టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో మళ్లీ పొలిటికల్ గవర్నెన్స్ కొనసాగాలి..
2029 గెలుపునకు ఇప్పటి నుంచే అడుగులు వేయాలి
ఉనికి కోసమే వినుకొండ హత్యకు జగన్ రాజకీయ రంగు
రాష్ట్రంలో శాంతి భద్రతలను నియంత్రిస్తాం.. పోలీసులు స్పందించకపోతే నేనే విచారణకు వస్తా
సాక్షి, అమరావతి : ‘ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. అభివృద్ధి.. సంక్షేమం చేసి చూపించడం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇందుకోసం ఎంపీలు కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు.
ఇప్పటికే ఐదు హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచి్చన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంపీలకు శాఖలు అప్పగించామని, ఆ మేరకు ఎన్ని నిధులు తెచ్చారు.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో అందరి పనితీరును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తానని తెలిపారు. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాలని, విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చూడాలని సూచించారు.
విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ స్టీల్, కడప ఉక్కుపైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలని సూచించారు. విశాఖలో రైల్వే జోన్‌కు అవసరమైన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలని చెప్పారు.
రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, కొత్త వలసలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. 2029లో కూడా పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని, దాన్ని 1995లో అమలు చేశానని చెప్పారు. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలని సూచించారు. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చని, ప్రజల తలరాతలు మార్చవచ్చని గతంలో చేసి చూపించామన్నారు.
వ్యక్తిగత కారణాలతోనే వినుకొండ హత్య
పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఉనికి కోసం దానికి జగన్ రాజకీయ రంగు వేస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరించారన్నారు. పోలీసుల విచారణలో కూడా అదే విషయం తేలిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తర్వాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.
ఉనికి చాటుకోవడానికే జగన్ హింసా రాజకీయాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఫేక్ పాలిటిక్స్‌నే నమ్ముకున్నాడని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఇకపై నేరస్తుల ఆటలు ఏమాత్రం సాగనివ్వమన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే తానే స్వయంగా విచారణకు వస్తానన్నారు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment