ఉమ్మడిగా రైల్వే ప్రాజెక్టులు
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు
- రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అభినందనీయం
- వీడియో లింకు ద్వారా పలు అభివృద్ధి పనులు ప్రారంభం
- జగిత్యాల–మోర్తాడ్ సర్వీసుకు పచ్చజెండా ఊపిన మంత్రి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తోందని, ఇప్పటి వరకు చేపట్టిన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఢిల్లీలోని రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను, నాంపల్లి రైల్వేస్టేషన్‌లో నిర్మించిన ఆర్‌వోబీని, ఈ రెండు స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని, సికింద్రాబాద్ స్టేషన్‌లో ఎంఎంటీఎస్ బుకింగ్ కేంద్రాలను, ఎల్‌ఈడీ లైట్లను కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీ కవిత, రైల్వే ఉన్నతాధికారులతో కలసి ప్రారంభించారు.
కరీంనగర్– లింగంపేట్– జగిత్యాల సెక్షన్‌లో నడుస్తున్న డెమూ ప్యాసింజర్ ను మోర్తాడ్ వరకు పొడిగింపునకు పచ్చా జెండా ఊపారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా (ఉమ్మడి సంస్థగా) ఏర్పడి ప్రాజెక్టులను పూర్తి చేస్తా యన్నారు. కొన్ని ప్రాజెక్టుల వ్యయాన్ని పంచు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, సహకా రాన్ని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 790 కోట్ల రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నా యన్నారు. ప్రస్తుతం 104 రైల్వే స్టేషన్‌లలో హైస్పీడ్ వైఫై సదు పాయం ఉందని, 2017 చివరికి మొత్తం 200 స్టేషన్‌లలో ఈ సేవలను విస్తరించనున్నామ న్నారు. పూర్తి భద్రతతో కూడిన, మెరుగైన రైల్వే సేవలను అందజేయడమే తమ లక్ష్యమన్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశకు అనుమతి: దత్తాత్రేయ
ప్రధాని, రైల్వే మంత్రి పెద్దపల్లి–నిజామాబాద్ లైనుకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తుం డడం సంతోషకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2017 చివరిలోగా ఈ రైల్వే లైను పూర్తవుతుందని ఆకాంక్షించారు. మౌలాలీ– సనత్ నగర్ మధ్య రక్షణ శాఖ భూముల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు అనుమతి లభించిందని చెప్పారు. ఇటు భువనగిరి, యాదాద్రి వరకు, అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్– కాజీపేట్ మార్గంలో మూడో లైన్ నిర్మించాలని, కాజీపేట్‌లో ని వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నామన్నారు.
పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం సంతోషిం చదగిన విషయమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. 2017 చివరి కల్లా పెద్దపల్లి–నిజామా బాద్ మధ్య రైల్వే సేవలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డెమూ రైలును మోర్తాడ్ వరకు పొడిగించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలి పారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభో త్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మహ్మద్ అలీఖాన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వశిష్ట జోహ్రీ తదితరులు పాల్గొన్నారు.