కోనసీమ రైల్వే లైన్‌కు అడుగడుగునా ఆటంకాలే
కొత్త అలైన్‌మెంట్‌ను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు
రెండు దశాబ్దాలుగా కొలిక్కి రాని పనులు
నేడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంపీల సమావేశం
సాక్షి, అమలాపురం: కోనసీమ రైలు బండి ఇంకా పట్టాలెక్కలేదు. కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. రెండు పుష్కరాలు దాటుతున్నా ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. తొలి పన్నెండేళ్లు నిధుల కేటాయింపు జరక్కపోగా.. తరువాత పన్నెండేళ్లు నిధులు కేటాయిస్తున్నా పనుల వేగం పుంజుకోలేదు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని ఎంపీలతో శుక్రవారం విజయవాడలో రైల్వే అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఇబ్బందులు, నిధులు కేటాయింపులపై చర్చ జరగాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అడ్డు తగులుతున్న టీడీపీ నేతలు
గౌతమి గోదావరి పాయ వద్ద 41 పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణ పనులకు గత నవంబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలు కాలేదు. వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై గడ్డర్ల నిర్మాణాలు జరిగితే గాని ట్రాక్ నిర్మాణం చేయలేరు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25 శాతం వాటాలో కేవలం రూ.2 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేయగా.. ఆ నిధులూ ఇవ్వలేదు.
తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో అలైన్‌మెంట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసేకరణకు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతుండటం గమనార్హం.సహస్రాబ్దిలో శంకుస్థాపన కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నరసాపురం వరకూ రైల్వే లైన్ నిర్మాణానికి 2000 నవంబర్ 16న శంకుస్థాపన జరిగింది. మొత్తం 102.507 కిలోమీటర్ల పొడవైన కాకినాడ–నరసాపురం రైల్వే లైన్‌లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45.30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం గతంలోనే పూర్తయ్యింది.
కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57.207 కిలోమీటర్లు నిరి్మంచాల్సి ఉండగా.. ఇందులో కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకూ 12.05 కిలోమీటర్ల మేర భూసేకరణ జరిగింది. భట్నవిల్లి నుంచి నరసాపురం వరకూ సుమారు 45.157 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలి. దీనికి అప్పట్లో రూ.400 కోట్లు అవసరమని అంచనా వేయగా.. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం ఏకంగా రూ.2,120.16 కోట్లకు పెరిగింది. పనులు ఇంకా ఆలస్యమైతే అంచనాలు మరింత పెరగనున్నాయి.
త్వరగా పూర్తయ్యేలా నిర్ణయం ఉండాలి
కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు విడుదలైనా భూసేకరణ, ట్రాక్ పనుల విషయంలో జాప్యం జరుగుతోంది. కోనసీమలో త్వరితగతిన రైలు పరుగులు పెట్టేలా ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. భూసేకరణ, ట్రాక్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.
– డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం
గడ్డర్ల పనులకు టెండర్లు పిలవాలి
వైనతేయ, వశిష్ట నదులపై వంతెనలకు గడ్డర్ల నిర్మాణాలకు టెండర్లు పిలవాలి. దీనిపై ఎంపీల సమావేశం నిర్ణయం తీసుకుని టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టేలా చర్యలు చేపట్టాలి. మొక్కుబడి సమావేశంగా కాకుండా రానున్న నాలుగేళ్లలో కోనసీమలో రైలు నడిచేలా అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ కృషి చేయాలి.
– బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ జేఏసీ, అమలాపురం
నేడు ఏపీ ఎంపీలతో సమావేశం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ రాష్ట్ర ఎంపీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. విజయవాడలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం మొదలవుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి, కొత్త రైల్వేలైన్లు, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment