![Chandrababu Naidu government failure in implementing railway projects](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/train.jpg.webp?itok=1xAVpeDZ)
అరకు, కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్
రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం
విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు
వాల్తేర్ డివిజన్ విభజన.. విశాఖపట్నం, రాయగడ డివిజన్ల ఏర్పాటు
రాయగడ పరిధిలోకి అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్
టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ కూడా అయిన విశాఖపట్నం రైల్వే జోన్‌ను అనుకున్న విధంగా సాధించలేక చేతులెత్తేసింది. ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. అత్యధిక రాబడినిచ్చే కొత్తవలస–కిరండోల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేస్తూ కేంద్ర రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయతో సహా కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్‌లో చేర్చింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖపట్నం రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడనుంది. జోన్ అభివృద్ధికి పురిట్లోనే గండి కొట్టినట్లయింది.
విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రైల్వే జోన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ స్వరూపంపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.
విశాఖపట్నం, రాయగడ డివిజన్ల ఏర్పాటు
2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్వర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్టుగా రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే కేకే లైన్‌తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తరకోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఉన్న చోట రైల్వే డివిజన్ కేంద్రం లేకపోవడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా జోన్‌లో చేరిస్తే ఆ రెండు జిల్లాలకు రైల్వే ప్రాజెక్టుల్లో తగిన న్యాయం జరగదని, కేకే లైన్‌ను కోల్పోతే విశాఖ జోన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధ్యం కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేకై లైన్‌తోసహా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని.. విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేశారు.
అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని కోరింది. వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు కూడా అదే డిమాండ్ చేశాయి. మరోవైపు రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఒడిశా వాసులు పట్టుబట్టారు.
కేకే లైన్ లేకుండా విశాఖ డివిజన్ ఏర్పాటు
2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్‌ను పూర్తిగా బేఖాతరు చేసింది.
దాంతో ఒడిశా ఒత్తిడికి తలొగ్గుతూ కేంద్ర రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ స్థానంలో విశాఖపట్నం, రాయగడ కేంద్రాలుగా రెండు వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్‌ను చేర్చింది.
కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస–కిరండోల్ సెక్షన్‌తోపాటు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో విశాఖపట్నం డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఖరారైంది. అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను విభజించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. దాంతో దక్షిణ కోస్తా రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్ల స్వరూపం ఇలా ఉండనుంది.
ఇక విశాఖపట్నం, రాయగడ డివిజన్లు ఇలా
» విశాఖపట్నం డివిజన్: పలాస– విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపాడ జంక్షన్– పర్లాఖిముడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వదలపూడి– దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం సెక్షన్లు.
» రాయగడ డివిజన్: కొత్తవలస– కిరండోల్, బచ్చెలి / కిరండోల్, కూనేరు– తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్– కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గుణుపూర్ సెక్షన్లు.
పలు డివిజన్ల పరిధిలో స్వల్ప మార్పులు
» గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్ – వాడి సెక్షన్‌ను సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెస్తారు. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వేలకు మధ్య ఆ సెక్షన్ ఇంటర్ ఛేంజ్ పాయింట్‌గా ఉంది. దాంతో పరిపాలన పరమైన సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెచ్చారు.
» గుంటూరు డివిజన్ పరిధిలోని విష్ణుపురం నుంచి పగడిపిల్లి, విష్ణుపురం నుంచి జన్‌పాహడ్ సెక్షన్లను సికింద్రాబాద్ డివిజన్‌లోకి తెస్తారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి చేరుస్తారు. సింగరేణి నుంచి బొగ్గు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
» దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొండపల్లి నుంచి మోతుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్ పరిధిలోకి తెస్తారు. తద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో చేరుస్తారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్, రాయనపాడు వర్క్ షాపులకు ఇబ్బంది లేకుండా జోనల్ పరిధిని సర్దుబాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment