రూ.2,300 కోట్లతో అమరావతి రైల్వేలైన్‌కు డీపీఆర్
విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి సహకారం
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
కడప–బెంగళూరు లైన్ పనులు సత్వరం పూర్తిచేయాలన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, అమరావతి: మూడేళ్ల క్రితం రూ.55 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. వాటిలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, కొత్త లైన్ల కోసం సర్వే మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణం కోసం రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వేశాఖకు సమర్పించామని ఆయన చెప్పారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రతిపాదనల కోసం రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు శుక్రవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం.. జీఎం మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లలో 33 రైల్వేస్టేషన్లలో 88 కొత్త లిఫ్టులు, 19 రైల్వేస్టేషన్లలో 218 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక 101 మానవరహిత లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు.
257 లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలో 56 రైల్వేస్టేషన్లను రూ.2,593 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, అదనపు స్టాపేజీలు, ఆర్ఓబీలు–ఆర్‌యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం ఎంపీలు చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు.
విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, సీఎం రమేశ్, జీఎం హరీశ్ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్, కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్ తదితర ఎంపీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment