఆధారంగా పిఠాపురం– కాకినాడ మెయిన్ లైన్ సాధ్యం కాదని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. రద్దీ పెరిగింది. కొత్తగా కోటిపల్లి– నర్సాపురం లైన్ వేస్తుండటంతో ఈ మెయిన్ లైన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎంపీ తోట నర్సింహం తీసుకెళ్లారు. గత బడ్జెట్లో 200 కేటాయించినందున దీన్ని పూర్తి చేయాలని కోరారు. ఎంపీ తోట నర్సింహం పరువు నిలుపుతారో లేదో చూడాలి. ♦ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో 3,4 ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి కోసం గత బడ్జెట్లో రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు ఆ నిధులు రాలేదు. పనులు మొదలు కాలేదు. ♦ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకాస్త ప్రయోజనకరంగా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం, రేపెల్లె, నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు కలిపే కోస్తా రైలు మార్గం అవుతుందని,ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. ♦ జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్లో ‘వైఫై’ సదుపాయం లేదు. ఇక నూతన రైల్వే లైన్ల ఊసే ఉండటం లేదు. కొత్తగా రైళ్లు రావడం లేదు. ఎంపీలు కోరడమే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికి ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందో లేదంటే ఎప్పటిలాగే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తుందో చూడాలి. గతంలో ప్రకటించిన నిధులు ఈసారైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రకటించినట్టుగా మన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందో? గత బడ్జెట్ మాదిరిగా మొండి చేయి చూపుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. -
ఐదేళ్లలో పట్టాలన్నీ బ్రాడ్‌గేజ్‌కి
లోక్‌సభలో రైల్వే మంత్రి వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం రైల్వే నెట్వర్క్ వచ్చే ఐదేళ్లలో బ్రాడ్‌గేజ్‌లోకి మారనుంది. అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖకు నిధుల డిమాండ్ (డిమాండ్ ఫర్ గ్రాంట్స్)పై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు బుధవారం సమాధానమిస్తూ ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మీటర్ గేజ్ పట్టాలన్నింటిని ఐదేళ్లలో బ్రాండ్ గేజ్‌లోకి మార్చి, 2019 అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘రైల్వేలో వచ్చే ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రైల్వే నెట్వర్క్ భద్రతను పటిష్టం చేసేం దుకు రూ. లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు. తర్వాత సభ మూజువాణి ఓటుతో నిధుల డిమాండ్‌ను ఆమోదించింది. పొరుగు దేశాలకు రైల్వే లైన్లు: వాణిజ్యం పెంపు, ఆసియాలో పేదరిక నిర్మూలనS కోసం పొరుగు దేశాలను రైల్వే మార్గాలతో అనుసంధానించాలని సురేశ్ ప్రభు ఢిల్లీలో జరిగిన ఐరాస సదస్సులో సూచించారు. -
పట్టాలు పడుతున్నాయి
రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లకు భారీగా నిధులు • మొత్తంగా ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు • సీఎం కలల ప్రాజెక్టు కొత్తపల్లి– మనోహరాబాద్‌కి రూ.350 కోట్లు • బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించింది. పలు పెండింగ్ ప్రాజెక్టులు సహా కొత్త రైల్వే మార్గాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ (కరీంనగర్–హైదరాబాద్) ప్రాజెక్టుకు రూ.350 కోట్లు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లను కేటాయించగా.. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలును ప్రకటించకున్నా.. కొత్త లైన్ల ఏర్పాటు, ఉన్న లైన్లకు అదనంగా రెండు, మూడు లైన్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కొత్త పంథాలో.. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆనవాయితీని పక్కనపెడుతూ సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసిన కేంద్రం.. కేటాయింపుల్లోనూ కొత్త పంథా చూపింది. అయితే బడ్జెట్లో రైల్వేకు సంబంధించి ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులిచ్చారనే పూర్తి వివరాలను పేర్కొనలేదు. పింక్బుక్గా వ్యవహరించే ఈ పద్దుల వివరాలను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆ వివరాలను శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి మొత్తంగా రూ.5,135 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ నిర్మాణ పనులకు ఎక్కువ నిధులు ఇచ్చారు. బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.260 కోట్లు, మునీరాబాద్–మహబూబ్‌నగర్ లైన్‌కు రూ.300 కోట్లు, అక్కన్నపేట–మెదక్‌కు రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో ఇంతకాలం నత్తనడకన జరుగుతున్న ఈ పనుల్లో వేగం పెరగబోతోంది. సీఎం కలల ప్రాజెక్టుకు రూ.350 కోట్లు తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేట పట్టణాలకు రాజధానితో రైల్వే అనుసంధానం లేదు. సిద్దిపేటకు అసలు రైల్వే మార్గమే లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైల్వే లైన్ నిర్మించాలంటూ కేసీఆర్ రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రైల్వే బడ్జెట్లో చోటు దక్కినా.. ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ గట్టిగా ప్రయత్నించడంతో కదలిక వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ స్వయంగా ఈ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తాజా బడ్జెట్లో ఏకంగా రూ.350 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ శివార్లలోని మనోహరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్.. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లల మీదుగా కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు 148.9 కిలోమీటర్లు కొనసాగుతుంది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ అత్యంత రద్దీ మార్గంగా పేరున్న బల్లార్షా–కాజీపేట–విజయవాడ మార్గంలో ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి రావటానికి మరో రెండేళ్లు పట్టనుంది. అయితే ఆ మార్గంలో నాలుగో లైన్ కూడా అవసరమని భావించిన రైల్వే దానికి సర్వే పనులు చేపట్టనుంది. ఇక ఈ ఏడాదితో పూర్తికానున్న పెద్దపల్లి– కరీంనగర్–నిజామాబాద్ (178 కి.మీ.) లైనుకు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు పరుగెత్తనున్నాయి. టీకాస్‌కు మరిన్ని నిధులు రైళ్లు ఢీ కొనకుండా అభివృద్ధి చేస్తున్న ‘ట్రెయిన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్)’ను మరిన్ని చోట్లకు విస్తరించనున్నారు. దీనిని ఇప్పటికే సికింద్రాబాద్– వాడి–వికారాబాద్–బీదర్ సెక్షన్లలో వినియోగి స్తుండగా.. తాజాగా సికింద్రాబాద్– గద్వాల–డోన్– గుంతకల్ మార్గానికి విస్తరించారు. ఇందుకు రూ.120 కోట్లు కేటాయించారు. కొత్త మార్గం ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ (220 కి.మీ). అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. (రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు) రైళ్ల క్రాసింగ్స్ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: (అంచనా రూ.15 కోట్లు) – వనపర్తి రోడ్డు–కౌకుంట్ల; మానవపాడు–అలంపూర్ రోడ్డు; ఇటిక్యాల–మానవపాడు కొత్త లైన్ల కోసం సర్వే ⇔ బొల్లారం–ముద్ఖేడ్ డబ్లింగ్ (235 కి.మీ) ⇔ కాజీపేట–బల్లార్షా నాలుగో లైన్(234 కి.మీ) ⇔ కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ (219 కి.మీ.) ⇔ మంచిర్యాల–గడ్చిరోలి కొత్త లైన్ (115 కి.మీ.) భద్రతా పరమైన పనులు ⇔ 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు), 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూ బీ). అంచనా వ్యయం రూ.941 కోట్లు. రైల్వే వాటా రూ.383 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.558 కోట్లు ⇔ 9 కొత్త వంతెనలకు రూ.31 కోట్లు ⇔ లెవల్ క్రాసింగ్స్, ఇంటర్‌లాకింగ్ పనులకు రూ.69.5 కోట్లు -
ఎన్నో ప్రమాదాలు.. వేలాది మృతులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రమాదాలూ అదేస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. తూర్పు కోస్తా రైల్వే చరిత్రలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనే అతి పెద్దది. ఈ ప్రమాదంలో 40 మంది మృత్యువాత చెందగా.. 71 మందికిపైగా గాయాలయ్యాయి. దేశంలో ఘోర రైలు ప్రమాదాలను ఒకసారి గమనిస్తే.. ► 1981 జూన్ 6: బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ► 1995 ఆగస్టు 20: ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు. ► 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్–అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 268 మంది మృతిచెందారు. ► 1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ–సీల్డా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. 212 మంది మరణించారు. ► 2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 170 మంది తుదిశ్వాస విడిచారు. ► 1964 డిసెంబర్ 23: తమిళనాడులో పాంబన్–ధనుష్కోటి ప్యాసింజర్ రైలు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు. ► 2002 సెప్టెంబర్ 9: హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్‌లోని గయ వద్ద పట్టాలు తప్పింది. 140 మంది కన్నుమూశారు. ► 2003 జూలై 2: వరంగల్ స్టేషన్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 21 మంది మృతిచెందారు. ► 2005 అక్టోబర్ 29: తెలంగాణలోని వలిగొండ వద్ద మూసి నదిపై బ్రిడ్జి కూలిపోయింది. అదే బ్రిడ్జిపై వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ నదిలో పడిపోయింది. 114 మంది ప్రయాణికులు కన్నుమూశారు. -
గాయత్రి ప్రాజెక్ట్స్ కు రైల్వే కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ అవకాశాలున్న రైల్వే లైన్ల నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్అండ్టీ, సోజిజ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కలిసి రూ. 4,744 కోట్ల భారీ రైల్వే ఈపీసీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. ఇక్బాల్‌ఘర్- వడోదర మధ్య నిర్మిస్తున్న వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీసీ) ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్, సివిల్ బిల్డింగ్స్, వంతెనలు, రైల్వే ట్రాక్ నిర్మాంచాల్సి ఉంది. కేవలం సరుకు రవాణా కోసం ముంబై - ఢిల్లీ మధ్య 1,483 కి.మీ మధ్య ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తుండగా, అందులో 304 కి.మీ కాంట్రాక్టును గాయత్రి కన్సార్షియం దక్కించుకుంది. -
ఆన్లైన్లో రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణ
న్యూఢిల్లీ: రైల్వే మార్గాల (ట్రాక్‌ల) పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తోడ్పడే వెబ్ ఆధారిత ‘ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్)’ను రైల్వే అమల్లోకి తీసుకువచ్చింది. ట్రాకుల ఉష్ణోగ్రత, వంతెనల వద్ద నీటి మట్టం తదితర పరిస్థితులను ఆన్లైన్ విధానం ద్వారా పరిశీలించగలిగే విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో రైల్వే బోర్డు సభ్యుడు వీకే గుప్తా ఈ వివరాలను వెల్లడించారు. ట్రాకుల నిర్వహణ ముఖ్యమైన అంశమని, అన్ని రైల్వే డివిజన్లలో టీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, ఎక్కువ రద్దీ ఉండే క్రాసింగ్‌ల వద్ద పరిస్థితిని సరిదిద్దేందుకు 1,400 ఓవర్ బ్రిడ్జిలు, 7,500 అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రమాదాలను నిరోధించేలా భద్రతా ప్రమాణాల పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీలో చెప్పారు. -
టీంగ్..టీంగ్.. టీంగ్..దయచేసి వినండి..
ప్రతి ప్లాట్‌ఫాంపై సమస్యలు తిష్ట వేసి ఉన్నవి.. ప్రాథమిక వైద్యసౌకర్యం అంతంత మాత్రం నేడు దక్షిణమధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ ఆకాంక్షల్ని సాకారం చేయాలంటున్న జిల్లావాసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ :రైల్వే బడ్జెట్.. ఏటా దీనిపై జిల్లావాసుల్లో ఆశలు మోసులెత్తుతుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్లకు నిధులు, జిల్లాకు కొత్త రైళ్లు, ఉన్నరైళ్లకే ప్రధాన స్టేషన్లలో హాల్ట్ వంటి ఆకాంక్షల సాకారానికి పచ్చజెండా ఊపుతారని ఎదురు చూస్తుంటారు. రైల్వేస్టేషన్లు ఆధునికీకరణకు నోచుకోవాలని కోరుకుంటారు. జనం ఆశలు, ఆకాంక్షలను బలపడేలా బడ్జెట్‌కు ముందు నేతలు హామీలు గుప్పించడమూ రివాజే. అయితే.. అవి సాకారం కావాలంటే బడ్జెట్ రూపకల్పనలో భాగంగా దఫదఫాలుగా జరిగే సమావేశాల్లో జిల్లాప్రజల వాణిని, ఆకాంక్షలను ఎంపీలు బలంగా వినిపించాలి. ఈ క్రమంలో ముందుగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాతో రాష్ట్ర ఎంపీల సమావేశం గురువారం విజయవాడలో జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైల్వేస్టేషన్ల పరిస్థితిపై ప్రత్యేక కథనం.. జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో.. కాకినాడ జిల్లాకు పరిపాలనా కేంద్రమే అయినా హౌరా-చెన్నై మెయిన్ లైన్లో ఉన్న రాజమండ్రితో పోల్చితే అభివృద్ధి అంతంత మాత్రమే. కాకినాడ రైల్వేస్టేషన్లో భానుగుడి వైపు ప్లాట్‌ఫాం నిర్మాణానికి గతంలోనే ఆమోదం లభించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రోజూ వచ్చే రైళ్లలో సగం మంది ప్రయాణికులు భానుగుడి వైపు దిగుతున్నారు. ఆ వైపు సౌకర్యాలు కల్పించాలి. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లడానికి ట్రాక్ వెంబడి రోడ్డును నిర్మించాలి. కొండయ్యపాలెం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ఎంత త్వరగా పూర్తయితే కాకినాడలో ట్రాఫిక్ సమస్య అంత వేగంగా నియంత్రణలోకి వస్తుంది. వంతెన పనులన్నీ రైల్వే శాఖ పూర్తి చేసినా రోడ్లు భవనాల శాఖ చేయాల్సిన పనులే మిగిలాయి. స్థానికంగా ఉన్న స్వల్ప అవరోధాలను సత్వరమే పరిష్కరించాలి. ఆర్వోబీకి అనుసంధానంగా ఉన్న రోడ్డు జగన్నాథపురం నుంచి మొదలై కొండయ్యపాలెం వరకూ వస్తుంది. ఆర్వోబీపై నుంచి వచ్చే రోడ్డును ఇటువైపు మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న 80 అడుగుల రోడ్డుకు కలిపితే ప్రయాణికులు నేరుగా నాగమల్లి తోట వద్ద మెయిన్‌రోడ్డుకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తాకిడి చాలావరకూ తగ్గిపోతుంది. ఐటీ పార్కు, ఆటోనగర్లతో పాటు జనావాసాలు విస్తరిస్తున్న సర్పవరం జంక్షన్లో కూడా ఇప్పుడే ఆర్వోబీ నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవు. పోర్టు రైల్వేస్టేషన్ దగ్గర రైళ్ల నిర్వహణకు ఒకటీ లేదా రెండు పిట్లైన్లు అదనంగా వేయాలి. కాకినాడలో ఆగిపోయే రైళ్లను శుభ్రం చేసి క్షుణ్నంగా తనిఖీ చేయడానికి ఇవి చాలా అవసరం. అంతేకాదు కాకినాడ నుంచి అదనపు రైళ్లు నడపాలన్నా, కొత్త రైళ్లు వేయాలన్నా రైల్వేశాఖ తొలుత చూసేది ఈ పిట్‌లైన్ల సామర్థ్యాన్నే. వాణిజ్య రాజధాని రాజమండ్రిలో... పుష్కరాల సందర్భంగా రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లకు రంగులు వేశారు. గోదావరి స్టేషన్లో ఫుట్‌వోవర్ బ్రిడ్జి నిర్మించారు. అంతకు మించి మౌలిక వసతులేవీ కల్పించలేదు. రైళ్ల రద్దీ దృష్ట్యా రాజమండ్రి స్టేషన్లో నాలుగో ప్లాట్ఫారం అత్యవసరం. పుష్కరాల సమయంలో నిర్మించిన లోలెవెల్ ప్లాట్ఫారం అంతగా ఉపయోగపడడం లేదు. తూర్పు రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ ప్రాంగణంలో సులాభ్ కాంప్లెక్స్ నిర్మించాలి. కీలక కూడలి సామర్లకోటలో.. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు వేచి ఉండేందుకు ప్లాట్ఫారం ఇరువైపులా షెల్టరు లేదు. ఎండ కాసినా, వర్షం వచ్చినా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మూడు ప్లాట్ఫారంల పైనా అదే పరిస్థితి. ఫుట్‌వోవర్ బ్రిడ్జి ఒక్కటే ఉంది. పాత బ్రిడ్జి స్థానంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆరేళ్లవుతోంది. అర్ధాంతరంగా ఆగిన పనులను పూర్తి చేయాలి. తూర్పు వైపున రైలు దిగడానికి వీలుగా స్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లను కేవలం రెండు నిమిషాలు కాక మూడు నిమిషాలైనా ఆపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఫలహారశాల మూసేసి పదేళ్లవుతోంది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పుణ్యస్థలి అన్నవరంలో.. దేవస్థానానికి వెళ్లే భక్తులు మూడో నంబరు ప్లాట్‌ఫాం దాటి కొండపైకి వెళ్లే వాహనాలు ఎక్కి వెళ్లాలి. కానీ ఈ ప్లాట్‌ఫాంపై వేచి ఉండేందుకు గదులు లేవు. టాయిలెట్స్ కూడా లేవు. టికెట్ బుకింగ్ కాంప్లెక్స్ 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మూడో నంబరు ప్లాట్‌ఫాంకు మార్చాలన్నది చిరకాలపు డిమాండ్ కొండవైపు వెళ్లి వచ్చే వాహనాలు స్టేషన్ వద్ద ఆగేచోట ఎలాంటి షెల్టరూ లేదు. జిల్లా ప్రవేశద్వారం ‘తుని’లో.. రైల్వేస్టేషన్లో ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్నా టికెట్ కౌంటర్ మాత్రం ఒక్కటే ఉంది. రెండో కౌంటర్ ప్రారంభించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రెండో ప్లాట్‌ఫారంపై మరుగుదొడ్లున్నా ఎప్పుడూ మూసే ఉంటాయి. దువ్వాడ-పిఠాపురం మధ్య ఎక్కడ రైల్వే ప్రమాదాలు జరిగినా తుని జీఆర్పీ స్టేషన్‌కు రావాలి. ఇది రెండో ప్లాట్ఫారానికి వెనుక ఉంటుంది. అక్కడికి ఒకటో నంబరు ప్లాట్ఫారం నుంచే వెళ్లాలి. ఈ హడావుడిలో ఎవరైనా ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోలేకపోతే జరిమానాలు పడుతున్నాయి. ఈ అగచాట్లు పడలేక ఎదురుగా ఉన్న జీఆర్పీ స్టేషన్‌కు పట్టాలు దాటివెళ్లే ప్రయత్నంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు వినరూ.. రెండు నెలల క్రితం విజయవాడ నుంచి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం విశాఖపట్నం వెళ్తున్న ఓ యువకుడు మంచినీరు పట్టుకోవడానికి సామర్లకోట స్టేషన్లో దిగాడు. రెండు నిమిషాలే హాల్ట్ కావడంతో కదిలిపోతున్న రైలు ఎక్కబోతూ పట్టుతప్పి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై పడిపోయాడు. తీవ్ర గాయాలతో గంటన్నర పాటు రక్తపుమడుగులోనే ఆర్తనాదాలు చేస్తున్నా ప్రాథమిక వైద్యం చేసేవారే కరువయ్యారు. చివరకు 108 వాహనం వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. అదే రైల్వే ఆస్పత్రి వైద్యులు వెంటనే స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవి. రాజమండ్రి-తుని స్టేషన్ల మధ్య ప్రతి నెలా ఇలాంటి సంఘటనలు రెండైనా చోటు చేసుకుంటున్నాయి. ప్లాట్‌ఫాంపై వైద్య సిబ్బందిలో ఒకరిద్దరిని ఉంచితే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అంది, ప్రాణాపాయం తప్పుతుంది. -
మళ్లీ బ్రేక్!
- ఎంఎంటీఎస్ రెండో దశను అడ్డుకున్న రక్షణశాఖ - 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి అందని భూములు - ఎయిర్‌పోర్టు మార్గంపై మరో దఫా చర్చలు సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు మరోసారి బ్రేక్ పడింది. ఫైరింగ్ రేంజ్లో ఉన్న భూమిని రైల్వే లైన్లకు ఇవ్వబోమంటూ రక్షణ శాఖ తెగేసి చెప్పింది. గతంలో తమ నుంచి పొందిన భూములకు ప్రతిగా మరోచోట భూమి కానీ, పరిహారం కానీ ఇవ్వకపోవడం... అదే మార్గంలో ప్రస్తుతం రెండో దశ డబ్లింగ్ పనులు చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ అంశంపై రక్షణ, రైల్వేశాఖల మధ్య ఇప్పటి వరకు ఉన్నత స్థాయి చర్చలు లేకపోవడంతో రెండు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సుచిత్ర నుంచి సనత్ నగర్ వరకు నాలుగు కిలోమీటర్ల మార్గం రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలోనే సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు 1983లో సింగిల్ ట్రాక్ నిర్మించారు. దాని కోసం తీసుకున్న భూమికి ప్రతిగా మరో చోట తమకు స్థలం కేటాయించాలని రక్షణ శాఖ కోరింది. తమకు అంత భూమి అందుబాటులో లేదని, పరిహారం చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే రైల్వే నుంచి డిఫెన్స్‌కు భూమి, పరిహారం.. ఏవీ అందలేదు. ఈ వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది. రెండో దశతో తెరపైకి... తాజాగా రెండో దశ పనుల ప్రారంభంతో పాత వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. గతంలో నిర్మించిన సింగిల్ లైన్‌కు పరిహారం చెల్లించకుండా... రెండో దశ కు అదే మార్గంలో డబ్లింగ్ చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అప్పట్లోనే తాము 900 ఎకరాలు కోల్పోయామని, మరోసారి భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చేపట్టిన ఆరు మార్గాల్లోనూ భూముల సేకరణపై ఇప్పటి వ రకు స్పష్టత లేకపోవడం గమనార్హం. రూ.819 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్ట్ పనులు 2013లో ప్రారంభమయ్యాయి. 50 చోట్ల ప్రతిష్టంభన.... రెండో దశ ప్రాజెక్టులో చేపట్టిన మౌలాలీ-ఘట్కేసర్, మౌలాలీ-సనత్‌నగర్, బొల్లారం-మేడ్చెల్, సికింద్రాబాద్-బొల్లారం, ఫలక్‌నుమా-ఉందానగర్ మార్గాల్లో సుమారు 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి 35 ఎకరాలకు పైగా భూమి అందవలసి ఉంది. నిర్మాణ సంస్థ ఆర్వీఎన్ఎల్ ఈ మేరకు ట్రాక్‌ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం భూమి అవసరమని జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు అందజేసింది. వాటిపై ఎలాంటి పురోగతి లేదు. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 6.5 కిలోమీటర్ల మేర రెండో దశ విస్తరణలోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో దఫా జీఎమ్మార్‌తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
సర్వేకే లైన్ క్లియర్
కర్నూలు(రాజ్‌విహార్): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైను మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో మంత్రాలయం ఊసే ఎత్తని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు చివరి నిమిషంలో రూ.13.65 కోట్లు ప్రకటించారు. ఈ లైను ఏర్పాటును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా మళ్లీ సర్వే కోసం నిధులిస్తామని ప్రకటించడంతో జిల్లా ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అధ్యాత్రిక కేంద్రం మంత్రాలయం నుంచి జిల్లా కేంద్రం కర్నూలు వరకు కొత్త రైలు మార్గం నిర్మించాలని 45 ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు. కాని పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈలైనుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. రెండు సార్లు సర్వే కోసం కేటాయించిన నిధులు వృధాగా ఖర్చయ్యాయి. ఫలితం లేకుండా పోయింది. భూ సేకరణ, పనుల ప్రారంభానికి నిధులు మంజూరు కాకపోడంతో సర్వేతోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. కర్నూలుకు చెందిన మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి గతంలో ఏడాదిన్నర పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసినా ఈ మార్గం నిర్మాణానికి న్యాయం జరగలేదు. దీంతో ప్రజలతోపాటు భక్తులకు తీవ్ర నిరాశే మిగిలింది. 45 ఏళ్ల నాటి డిమాండ్.. ఇప్పటికీ కలగానే: వాస్తవానికి మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, కర్నూలు మీదుగా శైవక్షేత్రం శ్రీశైలం వరకు రైలు మార్గం నిర్మించాలన్నది దశాబ్దాల నాటి ప్రతిపాదన. 1970లో కర్నూలు పార్లమెంటు సభ్యులు, ఎమ్మిగనూరు ప్రాంత నేత వై.గాది లింగన్న గౌడ్ మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రస్తావించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటుకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండలు, లోయలు అడ్డంకిగా మారడంతో కర్నూలు వరకు కుదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కలగానే మిగిలింది. మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మంత్రాలయం లైను ఏర్పాటుకు ఆశలు రేకెత్తించారు. రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధి కోసం ఈ లైను నిర్మించాలని 2003లో అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎంపీ కేఈ కృష్ణమూర్తి (ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి) చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏటా ఎన్నికల హామీగా మిగిలిపోతున్న ఈ మార్గం నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు సమాచారం. కొంత మంది టీడీపీ ఎంపీల బృందం అప్పటి రైల్వే బోర్డు సభ్యుడు ఎర్రన్నాయుడుతో కలిసి రైల్వే మంత్రి నితీష్ కుమార్‌ను కలసి మంత్రాలయంకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు సానుకూలంగా స్పందించిన అప్పటి రైల్వే మంత్రి 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించడంతో సర్వే పూర్తి చేసి నివేదికలిచ్చారు. 2011లోనే రెండోసారి సర్వే: ఎన్నికల అస్త్రంగా మారిన మంత్రాలయం లైను ఏర్పాటుకు రాఘవేంద్ర స్వామి భక్తులు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రైల్వే మాజీ సహాయ మంత్రి మునియప్ప ద్వారా 2010లో మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో రైల్వే లైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ, భూ కొనుగోలు వ్యయం దృష్ట్యా రీ సర్వే చేయాలని నిర్ణయించారు. 2011 ఫిబ్రవరి 23న రైల్వే పనుల సర్వేకు రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టరు ప్రసాద్‌రెడ్డి టెండర్ దక్కించుకుని సర్వే పూర్తి చేసి 2011 డిసెంబర్లో సర్వే నివేదికలు సమర్పించినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే, రూ.6 కోట్లతో సర్వే చేసిన సంస్థ చివరకు గతంలో రూపొందించిన (ప్లానింగ్ మ్యాప్) మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని, మంత్రాలయం సమీపంలోని కొండాపురం వద్ద రైల్వే స్టేషను నిర్మించాలని సూచించింది. రైలు మార్గం ఏర్పాటయ్యే ప్రాంతాల్లోనే రైతుల పొలాల్లో హద్దులు కూడా నిర్ధారించారు. అయితే, ఇప్పుడు తాజాగా మళ్లీ సర్వే కోసమే నిధులు కేటాయించారు తప్ప భూ సేకరణ ఊసేలేదు. మొదట రూ.9.43 లక్షలతో సర్వే చేయగా రెండో సారి రూ.6 కోట్లతో రెండో సర్వే చేసి చివరకు మొదట చేసిన సర్వే ఆధారంగానే రైలు మార్గం నిర్మించుకోవచ్చని సూచించడం గమనార్హం. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సర్వే కోసమే నిధుల ప్రకటన చేశారు. దీంతో ఎన్ని సార్లు సర్వే చేస్తారని, ఇప్పటికే రెండుసార్లు సర్వేలు చేసి నిధులను దుర్వినియోగం చేశారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. సర్వే ఏజెన్సీలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు కంటితుడుపు చర్యగా నిధుల ప్రకటన చేశారు తప్ప పురోగతి కోసం కాని అంటున్నారు. కేంద్రంపై ఎంపీ బుట్టా ఒత్తిడి పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మంత్రాలయం రైలు మార్గం కలను నెరవేర్చాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పట్టుబట్టారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రకటన తరువాత మంత్రాలయం మార్గం ఊసేలేదని తెలిసి మంత్రి సురేశ్ ప్రభుతోపాటు ఎన్డీఏ పెద్దలను కలసి విజ్ఞప్తి చేయడంతో చివరి నిమిషంలో సర్వే కోసం రూ.13.65 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్థిలోకి వచ్చే ప్రాంతాలు కర్నూలు- మంత్రాలయం మధ్య రైలు మార్గం నిర్మస్తే నాలుగు నియోజకవర్గాలు అభివృద్ధిలోకి వస్తాయి. కర్నూలుతోపాటు పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలోని మండలాలు, పల్లెలు అభివృద్ధి చెందుతాయి. దీంతో వ్యాపార, వాణిజ్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుత రైలు మార్గం ఇలా.. రైలు మార్గాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చని సర్వే ప్లాన్ ఇచ్చారు. మంత్రాయం రోడ్డు నుంచి కర్నూలు మధ్య మాధవరం, మంత్రాలయం (మంచాల), ఇబ్రహింపురం, నందవరం, ఎమ్మిగనూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్.కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, కె. నాగులాపురం, పెద్ద కొట్టాల వద్ద స్టేషన్లు ఏర్పాటు చేసి కల్లూరు మండలం దూపాడు వద్ద ఉన్న పాత రైల్వే లైనులో అనుసంధానం చేస్తారు. ఇక్కడి నుంచి పాత పట్టాలపైనే రైళ్లు కర్నూలు స్టేషన్‌కు చేరుకుంటాయి. భారీగా పెరుగుతున్న అంచనాలు మంత్రాలయం రైలు మార్గం నిర్మాణ అంచనా విలువ ఏడాదికేడాది పెరుగుతోంది. 2004లో ప్రకటించిన బడ్జెట్లో రూ.165 కోట్లతో కర్నూలు- మంత్రాలయం మధ్య రైలు మార్గం నిర్మించాలని అంచనా వేశారు. అయితే ఆ విలువ 2011 నాటికి రూ.900 కోట్లకు చేరింది. తాజాగా ఇప్పుడు దీని నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10 కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100 కోట్లకు పైగా చేరుతుందని రైల్వే ఇంజినీర్ల అంచనా. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి
దక్షిణమధ్య రైల్వేలో విజయవాడ తరువాత అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లా నెల్లూరే. ఏడాదికి రూ.1500 కోట్లు పైన రాబడి తెచ్చిపెడుతున్న నెల్లూరు జిల్లాపై కేంద్రం కరుణించలేదు. రాష్ట్ర విభజన తరువాత కోస్టల్ కారిడార్‌గా నెల్లూరు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకపోవడమే కాకుండా.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కూడా విడుదల చేయకపోవడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ల ఏర్పాటుకు నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాకు వచ్చే వివిధ పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల ఊసేలేదు కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైల్వే అభివృద్ధిపై గత యూపీఏ ప్రభుత్వం వైఖరినే అనుసరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో 2010-11 బడ్జెట్లో రూ.1310 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే.. 2012 బడ్జెట్లో కేవలం రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.110 కోట్లు కేటాయించినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. ఇంకా రూ.1200 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఈ లైను పూర్తయితే మెట్టప్రాంతాలైన రాపూరు, వింజమూరు, ఆత్మకూరు, కనిగిరి తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల ఉదయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు కూడా. అయితే బడ్జెట్లో నామమాత్రంగా నిధులు విడుదల చేశారు. ఇకపోతే గూడూరు డివిజన్ దుగ్గరాజుపట్నంలో మరో ఓడరేవును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓడరేవు ఏర్పాటు చేస్తే జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓడరేవు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం గూడూరు నుంచి దుగ్గరాజుపట్నంకు రైలు మార్గాన్ని వేయాలని ప్రతిపాదించింది. అందుకు రూ.278 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు కూడా. అందులో భాగంగా 2013లో రూ. కోటి మంజూరు చేశారు. ఆ తరువాత రైల్వే లైను ఏర్పాటుకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. కృష్ణపట్నం- ఓబులాపురం రైల్వే లైనుకు గ్రహణం ఆసియాలో కృష్ణపట్నం ఓడరేవు ప్రసిద్ధి చెందినది. ఓడరేవు నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర వస్తువులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. అందుకు కృష్ణపట్నం నుంచి ఓబులాపురం వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.930 కోట్లు అంచాన వేశారు. రైల్వే లైను ఏర్పాటుకు 2011లో రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రైల్వే లైను పూర్తి చేశారు. మిగిలిన రైల్వే లైను ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని అధికారులు నివేదికలు పంపారు. అదే విధంగా ఓబులాపురం వరకు రైలుమార్గానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. ప్రస్తుత బడ్జెట్లో ఈ లైను ఏర్పాటు ఊసెత్తలేదు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అదే విధంగా బిట్రగుంటలో 1600 ఎకరాల్లో రైల్వే ఇంజన్లు మరమ్మతు కర్మాగారం ఏర్పాటు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసే లేకపోవడంతో జిల్లా వాసులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొత్త రైళ్లకు రెడ్ సిగ్నల్ కొత్త ప్రాజెక్టుల మాటెత్తకపోయినా.. కనీసం కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఉంటాయని జిల్లా ప్రజలు ఎదురు చూశారు. అదేవిధంగా ప్రధాన రైళ్లు నెల్లూరు, బిట్రగుంట, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ కల్పిస్తారని ఆశపడ్డారు. ఆ ఆశలపైనా కేంద్ర మంత్రి నీళ్లు చల్లారు. దీంతో నెల్లూరు నుంచి సికింద్రాబాద్ ఇంటర్సిటీ, నెల్లూరు- చెన్నై- విజయవాడ ‘మెమో’ రైళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, కోరమండల్, గరీబ్థ్,్ర పినాకిని, నవజీవన్ రైళ్లను ఆపే పరిస్థితి లేదు. మొత్తంగా కేంద్ర రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది. చార్జీల నుంచి మినహాయింపు బీజేపీ ప్రభుత్వం ప్రజలపై రైల్వే చార్జీల భారం మోపలేదు. తొలుత 200 కిలోమీటర్లు పైబడి చార్జీలు పెంచనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ బడ్జెట్లో అలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రప్రభుత్వం ఎక్కువగా ప్రయాణికులు సౌకర్యాలకు పెద్దపీఠ వేసింది. మహిళల భద్రతకు 182 హెల్ప్‌లైన్, రిజర్వేషన్ సౌకర్యం నాలుగు నెలలకు పొడిగింపు, ఏ,బీ గ్రేడు స్టేషన్లకు వైఫై సౌకర్యం, ప్రయాణికుల ఫిర్యాదుల కోసం మొబైల్ అప్, ైరె ళ్లు రాకపోకలు తెలిపేందుకు ఎస్ఎమ్ఎస్, మహిళల భోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర సౌకర్యాలను కల్పించింది. అదే విధంగా జిల్లాలోని రైల్యే స్టేషన్లకు వై ఫై సౌకర్యం మాత్రం ఏర్పాటు కానుంది.