దక్షిణమధ్య రైల్వేలో విజయవాడ తరువాత అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లా నెల్లూరే. ఏడాదికి రూ.1500 కోట్లు పైన రాబడి తెచ్చిపెడుతున్న నెల్లూరు జిల్లాపై కేంద్రం కరుణించలేదు. రాష్ట్ర విభజన తరువాత కోస్టల్ కారిడార్‌గా నెల్లూరు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకపోవడమే కాకుండా.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కూడా విడుదల చేయకపోవడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ల ఏర్పాటుకు నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాకు వచ్చే వివిధ పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల ఊసేలేదు
కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైల్వే అభివృద్ధిపై గత యూపీఏ ప్రభుత్వం వైఖరినే అనుసరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత యూపీఏ ప్రభుత్వం హయాంలో 2010-11 బడ్జెట్‌లో రూ.1310 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే.. 2012 బడ్జెట్‌లో కేవలం రూ.8 లక్షలు
మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.110 కోట్లు కేటాయించినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. ఇంకా రూ.1200 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఈ లైను పూర్తయితే మెట్టప్రాంతాలైన రాపూరు, వింజమూరు, ఆత్మకూరు, కనిగిరి తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల ఉదయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు కూడా. అయితే బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు విడుదల చేశారు.
ఇకపోతే గూడూరు డివిజన్ దుగ్గరాజుపట్నంలో మరో ఓడరేవును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓడరేవు ఏర్పాటు చేస్తే జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓడరేవు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం గూడూరు నుంచి దుగ్గరాజుపట్నంకు రైలు మార్గాన్ని వేయాలని ప్రతిపాదించింది. అందుకు రూ.278 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు కూడా. అందులో భాగంగా 2013లో రూ. కోటి మంజూరు చేశారు. ఆ తరువాత రైల్వే లైను ఏర్పాటుకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు.
కృష్ణపట్నం- ఓబులాపురం రైల్వే లైనుకు గ్రహణం
ఆసియాలో కృష్ణపట్నం ఓడరేవు ప్రసిద్ధి చెందినది. ఓడరేవు నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర వస్తువులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. అందుకు కృష్ణపట్నం నుంచి ఓబులాపురం వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.930 కోట్లు అంచాన వేశారు. రైల్వే లైను ఏర్పాటుకు 2011లో రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రైల్వే లైను పూర్తి చేశారు. మిగిలిన రైల్వే లైను ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని అధికారులు నివేదికలు పంపారు. అదే విధంగా ఓబులాపురం వరకు రైలుమార్గానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ లైను ఏర్పాటు ఊసెత్తలేదు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అదే విధంగా బిట్రగుంటలో 1600 ఎకరాల్లో రైల్వే ఇంజన్లు మరమ్మతు కర్మాగారం ఏర్పాటు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసే లేకపోవడంతో జిల్లా వాసులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
కొత్త రైళ్లకు రెడ్ సిగ్నల్
కొత్త ప్రాజెక్టుల మాటెత్తకపోయినా.. కనీసం కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఉంటాయని జిల్లా ప్రజలు ఎదురు చూశారు. అదేవిధంగా ప్రధాన రైళ్లు నెల్లూరు, బిట్రగుంట, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ కల్పిస్తారని ఆశపడ్డారు. ఆ ఆశలపైనా కేంద్ర మంత్రి నీళ్లు చల్లారు. దీంతో నెల్లూరు నుంచి సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ, నెల్లూరు- చెన్నై- విజయవాడ ‘మెమో’ రైళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, కోరమండల్, గరీబ్థ్,్ర పినాకిని, నవజీవన్ రైళ్లను ఆపే పరిస్థితి లేదు. మొత్తంగా కేంద్ర రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది.
చార్జీల నుంచి మినహాయింపు
బీజేపీ ప్రభుత్వం ప్రజలపై రైల్వే చార్జీల భారం మోపలేదు. తొలుత 200 కిలోమీటర్లు పైబడి చార్జీలు పెంచనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రప్రభుత్వం ఎక్కువగా ప్రయాణికులు సౌకర్యాలకు పెద్దపీఠ వేసింది. మహిళల భద్రతకు 182 హెల్ప్‌లైన్, రిజర్వేషన్ సౌకర్యం నాలుగు నెలలకు పొడిగింపు, ఏ,బీ గ్రేడు స్టేషన్లకు వైఫై సౌకర్యం, ప్రయాణికుల ఫిర్యాదుల కోసం మొబైల్ అప్, ైరె ళ్లు రాకపోకలు తెలిపేందుకు ఎస్‌ఎమ్‌ఎస్, మహిళల భోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర సౌకర్యాలను కల్పించింది. అదే విధంగా జిల్లాలోని రైల్యే స్టేషన్లకు వై ఫై సౌకర్యం మాత్రం ఏర్పాటు కానుంది.
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి
Published Fri, Feb 27 2015 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement